Begin typing your search above and press return to search.

ఆ సినిమా గొడవ ఇంకా సద్దుమణగలేదు..!

థగ్‌ లైఫ్ సినిమా ప్రమోషన్ సమయంలో కమల్‌ హాసన్ మాట్లాడుతూ కన్నడ భాష అనేది తమిళ భాష నుంచి పుట్టింది అంటూ వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   14 Jun 2025 1:26 PM IST
ఆ సినిమా గొడవ ఇంకా సద్దుమణగలేదు..!
X

కమల్‌ హాసన్‌, మణిరత్నం కాంబోలో సుదీర్ఘ కాలం తర్వాత వచ్చిన 'థగ్‌ లైఫ్‌' సినిమా నిరాశను మిగిల్చింది. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన నాయగన్‌ సినిమా ఎప్పటికి గుర్తుండే రేంజ్‌లో సూపర్‌ హిట్‌గా నిలిచిన విషయం తెల్సిందే. నాయగన్‌ రేంజ్‌లో ఉంటుందని ప్రచారం చేసిన థగ్‌ లైఫ్‌ ఫ్లాప్‌గా నిలిచింది. ఇలాంటి మూస తరహా మాఫియా బ్యాక్‌డ్రాప్ సినిమాలు చాలానే వచ్చాయి. ఇలాంటి సినిమాలకు కాలం చెల్లిందని మణిరత్నంతో పాటు కమల్‌ హాసన్ గుర్తించలేక పోయారు అంటూ రివ్యూవర్స్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ రివ్యూలు ఇచ్చారు. ఎన్నో ఆశలు పెట్టుకుని, భారీ వసూళ్లు సాధిస్తుందని ఆశించిన థగ్ లైఫ్ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ మిగిల్చింది. సినిమా వచ్చి వారం దాటింది, ఈ సమయంలో సుప్రీం కోర్ట్‌లో ఈ సినిమా కోసం పిటిషన్ దాఖలు అయింది.

థగ్‌ లైఫ్ సినిమా ప్రమోషన్ సమయంలో కమల్‌ హాసన్ మాట్లాడుతూ కన్నడ భాష అనేది తమిళ భాష నుంచి పుట్టింది అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపింది. కన్నడ భాషను అవమానించే విధంగా కమల్‌ వ్యాఖ్యలు ఉన్నాయంటూ మొత్తం కర్ణాటక లో ఆందోళనలు జరిగాయి. అంతే కాకుండా కన్నడ సినిమా ఇండస్ట్రీ సినిమాను విడుదల కానిచ్చేది లేదని తేల్చి చెప్పడం, కమల్‌ ఏకంగా కర్ణాటక హైకోర్ట్‌కు వెళ్లడం జరిగింది. అక్కడ కూడా కన్నడ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని అంటున్నప్పుడు క్షమాపణ చెబితే ఏం అవుతుంది అంటూ కమల్‌ను ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. ఆ సమయంలో సినిమాను కర్ణాటకలో విడుదల చేయకున్నా పరవాలేదు కానీ నేను మాత్రం క్షమాపణ చెప్పను అంటూ కమల్‌ భీష్మించుకు కూర్చున్నారు.

సినిమా కర్ణాటకలో విడుదల కాలేదు. అక్కడ తప్ప దేశ వ్యాప్తంగా విడుదల అయింది. ఇతర భాషల్లో విడుదల అయిన థగ్ లైఫ్‌ పెద్దగా ఆడింది ఏమీ లేదు. తమిళనాట ఒక మోస్తరు వసూళ్లు నమోదు అయ్యాయి. కన్నడంలో విడుదల అయినా కూడా అదే ఫలితం అక్కడ రిపీట్‌ అయ్యి ఉండేది. అక్కడి ప్రేక్షకులు కూడా ఇప్పుడు థగ్‌ లైఫ్‌ సినిమాను థియేటర్‌లో మిస్‌ అయ్యాం అనే ఫీల్‌తో లేరు. ఇలాంటి సమయంలో మహేష్‌ రెడ్డి అనే వ్యక్తి థగ్‌ లైఫ్‌ సినిమాను కర్ణాటకలో అనధికారికంగా బ్యాన్‌ చేశారు అంటూ సుప్రీం కోర్ట్‌లో పిటీషన్ వేశాడు. సినిమా విడుదలను అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవడంలో అక్కడి ప్రభుత్వం విఫలం అయింది అంటూ ఆయన తన పిటీషన్‌లో పేర్కొన్నాడు. అంతే కాకుండా వాక్ స్వాతంత్య్రం కు భంగం వాటిల్లింది, వృత్తిని కించ పరిచే విధంగా అక్కడ చర్యలు జరిగాయని పిటీషన్‌లో తెలియజేయడం జరిగింది.

పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్ట్‌ ధర్మాసనం ముందుగా కర్ణాటక సర్కార్‌కు నోటీసులు జారీ చేసింది. ఎందుకు థగ్ లైఫ్ సినిమా విడుదలకు సహకరించలేదు అంటూ ప్రశ్నించింది. అంతే కాకుండా అక్కడి సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిని సైతం ఈ పిటీషన్‌లో విచారించే అవకాశాలు ఉన్నాయి. సినిమా విడుదల అయ్యింది.. ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా కూడా కర్ణాటకలో విడుదల కాకపోవడం అనేది చట్ట ప్రకారం కరెక్ట్‌ కాదనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అందుకే సుప్రీం కోర్ట్‌లో ఈ సినిమా కోసం పిటీషన్ వేసి ఉంటారు. ఈ పిటిషన్ విచారణ జూన్ 17 కు సుప్రీం వాయిదా వేసింది. కమల్‌ హాసన్‌తో పాటు ఈ సినిమాలో శింబు ముఖ్య పాత్రలో నటించాడు. త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్స్‌గా నటించిన విషయం తెల్సిందే. కమల్‌, మణిరత్నం కలిసి నిర్మించిన ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్ సంగీతాన్ని అందించారు.