ఈ రెండు సినిమాలకు అభిరుచి సమస్య
హౌస్ ఫుల్ 5 రెండవ రోజు బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.30 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.
By: Tupaki Desk | 9 Jun 2025 8:30 AM ISTప్రస్తుతం థియేటర్లలో రెండు మెగా బడ్జెట్ చిత్రాలు ఆడుతున్నాయి. కమల హాసన్- మణిరత్నం కాంబినేషన్ గ్యాంగ్ స్టర్ డ్రామా థగ్ లైఫ్, అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ ముఖ్, అభిషేక్ బచ్చన్ తదితరులు నటించిన కామెడీ ఎంటర్ టైనర్ `హౌస్ ఫుల్ 5` ఒక రోజు తేడాతో విడులయ్యాయి. రెండు చిత్రాలు భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్లుగా నిలిచాయి.
హౌస్ ఫుల్ 5 రెండవ రోజు బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.30 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. మొదటి రోజు దాదాపు రూ.24 కోట్లు వసూలు చేసింది. మొత్తం రెండు రోజుల కలెక్షన్ లు రూ.54 కోట్లు. అయితే హౌస్‌ఫుల్ 5 దాదాపు రూ.240 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించగా ఈ ఆరంభ వసూళ్లతో గట్టెక్కడం కష్టం. రెండు వారాలు నిరాటంకంగా ఆడాలి. కానీ నెగెటివ్ టాక్ వల్ల అది సాధ్యపడదని అంచనా.
థగ్ లైఫ్ గురించి చెప్పాలంటే.. కమల్ హాసన్ సినిమా విడుదలకు ముందే అనేక వివాదాల్లో చిక్కుకుంది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా కమల్ హాసన్ కన్నడ - తమిళం గురించి మాట్లాడుతూ వివాదాస్పద ప్రకటన చేయడం వల్ల కర్ణాటకలో విడుదల కాలేదు. అయినా ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో 30 కోట్లు వసూలు చేసింది. థగ్ లైఫ్ 3వ రోజు అంటే మొదటి శనివారం దాదాపు రూ.7.50 కోట్లు వసూలు చేయగా, 2వ రోజు ఈ సినిమా దాదాపు రూ.7.15 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు దాదాపు రూ.15.5 కోట్లు. మూడురోజుల మొత్తం కలెక్షన్లు దాదాపు రూ.30.15 కోట్లు. కానీ బడ్జెట్ 150కోట్లు. అందువల్ల సేఫ్ జోన్ కి రావాలంటే చాలా దూరం వెళ్లాలి.
కానీ ఈ రెండు సినిమాలకు నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. విడుదల రోజు క్రిటిక్స్ ఈ రెండు సినిమాలను తీవ్రంగా విమర్శించారు. ఇద్దరు పెద్ద హీరోలకు పెద్ద దెబ్బ పడిందని విశ్లేషించారు. ముఖ్యంగా దర్శకనిర్మాతల్లో అభిరుచి కొరవడిందని క్రిటిసిజం ఎదురైంది. థగ్ లైఫ్ ని పాత మూస పద్ధతిలో తెరకెక్కించారు. నేటి జనరేషన్ కి తగ్గ సినిమా కాదని విశ్లేషించారు. అలాగే హౌస్ ఫుల్ 5ని మరీ చవకబారు సంభాషణలతో ఎక్స్ పోజింగ్ తో తెరకెక్కించారని విమర్శలొచ్చాయి. కథనంలో కొత్తదనం లేదని కూడా విమర్శించారు. నేటి ట్రెండ్ కి తగ్గ సినిమాలు కాదనే విమర్శలొచ్చాయి. కల్కి 2898 ఏడి, పుష్ప 2, విక్రమ్, స్త్రీ 2 లాంటి సినిమాలు కంటెంట్ పరంగా, సాంకేతికంగా కూడా వైవిధ్యంగా కనిపించాయి. వాటిని మించిన సినిమాలు మునుముందు రావాల్సి ఉంది.
