Begin typing your search above and press return to search.

తిరువీర్ 'పాపం ప్రతాప్'.. ఇంట్రెస్టింగ్ కథలా ఉందే!

టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ నటిస్తున్న తాజా చిత్రం పాపం ప్రతాప్ ట్రైలర్ రీసెంట్ గా విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.

By:  M Prashanth   |   12 April 2026 4:35 PM IST
తిరువీర్ పాపం ప్రతాప్.. ఇంట్రెస్టింగ్ కథలా ఉందే!
X

టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ నటిస్తున్న తాజా చిత్రం పాపం ప్రతాప్ ట్రైలర్ రీసెంట్ గా విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్, ఈసారి ఓ గ్రామీణ నేపథ్యంలో సాగే ఎమోషనల్ కామెడీ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

పాపం ప్రతాప్ సినిమా కథ 1998 కాలంలో గోదావరి ప్రాంతం నేపథ్యంగా సాగుతుంది. సాధారణ యువకుడు ప్రతాప్ పెళ్లి చేసుకుని సంతోషంగా జీవితం మొదలుపెడతాడు. అయితే పెళ్లి అయిన కొద్ది రోజులకే అతని భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడం కథలో కీలక మలుపు. ఈ సంఘటన తర్వాత ప్రతాప్ ఎదుర్కొనే ఇబ్బందులు, ఊరిలో జరిగిన చర్చలు, అతని జీవితంలో వచ్చే అనుకోని పరిణామాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా కనిపిస్తున్నాయి.

ట్రైలర్‌ బట్టి చూస్తే, ఒక సాధారణ మనిషి జీవితంలో జరిగే వింత సంఘటనలను ఎంటర్టైన్మెంట్ తో కలిపి చూపించడమే కాకుండా, లోపల ఒక భావోద్వేగ అంశాన్ని కూడా దర్శకుడు అందంగా మలిచినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 'ఒక అమ్మాయి ఇల్లు వదిలి వెళ్లిందంటే అబ్బాయి తప్పు చేశాడని అడుగుతారు.. కానీ ఆ అబ్బాయికి ఏం జరిగిందని ఎవరూ అడగరు' అనే డైలాగ్ ప్రేక్షకులను ఆలోచింపజేస్తోంది.

దర్శకుడు ఎస్.పీ దుర్గా నరేష్ చిత్రాన్ని గ్రామీణ వాతావరణానికి దగ్గరగా, సహజమైన పాత్రలతో తెరకెక్కించినట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. కామెడీ, భావోద్వేగం మధ్య సరైన బ్యాలెన్స్ క్రియేట్ చేయడంలో ఆయన విజయం సాధించినట్లు కనిపిస్తోంది. హీరోగా తిరువీర్ తన సహజమైన నటనతో మరోసారి ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు. అమాయకత్వం, భావోద్వేగం, కన్ఫ్యూజన్ అన్నీ మిక్స్ అయిన పాత్రలో ఆయన నటన ట్రైలర్‌ లో హైలైట్‌ గా నిలిచింది.

కథానాయికగా నటిస్తున్న పాయల్ రాధాకృష్ణ పాత్ర కూడా ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఆమె పాత్రలో ఉన్న మిస్టరీ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.ఇక సీనియర్ నటుడు అజయ్ ఘోష్ తండ్రి పాత్రలో వినోదాన్ని పంచుతూనే కథకు బలం చేకూర్చినట్లు కనిపిస్తున్నారు. అలాగే శ్రీనివాస్ అవసరాల, రాశి, దేవీ ప్రసాద్, గోపరాజు రమణ, రఘుబాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సాంకేతికంగా కూడా సినిమా మంచి రేంజ్ లో ఉన్నట్లు ట్రైలర్ సూచిస్తోంది. విశ్వేశ్వర్ ఎస్.వి సినిమాటోగ్రఫీ గోదావరి ప్రాంతపు నేచురల్ అందాలను అద్భుతంగా చూపించింది. సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం కథలోని భావోద్వేగాలను మరింత ఎలివేట్ చేస్తోంది. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రాకేష్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మాదిరెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఆ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదల అవ్వనుంది. ఏదేమైనా.. పాపం ప్రతాప్ మూవీ ట్రైలర్ నవ్వులు పంచుతూ, ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ స్టోరీని చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ కథతో సాగే ఆ మూవీ.. ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.