Begin typing your search above and press return to search.

థగ్ లైఫ్ OTT.. తప్పని తిప్పలు!

ప్రముఖ నటుడు కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్ లో రీసెంట్ గా థగ్ లైఫ్ మూవీ రూపొందిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 Jun 2025 11:59 AM IST
థగ్ లైఫ్ OTT.. తప్పని తిప్పలు!
X

ఓటీటీ థియేటర్ మార్కెట్ పై ప్రభావం చూపుతోందనే కామెంట్స్ చాలా కాలం నుంచి వినిపిస్తున్నవే. కానీ కంటెంట్ ఎట్రాక్ట్ అవ్వకుంటే జనాలు థియేటర్ కు ఎలా వస్తారు? ఓటీటీలోనే చూసుకుందాం అనుకుంటారు. ఇది మారుతున్న కాలంలో ఎవరు మార్చలేనిది. కంటెంట్ నామమాత్రంగా ఉంటే ఎంత పెద్ద సినిమాకైనా తిప్పలు తప్పవని ఇదివరకే చాలాసార్లు రుజువైంది. ఇక థగ్ లైఫ్ కూడా అదే ట్రాక్ లో నిలిచే స్థాయికి వచ్చేసింది.

ప్రముఖ నటుడు కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్ లో రీసెంట్ గా థగ్ లైఫ్ మూవీ రూపొందిన విషయం తెలిసిందే. ఇప్పటికే వారి కాంబోలో సూపర్ హిట్ సినిమా నాయకుడు రాగా.. ఇన్నాళ్లకు కమల్, మణి చేతులు కలపడంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు. కచ్చితంగా మూవీ హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు.

సినిమాలో త్రిష, అభిరామి, నాజర్, శింబు వంటి స్టార్ క్యాస్టింగ్ ను మేకర్స్ తీసుకోవడంతో హోప్స్ పెట్టుకున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ బాణీలు కట్టడంతో వేరే లెవెల్ లో ఊహించుకున్నారు. ప్రమోషనల్ కంటెంట్ తో కూడా మేకర్స్ మెప్పించడంతో హిట్ బొమ్మ అని కూడా ఫిక్స్ అయిపోయారు.

తీరా జూన్ 5వ తేదీన థియేటర్స్ లో సినిమాను చూసి ఒక్కసారిగా నిరాశ పడిపోయారు. మణిరత్నం ఫ్యాన్స్ కూడా విమర్శలు గుప్పించారు. కమల్ హాసన్ యాక్షన్ మాత్రమే బాగుందని రివ్యూస్ ఇచ్చారు. దీంతో భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా.. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన థగ్ లైఫ్.. డిజాస్టర్ గా మారింది.

రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే నెగిటివ్ టాక్ రావడంతో సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. వారం రోజుల్లో రూ.100 కోట్ల మార్క్ కూడా అందుకోలేకపోయింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లకు థగ్ లైఫ్ నష్టాలు మిగిల్చింది. అయితే రిలీజ్ కు ముందే డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుందని టాక్.

రూ.130 కోట్లకు పైగా ఖర్చు చేసి థగ్ లైఫ్ స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు ఇప్పటికే గుసగుసలు వినిపించాయి. థియేటర్స్ లో రిలీజ్ అయిన ఎనిమిదో వారం తర్వాత ఓటీటీలోకి మూవీని తీసుకొస్తామని నెట్ ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. కానీ ఇప్పుడు నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

జులై ఫస్ట్ వీక్ లోనే తీసుకొస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో డీల్ లో 20-25% తగ్గింపును ప్రతిపాదించినట్లు సమాచారం. సినిమా రిజల్ట్ అనుకున్నట్లు లేకపోవడంతో ఇప్పటికే కుదుర్చుకున్న మొత్తం ఇవ్వలేమని తేల్చి చెప్పిందని వినికిడి. అయితే రిలీజ్ కు ముందు సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో పెద్ద మొత్తంలో డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో నిజమెంతో తెలియాల్సి ఉంది.