టైగర్ వర్సెస్ పఠాన్: బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్ పూర్తిగా ఆగిపోయినట్టేనా?
భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన భారీ యాక్షన్ ఫ్రాంఛైజీగా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భారీ సినిమాలను యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 19 July 2026 7:00 AM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన భారీ యాక్షన్ ఫ్రాంఛైజీగా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భారీ సినిమాలను యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బాలీవుడ్ టాప్ సూపర్‌స్టార్స్ షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లను ఒకే స్క్రీన్‌పై పూర్తిస్థాయిలో చూపించి.. నెవ్వర్ బిఫోర్ అనిపించేలా సరికొత్త రికార్డులను సృష్టించాలని `టైగర్ వర్సెస్ పఠాన్` అనే భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. పఠాన్ గ్రాండ్ సక్సెస్ అయ్యాక వైఆర్ఎఫ్ ఉత్సాహం ఇది. అయితే గత కొంతకాలంగా ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవడంతో.. అసలు ఈ క్రేజీ ప్రాజెక్ట్ బడ్జెట్ సహా రకరకాల కారణాల వల్ల పూర్తిగా ఆగిపోయినట్టేనా? అనే అనుమానాలు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వ్యక్తమవుతున్నాయి.
వైఆర్ఎఫ్ సంస్థకు ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ విషయంలో ఆది నుంచి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ముఖ్యంగా పఠాన్ తర్వాత షారూఖ్ అతిథిగా సల్మాన్ నటించిన టైగర్ 3 ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఇటీవలి కాలంలో వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం `ఆల్ఫా` బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేక తీవ్ర పరాజయాన్ని చవిచూసింది. ఈ వరుస ఫ్లాప్‌ల వల్ల నిర్మాణ సంస్థ ప్రస్తుతం తీవ్రమైన నీరసంలో- ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బ్యాక్-టు-బ్యాక్ పడిన ఈ పంచ్‌ల వల్ల ఖాన్‌లిద్దరినీ కలిపి సినిమా చేసే సాహసం వైఆర్ఎఫ్ ప్రస్తుతానికి చేయలేకపోతోందని బాలీవుడ్ టాక్.
ఈ సినిమా పట్టాలెక్కకపోవడానికి ప్రధాన కారణం భారీ బడ్జెట్ - స్టార్ల రెమ్యునరేషన్స్ అని విశ్లేషకులు చెబుతున్నారు. నేటి రోజుల్లో షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి అగ్ర స్టార్లు ఒక్కో సినిమాకు కేవలం పారితోషికంగానే దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా.. సినిమా లాభాల్లో కూడా భారీగా వాటాలు తీసుకుంటున్నారు. ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్ల పారితోషికాలకే భారీ మొత్తాన్ని కేటాయించాల్సి వస్తే..నిర్మాణ సంస్థకు మిగిలేది ఏమీ ఉండదని ఒక అంచనా.
పైగా ఈ ఇద్దరు మాస్ హీరోలను ఒకే ఫ్రేమ్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో చూపించాలంటే కేవలం మేకింగ్ కోసమే 500 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌ను కేటాయించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంత భారీ బడ్జెట్‌తో సినిమా తీసినా.. పాన్ ఇండియా స్థాయిలో ఆశించిన మేర భారీ విజయం దక్కకపోతే ఆ పెట్టుబడిని తిరిగి రికవరీ చేయడం అంత సులువైన పని కాదు. ఇటీవలి పరాజయాల నేపథ్యంలో.. మార్కెట్ లెక్కలను బేరీజు వేసుకుంటున్న యష్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రా ఇంతటి భారీ పెట్టుబడులు పెట్టేందుకు తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతానికైతే `టైగర్ వర్సెస్ పఠాన్` స్క్రిప్ట్ వర్క్- బడ్జెట్ రీ-వర్క్ దశలోనే ఆగిపోయిందని.. దీనిపై ఎలాంటి కదలికలు లేవని సమాచారం. మరి వైఆర్ఎఫ్ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను బడ్జెట్ తగ్గించి కొద్దిరోజుల తర్వాత మళ్లీ పట్టాలెక్కిస్తుందా? లేక రిస్క్ ఎందుకని శాశ్వతంగా పక్కనబెట్టేస్తుందా? అనేది వేచి చూడాలి. ఏదేమైనా షారూఖ్-సల్మాన్‌ల అసలైన యాక్షన్ బాటిల్‌ను థియేటర్లలో చూడాలనుకున్న సగటు సినిమా అభిమానులకు మాత్రం ఈ న్యూస్ కాస్త నిరాశ కలిగించే విషయమే.
