వేట్టయాన్, ఎంపురాన్ ఇప్పుడు తుడరుమ్!
ఒకేసారి ఇతర భాషలతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు నేరుగా ఒకేసారి తెలుగులోనూ విడుదలవుతున్నాయి.
By: Tupaki Desk | 22 April 2025 11:16 AM IST`బాహుబలి` తరువాత తెలుగు సినిమా స్వరూపమే మారిపోయింది. ఆ తరువాత వచ్చిన సినిమాలు కూడా తెలుగు సినిమాని దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మార్చడంతో ఇండియన్ సినిమాపై చర్చ మొదలైంది. భాషల హద్దులని దాటి అంతా ఒక్కటేనని ఇది ఇండియన్ సినిమా అని అంతా చెప్పడం మొదలు పెట్టారు. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమేననే అపోహలు తొలగిపోవడంతో అందిరి దృష్టి టాలీవుడ్ పై పడింది. ఇదిలా ఉంటే పాన్ ఇండియా సినిమాల పరంపర మొదలైన తరువాత ఓ విచిత్రమైన అలవాటు మొదలైంది.
ఇతర భాషల్లో స్టార్లు నటించిన సినిమాలని తెలుగులోనూ విడుదల చేయడం, వాటిని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అనేది చాలా కాలంగా జరుగుతోంది. అయితే అప్పట్లో సినిమా విడుదలై సక్సెస్ అయిన తరువాత దాన్ని తెలుగులో డబ్బింగ్ చేసేవారు. కానీ `బాహుబలి` తరువాత ట్రెండు మారింది. ఒకేసారి ఇతర భాషలతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు నేరుగా ఒకేసారి తెలుగులోనూ విడుదలవుతున్నాయి.
అయితే ఇక్కడ ఓ విచిత్రం జరుగుతోంది. అదే మూవీ టైటిల్. తమిళ, కన్నడ, మలయాళ ప్రేక్షకులకు మాత్రమే అర్థమయ్యే టైటిల్స్‌ని యదాతదంగా తెలుగులోనూ పెట్టేస్తూ రిలీజ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. `పొన్నియిన్ సెల్వన్`ని అదే పేరుతో రిలీజ్ చేశారు. అదేమంటే దానికి మించిన టైటిల్ ఈ సినిమాకి పెట్టడానికి లేదన్నారు. ఇదే పేరుతో రెండు భాగాలు విడుదల చేశారు.
ఇక ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతూ కన్నడ మూవీ `కాంతార` కూడా అదే పేరుతో విడుదలైంది. దేవకళ నేపథ్యంలో సాగే సినిమా కాబట్టి, దీనికి మించిన టైటిల్ పెట్టడం కుదరదు కాబట్టి ఇదే టైటిల్‌ని తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ పెట్టి రిలీజ్ చేశారు. ఇక సూపర్‌స్టార్ రజనీ నటించిన `వేట్టయాన్` వంతు వచ్చింది. `వేట్టయాన్త` అటే వేటగాడు` ఇదే టైటిల్‌ని తెలుగులో పెట్టొచ్చు. కానీ అది జరగలేదు. అదే పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. మోహన్‌లాల్ నటించిన `ఎంపురాన్`ని కూడా అదే పేరుతో విడుదల చేయడం అందరిని షాక్‌కు గురిచేసింది.
ఇప్పుడు ఇదే ఆనవాయితీని ఫాలో అవుతూ మోహన్‌లాల్ నటించిన మరో మూవీ `తుడరుమ్`. శోభన చాలా ఏళ్ల తరువాత మోహన్‌లాల్‌తో కలిసి నటిస్తున్న ఈ మూవీని ఇదే పేరుతో తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. `తుడరుమ్` మలయాళ పదం. తెలుగులో ఏంటనేది ఎవరికీ అర్థం కాదు. అయినా సరే మా భాషలోని టైటిల్‌నే తెలుగులోనూ రుద్దేస్తాం అని మలయాళ, తమిళ సినీ వర్గాలు ఇలా తెలుగు ప్రేక్షకుల్ని కించపరచడం పలువురిని ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. హిందీపై యుద్ధం చేసే వారు సాటి తెలుగు భాషని ఇలా చులకన చేయడం ఏమీ బాగాలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
