Begin typing your search above and press return to search.

థ‌గ్ లైఫ్ వివాదం: ఫిలించాంబ‌ర్లకు నిప్పంటుకుంది!

క‌న్న‌డం వ‌ర్సెస్ త‌మిళం ఈగో క్లాషెస్ గురించి తెలిసిందే. కావేరీ జ‌లాల స‌మ‌స్య మొద‌లు, త‌మిళ‌నాడుతో క‌ర్నాట‌కకు ఉన్న స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.

By:  Tupaki Desk   |   4 Jun 2025 9:39 AM IST
థ‌గ్ లైఫ్ వివాదం: ఫిలించాంబ‌ర్లకు నిప్పంటుకుంది!
X

క‌న్న‌డం వ‌ర్సెస్ త‌మిళం ఈగో క్లాషెస్ గురించి తెలిసిందే. కావేరీ జ‌లాల స‌మ‌స్య మొద‌లు, త‌మిళ‌నాడుతో క‌ర్నాట‌కకు ఉన్న స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. భాషతో ముడిప‌డిన ఈగోను అంత తేలిగ్గా వ‌దులుకోవ‌డం సాధ్య‌ప‌డ‌దు. ఇది ఇప్పుడు రెండు రాష్ట్రాల స‌మ‌స్య‌గా మారింది. కమల్ హాసన్ - మణిరత్నం నటించిన థగ్ లైఫ్ సినిమాను జూన్ 05న రాష్ట్రవ్యాప్తంగా విడుదల చేయకూడదని కోరుతూ KFCCకి క‌ర్నాట‌క హైకోర్ట్ లేఖ రాయ‌డం తెలిసిందే. ఈ తీర్పు తర్వాత తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (TFAPA) జూన్ 05న సినిమా విడుదల చేయాలని కోరుతూ KFCCకి లేఖ రాసింది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ అధినేత‌ కమల్ కూడా ఈ విషయంపై చర్చించడానికి జూన్ 10న క‌ర్నాట‌క చాంబ‌ర్‌ను కలవనున్నారు.

తమిళం- కన్నడ చిత్ర పరిశ్రమల మధ్య మంచి స‌త్సంబంధాలున్నాయి. అందువ‌ల్ల సినిమాని సజావుగా విడుద‌ల‌య్యేందుకు స‌హ‌క‌రించాల్సిందిగా త‌మిళ ఫిలింఛాంబ‌ర్ క‌న్న‌డ ఫిలింఛాంబ‌ర్ ని కోరింది. థ‌గ్ లైఫ్ విడుద‌ల‌ను అడ్డుకుంటే అది ఇరు ప‌రిశ్ర‌మ‌ల న‌డుమ‌ సామరస్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంద‌ని కూడా త‌మిళ ఫిలింఛాంబ‌ర్ లేఖ‌లో పేర్కొంది. థ‌గ్ లైఫ్ ని ఇబ్బంది పెట్ట‌కుండా క‌ర్నాట‌క వ్యాప్తంగా రిలీజ్ చేయ‌డానికి క‌ర్నాట‌క ఫిలింఛాంబ‌ర్ స‌హ‌కారాన్ని ఈ లేఖలో కోరారు.

కన్నడ గురించి కమల్ చేసిన వ్యాఖ్య వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని అసోసియేషన్ ఈ లేఖ‌లో హైలైట్ చేస్తుంది. కన్నడ భాషపై ప్రేమతో మాట్లాడారు క‌మ‌ల్. లక్షలాది మంది హృదయాలలో కన్నడ భాష ప్రాముఖ్యత లేదా విలువను తగ్గించడానికి కాదు! అని పేర్కొంది. కమల్ కన్నడ సినిమాకు గొప్ప స‌హ‌కారం అందించారు. కన్న‌డ సినిమాల్లో న‌టించారని లేఖ‌ గుర్తు చేసింది. క‌న్న‌డ ప‌రిశ్ర‌మ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌పై అత‌డికి అపార‌మైన గౌర‌వం ఉంది అని లేఖ‌లో పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి నటుడు శివరాజ్‌కుమార్ చేసిన వ్యాఖ్యను ఈ లేఖ ఉటంకించింది. క‌మల్ మాట‌పై పంతానికి పోవ‌ద్ద‌నే భావన అవసరమని ఈ లేఖ‌లో పేర్కొన్నారు.

క‌న్న‌డ భాష గురించి తాను త‌ప్పుగా మాట్లాడ‌లేద‌ని, క‌న్న‌డిగులు త‌ప్పుగా అర్థం చేసుకున్నార‌ని క‌మ‌ల్ హాస‌న్ కోర్టు విచార‌ణ‌లో వాదించారు. కానీ కోర్టు దీనిని అంగీక‌రించ‌లేదు. అతడు క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్ప‌లేదు. ఈ ఈగో స‌మ‌స్య తొల‌గ‌క‌పోవ‌డంతో ఇంకా థ‌గ్ లైఫ్ పై క‌ర్నాట‌క‌లో నిషేధం కొన‌సాగుతోంది. ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఈ వివాదం ఇంకా స‌మ‌సిపోలేదు.