Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో వాళ్ల బ‌డ్జెట్ రేంజ్ రెట్టింపు!

స్టార్ హీరోల సినిమా బ‌డ్జెట్ విష‌యంలో స‌న్నివేశం ఇలా ఉంటుంది. కానీ టైర్ -2 హీరోల ప‌రిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. బ‌డ్జెట్ మించిపోతుందంటే నిర్మాత ఆలోచించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది.

By:  Tupaki Desk   |   5 July 2025 7:00 PM IST
టాలీవుడ్ లో వాళ్ల బ‌డ్జెట్ రేంజ్ రెట్టింపు!
X

టైర్ వ‌న్ హీరోల చిత్రాల విష‌యంలో బ‌డ్జెట్ కు ఎంత మాత్రం కొద‌వుండ‌దు. నిర్మాత‌లు వందల కోట్లు పెట్టుబ‌డి పెడుతుంటారు. అవి చాల‌వ‌నుకుంటే అద‌నంగా మ‌రో నిర్మాత స‌హ‌కారం తీసుకుని అత‌డిని ప్రాజెక్ట్ లో భాగం చేస్తుంటారు. బ్యాకులు కూడా హీరోల‌ను న‌మ్మి ధారాళంగా రుణాలిస్తుంటాయి. స్టార్ హీరోల సినిమా బ‌డ్జెట్ విష‌యంలో స‌న్నివేశం ఇలా ఉంటుంది. కానీ టైర్ -2 హీరోల ప‌రిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. బ‌డ్జెట్ మించిపోతుందంటే నిర్మాత ఆలోచించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది.

రిస్క్ తీసుకోవ‌డానికి ఎంత మాత్రం సాహ‌సించ‌రు. వీలైనంత వ‌ర‌కూ ఉన్న బ‌డ్జెట్ లోనే చుట్టేయాల‌ని చూస్తారు. ఎందుకంటే వాళ్ల కెరీర్ లో 100 కోట్ల వ‌సూళ్లు సినిమాలు పెద్ద‌గా ఉండ‌వు కాబ‌ట్టి బిజినెస్ ప‌రంగా ఇబ్బంది ఎదుర‌వుతుంద‌నే భ‌యంతోనూ కూడా ముందుకు రాలేరు. అయితే నేచుర‌ల్ స్టార్ నాని, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌, నిఖిల్, సాయిదుర్గ తేజ్, తేజ స‌జ్జా, సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ లాంటి వాళ్లు ఆ స్టేజ్ ను దాటిపోయిన‌ట్లే క‌నిపిస్తోంది.

ప్ర‌స్తుతం ఆ హీరోల లైన‌ప్ లో ఉన్న చిత్రాల బ‌డ్జెట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ హీరోలంతా ఇప్ప‌టికే 100 కోట్ల క్ల‌బ్లో చేరిపోయారు. దీంతో వాళ్ల సినిమాల బ‌డ్జెట్ కూడా రెట్టింపు అయింది. ఒక‌ప్పుడు 20-30 కోట్ల లోపు చేసే హీరోలంతా ఇప్పుడు రెండు రెట్లు...మూడు రెట్ల బ‌డ్జెట్ చిత్రాల్లో న‌టిస్తున్నారు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల్ తెరకెక్కిస్తోన్న `ది ప్యార‌డైజ్` బ‌డ్జెట్ 120 కోట్లు అని తెలిసింది.

అలాగే నాగ‌చైత‌న్య హీరోగా కార్తీక్ దండు తెర‌కెక్కిస్తోన్న మిస్టిక‌ల్ థ్రిల్ల‌ర్ బ‌డ్జెట్ 80 కోట్లు అని స‌మాచారం.. ఇంకా నిఖిల్ హీరోగా న‌టిస్తోన్న `స్వ‌యంభు`, `ది ఇండియానా హౌస్` రెండు చిత్రాల బ‌డ్జెట్ 140 కోట్లు అని వినిపిస్తోంది. సాయిదుర్గ తేజ్ న‌టిస్తోన్న 'సంబ‌రాల ఏటిగ‌ట్టు' బ‌డ్జెట్ 105 కోట్లు అట‌. తేజ సజ్జా హీరోగా న‌టిస్తోన్న `మిరాయ్` బ‌డ్జెట్ కూడా స్కైలోనే ఉంది. అత‌డిపై ఏకంగా 80 కోట్లు పెడుతున్న‌ట్లు స‌మా చారం. సిద్దు జొన్న‌ల గ‌డ్డ‌, విశ్వ‌క్ సేన్ చిత్రాల బ‌డ్జెట్ కూడా మునుప‌టి కంటే భారీగా పెరిగింద‌ని తెలిసింది.