సైబర్ క్రైమ్ కు మరో టాలీవుడ్ నటి బలైందా?
అయితే తాజాగా మరో టాలీవుడ్ నటి కూడా సైబర్ క్రైమ్ బారిన పడినట్లు తెలుస్తోంది.
By: M Prashanth | 9 March 2026 12:11 PM ISTరోజురోజుకు సైబర్ క్రైమ్ ఘటనలు పెరుగుతున్నాయి. సోషల్ మీడియా వాడకం పెరుగుతున్న కొద్దీ ఆన్ లైన్ వేధింపులు, ఫేక్ అకౌంట్లు, తప్పుడు పోస్టులు చాలా ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే తాజాగా మరో టాలీవుడ్ నటి కూడా సైబర్ క్రైమ్ బారిన పడినట్లు తెలుస్తోంది.
ఆ ఘటనపై ఆమె రీసెంట్ గా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం.. సోషల్ మీడియాలో తన పేరుతో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని ఆ నటి ఫిర్యాదులో పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు కొన్ని ఫేక్ అకౌంట్ల ద్వారా తన పేరును ఉపయోగించి అవమానకరమైన కంటెంట్ ను పోస్టు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
ఆ పోస్టులు తన వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకుని చేశారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తన పేరుతో వస్తున్న అసభ్య పోస్టులు, మెసేజెస్ చాలా మానసిక ఒత్తిడిని కలిగించాయని ఆమె పోలీసులకు తెలిపినట్లు తెలిసింది. ప్రజల ముందు కొన్నిసార్లు అవమానకరంగా అనిపిస్తుందని కూడా ఆమె పేర్కొన్నట్లు సమాచారం.
అయితే సైబర్ క్రైమ్ ఘటనపై నటి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రీసెంట్ గా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ పోస్టులు నటి వ్యక్తిత్వానికి హాని కలిగించేలా ఉన్నాయని గుర్తించినట్లు తెలుస్తోంది. ఆమె కెరీర్ తో పాటు గౌరవానికి నష్టం కలిగించే విధంగా ఉన్నాయని ఐడెంటిఫై చేశారని సమాచారం.
అసభ్యకరమైన కంటెంట్ ను పోస్టు చేసిన సోషల్ మీడియా అకౌంట్ల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు ప్రారంభించారట. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ నుంచి వివరాలు సేకరిస్తున్నారని సమాచారం. అలాగే ఆ పోస్టులు ఎక్కడి నుంచి, ఏ ఐపీ అడ్రస్ నుంచి అప్లోడ్ అయ్యాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. డిజిటల్ ప్రూఫ్స్ సేకరించి దర్యాప్తును స్పీడప్ చేస్తున్నట్లు వెల్లడించారు.
అయితే ఈ కేసులో నిందితులను గుర్తించిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. సైబర్ క్రైమ్, పరువు నష్టం చట్టాల కింద కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తామని వెల్లడించారు. అదే సమయంలో సైబర్ క్రైమ్ అధికారులు ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం, ఎవరికైనా ఇబ్బంది కలిగేలా పోస్టులు పెట్టడం నేరమని ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తున్నారు. అసభ్యకరమైన కంటెంట్ ను ప్రచారం చేస్తే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
