వంశీ పైడిపల్లి ఇంత సైలెంట్ అయిపోయాడేంటో?
టాలీవుడ్‌లో జరిగిన మార్పుల గురించి చెప్పాల్సి వస్తే `బాహుబలి`కి ముందు `బాహుబలి`కి తరువాత అని చెప్పక తప్పదు.
By: Tupaki Desk | 17 May 2025 1:00 PM ISTటాలీవుడ్‌లో జరిగిన మార్పుల గురించి చెప్పాల్సి వస్తే `బాహుబలి`కి ముందు `బాహుబలి`కి తరువాత అని చెప్పక తప్పదు. ఎందుకంటే `బాహుబలి` తరువాత తెలుగు సినిమా స్వరూపమే సమూలంగా మారిపోయింది. మార్కెట్ పెరిగింది. బడ్జెట్ కూడా పతాక స్థాయికి చేరింది. దీనికి తగ్గట్టుగానే సినిమాల బిజినెస్ కూతా పెరిగింది. చిన్న హీరో సినిమా కూడా ఇప్పుడు ఉత్తరాదిలోనూ సేల్ అవుతోందంటే దానికి కారణం `బాహుబలి`. అయితే ఇదే సినిమా కారణంగా కొంత మంది దర్శకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
`బాహుబలి`, RRR తరువాత ప్రతి హీరో టార్గెట్ పాన్ ఇండియా. దీంతో దర్శకులకు హీరోలు లభించని పరిస్థితి తలెత్తుతోంది. కొంత మంది తర్శకులు అందుబాటులో ఉన్న హీరోలతో సర్దుకుంటుంటే కొంత మంది దర్శకులు మాత్రం స్టార్ హీరోతో మాత్రమే సినిమా చేస్తానంటూ భీష్మించుకు కూర్చుంటున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోలు చాలా వరకు పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లకు లాక్ అయిపోవడంతో సదరు దర్శకులకు పనిలేకుండా పోతోంది. దీంతో సినిమా చేసి ఏళ్లు గడుస్తున్నా మరో ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించలేకపోతున్నారు.
ప్రస్తుతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి. దళపతి విజయ్ హీరోగా 2023లో వంశీపైడిపల్లి చేసిన మూవీ `వారీసు`. తమిళంలో రూపొందించిన ఈ సినిమాని తెలుగులో `వారసుడు` పేరుతో రిలీజ్ చేయడం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టిన ఈ మూవీ విడుదలై రెండేళ్లు దాటింది. ఇంత వరకు వంశీ పైడిపల్లి నుంచి మరో ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్ డేట్ లేదు.
బోయపాటి శ్రీను, పూరి జగన్నాథ్, కొరటాల శివ, శేఖర్ కమ్ముల, అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్లు సినిమాలు చేస్తున్నా వంశీ పైడిపల్లి మాత్రం ఇంత వరకు మరో ప్రాజెక్ట్‌ని ప్రకటించలేక సైలెంట్ అయిపోయాడు. తను కొత్త ప్రాజెక్ట్‌ని ప్రకటించకపోవడానికి కారణం స్టార్ హీరోలు ఎవరూ ఖాలీగా లేకపోవడమే. తనకు స్టార్ హీరో కావాలి. కానీ ఏ హీరో డేట్స్ ఖాలీగా లేవు. దీంతో తనకు కావాల్సిన హీరో డేట్స్ దొరికే వరకు కొత్త ప్రాజెక్ట్‌ని ప్రకటించే ఉద్దేశ్యం లేకపోవడంతో వంశీ పైడిపల్లి గత రెండేళ్లుగా సైలెంట్ అయ్యారని ఇన్ సైడ్ టాక్.
వారీసు టైమ్‌లో మహేష్ తో సినిమా చేయాలనిప్రయత్నాలు చేశాడు కానీ తను చెప్పిన కథ మహేష్‌కు నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఆ తరువాత తమిళ హీరో విజయ్‌ని సంప్రదించడం, తను ఓకే చేయడంతో `వారీసు` తెరపైకొచ్చింది. మళ్లీ వంశీ పైడిపల్లి సినిమా చేయాలంటే తను కోరుకున్న స్టార్ హీరో డేట్స్ ఇవ్వాల్సిందే. అప్పుడు కానీ వంశీ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం లేదు.
