థగ్ లైఫ్.. ఆ మ్యాజిక్ రిపీట్ కావడం సాధ్యమా సర్?
యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం కాంబోలో రూపొందిన 'థగ్ లైఫ్' సినిమా విడుదలకు సిద్దం అయింది.
By: Tupaki Desk | 23 May 2025 9:36 AM ISTయూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం కాంబోలో రూపొందిన 'థగ్ లైఫ్' సినిమా విడుదలకు సిద్దం అయింది. జూన్ 5న తమిళ్‌తో పాటు పాన్ ఇండియా రేంజ్‌లో పలు భాషల్లో విడుదల కాబోతున్న థగ్ లైఫ్ ప్రమోషన్స్‌లో మేకర్స్ బిజీగా ఉన్నారు. కమల్ హాసన్, మణిరత్నం, త్రిష, శింబు, అభిరామిలు ప్రమోషన్‌లో యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. ఇటీవల తెలుగు మీడియా ముందుకు వచ్చారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. సినిమాపై చిత్ర యూనిట్ సభ్యులు చేసిన వ్యాఖ్యలు అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. అంతే కాకుండా కమల్ హాసన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో 38 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో మొదటి నుంచే పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. వీరి కాంబోలో మంచి సినిమాలు వచ్చాయి. కనుక మరోసారి మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. ముఖ్యంగా 1987లో వచ్చిన 'నాయకన్' సినిమాను మించి థగ్ లైఫ్ ఉంటుంది అంటూ కమల్ హాసన్ వ్యాఖ్యలు చేశాడు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా హీరోలు, దర్శకనిర్మాతలు, ఇతర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ మా సినిమా ఆహా.. ఓహో అన్నట్లుగా తెగ వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్ళడానికి శృతి మించి వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ స్టార్ హీరోలు అందుకు కాస్త దూరంగా ఉంటారు.
థగ్ లైఫ్ సినిమాను నాయకన్ సినిమాతో కమల్ పోల్చడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికీ నా అభిమానులు మణిరత్నంతో సినిమా అంటే నాయకన్ సినిమాను గుర్తు చేసుకుంటారు. కానీ ఇకపై మా కాంబో అనగానే థగ్ లైఫ్ సినిమా గుర్తుకు వస్తుంది. అంతగా ఈ సినిమా ఉంటుంది అంటూ ధీమా వ్యక్తం చేశాడు. థగ్ లైఫ్ సినిమా విషయంలో కమల్ హాసన్‌కి నమ్మకం ఉండవచ్చు. కానీ మరీ నాయకన్ ను మించి థగ్ లైఫ్ ఉంటుందని, ఆ సినిమాను మరిపించే విధంగా ఈ సినిమా ఉంటుంది అంటే మాత్రం కచ్చితంగా నమ్మశక్యంగా లేదని, ఆయన మాటలు కేవలం థగ్ లైఫ్ కి హైప్ ఇవ్వడం కోసం అన్నట్లుగా ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇండియన్ సినిమా చరిత్రలో నిలిచి పోయే సినిమాలు కొన్ని ఉంటాయి. అలాంటి సినిమాల్లో నాయకన్ సినిమా ఒకటి. అలాంటి సినిమాను మించి థగ్ లైఫ్ ఉంటుంది అంటే ఏ ఒక్కరూ నమ్మే పరిస్థితి ఉండదు. సినిమా పబ్లిసిటీ సమయంలో మేకర్స్ చేసే చీప్ వ్యాఖ్యల మాదిరిగానే ఈ వ్యాఖ్యలు ఉన్నాయంటూ కొందరు నాయకన్ సినిమా అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఈ రోజుల్లో నాయకన్ సినిమా రేంజ్‌లో సినిమా తీయడం అసాధ్యం కానీ, అందులో కనీసం 25 శాతం ఉన్నా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి కమల్, మణిరత్నం కాంబో మ్యాజిక్ రిపీట్ కావడం సాధ్యమా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
