రజనీ-కమల్‌ని డీల్ చేయగల సత్తా అతనికే ఉంది..!
కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో వచ్చిన 'థగ్ లైఫ్' సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. సినిమా విడుదలకు ముందే కర్ణాటకలో బహిష్కరణకు గురి అయింది
By: Tupaki Desk | 7 Jun 2025 4:00 AM ISTకమల్ హాసన్, మణిరత్నం కాంబోలో వచ్చిన 'థగ్ లైఫ్' సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. సినిమా విడుదలకు ముందే కర్ణాటకలో బహిష్కరణకు గురి అయింది. కమల్ వ్యాఖ్యల కారణంగా అక్కడ విడుదల కాలేదు అనే విషయం తెల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయినప్పటికీ చెప్పుకోలేని నెంబర్స్ నమోదు అయ్యాయి అని గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళనాట ఒక మోస్తరు వసూళ్లు నమోదు అయినప్పటికీ కమల్, మణిరత్నం స్థాయికి అవి ఏమాత్రం సరిపోవు అంటున్నారు. వందల కోట్ల బడ్జెట్ సినిమాకు లాంగ్ రన్‌లో కనీసం వంద కోట్ల వసూళ్లను అయినా నమోదు చేస్తుందా అంటే డౌటే అనే కామెంట్స్‌ను చాలా మంది చేస్తున్నారు.
మణిరత్నంపై నమ్మకంతో థగ్ లైఫ్ పై చాలా మంది విశ్వాసం పెట్టుకున్నారు. కానీ సినిమా తీవ్రంగా నిరాశ పరచిందని వారే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కమల్ హాసన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో థగ్ లైఫ్ ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ తాను మల్టీస్టారర్ సినిమాలను చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి నటించే విషయమై చాలా ఆసక్తిగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. రజనీకాంత్‌తో కలిసి కమల్ హాసన్ నటిస్తే కచ్చితంగా మరో లెవల్‌లో ఉంటుంది అనే విషయంను చాలా మంది వ్యక్తం చేశారు. కమల్ నిజంగానే అన్నాడా లేదంటే, రజనీకాంత్‌తో సినిమాను చేసే విషయంలో కమల్‌కు ఆసక్తి ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కమల్ కనుక నిజంగానే రజనీకాంత్‌తో సినిమా చేసే విషయంలో సీరియస్‌గా ఉంటే కచ్చితంగా ఆయన్ను అభినందించాల్సిందే అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. కమల్‌కు ఆసక్తి ఉన్నట్లుగానే రజనీకాంత్‌కి సైతం మల్టీ స్టారర్ విషయమై ఆసక్తి ఉంటే వీరి కాంబో మూవీని ఎవరు డైరెక్ట్ చేసేందుకు ముందుకు వస్తారు అంటూ చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మా కాంబో మూవీని బయట నిర్మాత కాకుండా నేను, రజనీకాంత్ కలిసి నిర్మించాలని తాను కోరుకుంటున్నాను అంటూ కమల్ హాసన్ చెప్పుకొచ్చాడు. కమల్ హాసన్ నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నా దర్శకత్వం చేసే సత్తా కేవలం లోకేష్ కనగరాజ్‌కి మాత్రమే ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో కమల్ హాసన్‌తో విక్రమ్ సినిమాను తీసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం రజనీకాంత్‌తో కూలీ సినిమాని చేసి విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలో విడుదల కాబోతున్న కూలీ సినిమా సూపర్ హిట్ అయ్యి, రూ.500 కోట్ల వసూళ్లు నమోదు చేస్తే కచ్చితంగా మరోసారి లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటించేందుకు రజనీకాంత్ ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే కమల్‌తో కలిసి కూడా రజనీకాంత్ నటిస్తాడేమో అనే చర్చ జరుగుతోంది. మొత్తానికి కమల్, రజనీకాంత్ సినిమాను నిజంగానే పట్టాలెక్కిస్తే ఆ ప్రాజెక్ట్‌ను డీల్ చేయగల సత్తా కేవలం లోకేష్ కనగరాజ్‌కి మాత్రమే ఉందని, ఆయన ఎల్‌సీయూ లో ఈ సినిమాను తీస్తే బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లు వసూళ్లు అవుతాయని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
