CMతో సినీపెద్దల భేటీ వాయిదా.. అసలు కారణం?
సినిమాలు- రాజకీయాలు ఒకదానికొకటి ముడిపడిన విషయాలు. నాయకులు, నటులు కచ్ఛితంగా కలిసి ఆడాలి ఇక్కడ.
By: Tupaki Desk | 16 Jun 2025 1:10 PM ISTసినిమాలు- రాజకీయాలు ఒకదానికొకటి ముడిపడిన విషయాలు. నాయకులు, నటులు కచ్ఛితంగా కలిసి ఆడాలి ఇక్కడ. మంచి ఔట్ పుట్ రాబట్టాలంటే, ఒకరికొకరు ప్రమోట్ చేసుకోవాలంటే ఇరువురి సాంగత్యం తప్పనిసరి. కానీ ఒకరంటే ఒకరు మండి పడే పరిస్థితి ఉందిప్పుడు. ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసేందుకు టాలీవుడ్ పెద్దలు ఎవరూ ముందుకు రాకపోవడంతో అది ఉప ముఖ్యమంత్రి పవన్ లో కోపాగ్నికి కారణమైంది. రిటన్ గిఫ్ట్ ముందుంది! అంటూ హెచ్చరించారు పవన్.
ఆ తర్వాత దిగొచ్చిన సినీపెద్దలు నేరుగా ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని కలిసి శాంతింపజేసేందుకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను కలిసి పరిశ్రమ వ్యవహారాలను చర్చించేందుకు ఒక తేదీని కూడా ఫిక్స్ చేశారు. అన్నీ కుదిరితే ఈ ఆదివారం (15జూన్) ఈ భేటీ ముగిసి ఉండేది. ఈపాటికే ఔట్ పుట్ వచ్చేది. కానీ రాలేదు. ఈ కీలక సమావేశం వాయిదా పడింది. దానికి సవాలక్ష కారణాలు.
సమావేశం జరగాల్సిన ఒక రోజు ముందు, కొందరు పెద్ద స్టార్లు ఔట్ డోర్ షూటింగుల కారణంగా అందుబాటులో లేరని కథనాలొచ్చాయి. దీని కారణంగానే వాయిదా వేసారా? అంటే..! ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ ఇచ్చినప్పుడు స్టార్లు ఎన్ని పనులు ఉన్నా సర్ధేసి రావాలి కదా! అనే సందేహం తలెత్తింది. తాజాగా అందిన సమాచారం మేరకు అసలు ఈ భేటీ వాయిదా వెనక అసలు కారణం తెలిసింది. కీలకమైన భేటీ రద్దవ్వడానికి కారణం.. ఇటు రాజకీయ నాయకులు, అటు నటులు కూడా బిజీగా ఉండటమేనని తెలిసింది. ముఖ్యంగా చంద్రబాబు గత ఆదివారం నాడు, కీలకమైన సమావేశంలో బిజీగా ఉన్నారు. వాణిజ్య పన్ను సంస్కరణలపై చర్చించడానికి ఆయన వెలగపూడిలో కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌ను కలిశారు. రాజకీయంగా అత్యవసర భేటీ ఇది. అందువల్ల బాబు వేరొక సమావేశానికి హాజరయ్యే పరిస్థితి లేదు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ విదేశాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆయన కూడా సమావేశానికి హాజరయ్యే పరిస్థితి లేదని తెలిసింది.
సమావేశానికి తప్పనిసరిగా అవసరమైన ఇద్దరు నాయకులు అందుబాటులో లేకపోవడం నిరాశే.. అదే సమయంలో పలువురు పెద్ద స్టార్ల బిజీ షూటింగ్ షెడ్యూల్ కారణంగా అందుబాటులో లేకపోవడంతో సమావేశం రద్దు చేసారని తెలిసింది. నెక్ట్స్ డేట్ ఎప్పుడు? అనేది ఇంకా తేలలేదు. కానీ మరో వారం లేదా రెండు వారాల్లో కీలకమైన భేటీని ఏర్పాటు చేస్తారని భావిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలతో సినీపెద్దల భేటీ ముగిస్తే, ఆ తర్వాత పరిశ్రమ సమస్యల గురించి కీలక వ్యక్తులు చర్చించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ అత్యంత కీలకమైన మొదటి భేటీ వాయిదా పడటం నిజంగా పెద్ద నిరాశ.
