Begin typing your search above and press return to search.

2026.. ఒక్క మహేష్ తప్ప

ఈ ఏడాది ఆశించిన స్థయిలో పెద్ద సినిమాల సందడి కనిపించడం లేదు. వేసవి లాంటి క్రేజీ సీజన్లో ఒక్క పెద్ద హీరో సినిమా కూడా విడుదల కావడం లేదు.

By:  Tupaki Desk   |   25 April 2025 9:52 AM IST
No Mahesh Babu Film In 2026
X

ఈ ఏడాది ఆశించిన స్థయిలో పెద్ద సినిమాల సందడి కనిపించడం లేదు. వేసవి లాంటి క్రేజీ సీజన్లో ఒక్క పెద్ద హీరో సినిమా కూడా విడుదల కావడం లేదు. టాప్ స్టార్లలో ఈ ఏడాది ఇప్పటిదాకా రామ్ చరణ్ నుంచి ‘గేమ్ చేంజర్’ వచ్చింది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రభాస్ సినిమా ‘రాజా సాబ్’, చిరంజీవి సినిమా ‘విశ్వంభర’ వస్తాయి. పవన్ కళ్యాణ్ సినిమాల పరిస్థితి దైవాదీనంగా ఉంది. మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్లు ఈ ఏడాదిని ఖాళీగా వదిలేశారు. ఐతే వచ్చే ఏడాది మాత్రం భారీ చిత్రాల సందడి గట్టిగానే ఉంటుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. సంక్రాంతి నుంచే బాక్సాఫీస్ షేక్ కాబోతోంది. చాలా ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిత్రాల మధ్య క్లాష్ చూడబోతున్నాం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరు నటించే సినిమా.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా సంక్రాంతినే టార్గెట్ చేశాయి. సంక్రాంతికి వేరే చిత్రాలు కూడా రేసులోకి రావచ్చేమో కానీ.. చిరు, ఎన్టీఆర్ సినిమాలు ఉంటే బాక్సాఫీస్ ఎలా షేకైపోతుందో చెప్పాల్సిన పని లేదు.

ఇక వచ్చే ఏడాది వేసవి ఆరంభంలోనే రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ రిలీజవుతుంది. దానికి పోటీగా నాని మూవీ ‘ది ప్యారడైజ్’ కూడా వచ్చే అవకాశముంది. ఇవి రెండూ ఒకేసారి విడుదల కావచ్చు. లేదా కొన్ని వారాల విరామంలో విడుదలవ్వొచ్చు. ఇక ప్రభాస్ సైతం వచ్చే ఏడాది ఓ భారీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అదే.. ఫౌజీ. ‘సీతారామం’ తర్వాత హను రాఘవపూడి రూపొందిస్తున్న ఈ చిత్రం లవ్, వార్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ ఆరంభ దశలోనే ఉంది. ఈ ఏడాది చివరికి పూర్తి కావచ్చు. వచ్చే ఏడాది వేసవికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

మరోవైపు గత ఏడాది ‘పుష్ప-2’తో ప్రకంపనలు రేపిన అల్లు అర్జున్ వచ్చే ఏడాది అట్లీ సినిమాతో పలకరించబోతున్నాడు. సన్ పిక్చర్స్ రూ.600 కోట్లకు పైగా బడ్జెట్లో రూపొందించనున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదలవుతుంది. ఇలా వచ్చే ఏడాది ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్ల సినిమాలు రాబోతున్నాయి. వీరికి తోడు చిరంజీవి కూడా ఉండనే ఉన్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్న చిత్రంతో నందమూరి బాలకృష్ణ పలకరిస్తాడు. నాగ్ కొంచెం గ్యాప్ తర్వాత చేయనున్న సోలో హీరో సినిమా కూడా వచ్చే ఏడాది వచ్చే అవకాశముంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత గ్యాప్ తీసుకున్న వెంకటేష్ కూడా త్వరలోనే ఓ సినిమాను మొదలుపెట్టబోతున్నాడు.

అది కూడా వచ్చే ఏడాదే రిలీజవుతుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ పెండింగ్‌లో పెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సైతం వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఐతే టాలీవుడ్ టాప్ స్టార్లలో 2026లో మిస్ కాబోతున్నది ఒక్క సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే. గత ఏడాది ‘గుంటూరు కారం’తో ప్రేక్షకులను పలకరించిన మహేష్.. ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జక్కన్నతో సినిమా అంటే రెండేళ్లయినా షూటింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ చిత్రం విడుదలయ్యేది 2027లోనే. కాబట్టి మహేష్ మినహా అందరు టాలీవుడ్ టాప్ స్టార్ల దర్శనం వచ్చే ఏడాది ఉంటుందన్నమాట.