'2025' గుణపాఠం.. ఇప్పటికైనా మేకర్స్ అలా చేస్తే బెటర్!
2025లో ఇప్పటికే ఏడు నెలలు గడిచిపోయాయి. మరో ఐదు రోజుల్లో 8వ నెల కూడా కంప్లీట్ అవుతుంది. అయితే ఈ ఏడాదిలో ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
By: M Prashanth | 25 Aug 2025 10:28 AM IST2025లో ఇప్పటికే ఏడు నెలలు గడిచిపోయాయి. మరో ఐదు రోజుల్లో 8వ నెల కూడా కంప్లీట్ అవుతుంది. అయితే ఈ ఏడాదిలో ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ అన్నీ విజయం సాధించలేదు. కొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి నిరాశపరిచాయి. ఇంకొన్ని అనుకోకుండా హిట్స్ గా మారాయి.
మరికొన్ని మిక్స్ డ్ టాక్ అందుకున్నాయి. అయితే బడ్జెట్, క్యాస్టింగ్ సహా పలు విషయాలతో సంబంధం లేకుండా వివిధ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. భారీ వసూళ్లను రాబట్టాయి. అదే సమయంలో 2025లో హిట్స్ గా నిలిచిన కొన్ని సినిమాలు.. టాలీవుడ్ చిత్ర నిర్మాతలకు గుణపాఠం నేర్పాయనే చెప్పాలి.
ఎందుకంటే ఇప్పుడు తెలుగులో చాలా మంది మేకర్స్ తో పాటు నటీనటులు కేవలం పాన్ ఇండియా సినిమాలపైనే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఆడియన్స్ ఏమి ఆశిస్తున్నారో అర్థం చేసుకోకుండా ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు అర్థమవుతోంది. అందుకే వారంతా అనుకున్నంత స్థాయిలో హిట్స్ ను సొంతం చేసుకోలేకపోతున్నారు.
ఆడియన్స్ మాత్రం ఇప్పుడు కేవలం కంటెంట్ మాత్రమే కోరుకుంటున్నట్లు 2025 మరోసారి నిరూపించింది. బడ్జెట్, స్టార్ క్యాస్టింగ్ తో పాటు పాన్ ఇండియా రేంజ్ తో తమకు సంబంధం లేదని సినీ ప్రియులంతా ప్రూవ్ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం, కోర్టు, సింగిల్, తండేల్ వంటి చిత్రాల విషయంలో అదే జరిగింది.
కామెడీ జోనర్ లో వచ్చిన సింగిల్ ను.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాను.. ఇంటెన్స్ డ్రామా అయినా కోర్టు సహా ఆయా చిత్రాలను ఆడియన్స్ ప్రోత్సహించారు. ఆ చిత్రాలు మంచి హిట్స్ గా నిలవగా.. గేమ్ ఛేంజర్, వార్-2, కూలీ వంటి సినిమాలు మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో రూపొంది రిలీజ్ అయినా ఆకట్టుకోలేకపోయాయి.
ఆడియన్స్ సింపుల్ గా వాటిని తిరస్కరించారు. కుబేరా తెలుగులో హిట్ అయినా మిగతా భాషల్లో తేలిపోయింది. దీంతో ట్రెండ్స్ చూస్తే కంటెంట్ ముఖ్యమని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మేకర్స్ తో పాటు నటీనటులు ఇప్పటికైనా ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో గ్రహించాలని నెటిజన్లు చెబుతున్నారు. కేవలం పాన్ ఇండియా అనే కాకుండా.. ప్రత్యేకమైన, కొత్త, మంచి కంటెంట్ తో సినిమాలు తీయాలని సూచిస్తున్నారు.
