Begin typing your search above and press return to search.

2026 లో యువ ద‌ర్శ‌కుల‌దే హ‌వా!

రాజ‌మౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగా, కొర‌టాల శివ‌, త్రివిక్ర‌మ్ లాంటి సీనియ‌ర్ డైరెక్ట‌ర్ల చిత్రాలేవి ఈ ఏడాది రిలీజ్ అయ్యే ప‌రిస్థితి లేదు.

By:  Srikanth Kontham   |   26 Feb 2026 4:00 AM IST
2026 లో యువ ద‌ర్శ‌కుల‌దే హ‌వా!
X

రాజ‌మౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగా, కొర‌టాల శివ‌, త్రివిక్ర‌మ్ లాంటి సీనియ‌ర్ డైరెక్ట‌ర్ల చిత్రాలేవి ఈ ఏడాది రిలీజ్ అయ్యే ప‌రిస్థితి లేదు. వీరిలో కొంత మంది కొత్త చిత్రాల‌తో ఆన్ సెట్స్ లో బిజీగా ఉండ‌గా, మ‌రికొంత మంది కొత్త ప్రాజెక్ట్ ల‌ను సెట్ చేసుకునే ప‌నిలో ప‌డ్డారు. వీరంద‌రిపై స్క్రీన్ పై క‌నిపించేది వ‌చ్చే ఏడాది మాత్ర‌మే . అప్ప‌టి వ‌ర‌కూ టాలీవుడ్ లో హ‌డా ఎవ‌రిది అంటే యువ ద‌ర్శ‌కుల‌దనే చెప్పాలి. ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు తెర‌కెక్కిస్తోన్న `పెద్ది` ఈ స‌మ్మ‌ర్ లో పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది. చెప్పుకోవ‌డానికి పెద్ద ప్రాజెక్ట్.

కానీ బుచ్చిబాబు మాత్రం యువ ద‌ర్శ‌కుడే. అత‌డికిది కేవ‌లం రెండ‌వ చిత్రం మాత్ర‌మే. `ఉప్పెన‌` మంచి విజ‌యం సాధించ‌డంతో అత‌డిపై న‌మ్మ‌కంతో రామ్ చ‌ర‌ణ్ ఛాన్స్ ఇచ్చాడు. రోహిత్ కె.పి అనే కొత్త కుర్రాడు సాయి తేజ్ హీరోగా న‌టిస్తోన్న‌ `సంబ‌రాల ఏటిగ‌ట్టు` తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఈ చిత్రాన్ని 100 కోట్ల‌ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇదొక హై-వోల్టేజ్ పీరియడ్ యాక్షన్ డ్రామా. 1960ల నాటి నేపథ్యంలో సాగే కల్పిత కథగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేయడమే కాకుండా, గ్రాఫిక్స్ విఎఫ్ ఎక్స్ పరంగా కూడా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నారు.

రోహిత్ కె.పీ `లాల్ సింగ్ చద్దా` , `బంటీ ఔర్ బబ్లీ 2` వంటి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ ప‌నిచేసాడు. అలాగే తొలి సినిమా `బింబిసార‌`తో వ‌శిష్ట మంచి విజ‌యాన్ని అందుకున్నాడు. దీంతో మెగాస్టార్ చిరంజీవి పిలిచి మ‌రీ అవ‌కాశం ఇచ్చారు. ఇద్ద‌రి కాంబినేష‌న్ లో `విశ్వంభ‌ర` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ద‌ర్శ‌కుడిగా వ‌శిష్ట‌కు ఇది రెండ‌వ చిత్రం. సోషియా ఫాంట‌సీ థ్రిల్ల‌ర్ ఇది. సినిమా విజువ‌ల్ గా హైలైట్ కానుంది. ఆ కార‌ణంగా ప్రాజెక్ట్ రిలీజ్ కూడా ఆల‌స్యం జ‌రుగుతోంది. అలాగే మ్యాచో స్టార్ గోపీచంద్ క‌థ‌నాయ‌కుడిగా సంక‌ల్ప్ రెడ్డి మ‌రో ప్ర‌యోగాత్మ‌క చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఇది ఏడ‌వ శ‌తాబ్దానికి చెందిన క‌థ‌గా హైలైట్ అవుతుంది. `ఘాజీ` త‌ర్వాత సంక‌ల్ప్ కు స‌రైన స‌క్సెస్ ప‌డ‌ని నేప‌థ్యంలో ఈ సినిమా తో బౌన్స్ బ్యాక్ అవుతాడ‌ని ఆశీస్తున్నారు. అలాగే శ్రీకాంత్ ఓదెల త‌న రెండ‌వ చిత్రాన్ని నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా `ది ప్యార‌డైజ్` ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. ఇద్ద‌రి కాంబినేష‌న్ లో తొలిసారి రిలీజ్ అయిన `ద‌స‌రా` భారీ విజ‌యం సాధించ‌డంతో? వెంట‌నే మ‌ళ్లీ చేతులు క‌లిపారు. ఈ స‌మ్మ‌ర్ లోనే ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇంకా నాగ చైత‌న్య హీరోగా కార్తీక్ దండు `వృశ‌క‌ర్మ` అనే మిస్ట‌క‌ల్ థ్రిల్ల‌ర్ ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం స‌మ్మ‌ర్ ముగిసేలోపు రిలీజ్ కానుంది.