Begin typing your search above and press return to search.

‘తిమ్మరాజుపల్లి టీవీ’ మూవీ రివ్యూ

హీరోగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు నిర్మాత అవతారం ఎత్తాడు.

By:  Tupaki Desk   |   17 April 2026 4:48 PM IST
‘తిమ్మరాజుపల్లి టీవీ’ మూవీ రివ్యూ
X

‘తిమ్మరాజుపల్లి టీవీ’ మూవీ రివ్యూ

నటీనటులు: సాయితేజ్- వేద జలంధర్- ప్రదీప్ కొట్టె- స్వాతి కరిమిరెడ్డి - అమ్మ రమేష్-సత్యనారాయణ- లతీష్ తదితరులు

సంగీతం: వంశీకాంత్ రేఖన

ఛాయాగ్రహణం: అక్షయ్ రామ్ పొడిశెట్టి

నిర్మాత: కిరణ్ అబ్బవరం

రచన-దర్శకత్వం: మునిరాజు

హీరోగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు నిర్మాత అవతారం ఎత్తాడు. అందరూ కొత్త వాళ్లను పెట్టి అతను నిర్మించిన సినిమా.. తిమ్మరాజుపల్లి టీవీ. ఇంట్రెస్టింగ్ టీజర్..ట్రైలర్లతో ఆకట్టుకున్న ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా కూడా అంతే ఆసక్తికరంగా ఉందా? చూద్దాం పదండి.

కథ: 90వ దశకంలో అప్పుడే కొత్తగా పల్లెటూళ్లకు టీవీలు వస్తున్న రోజుల్లో చిత్తూరు జిల్లాలోని తిమ్మరాజుపల్లె అనే ఊరిలో నడిచే కథ ఇది. చదువు మధ్యలో ఆపేసి చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ బతికే సతీష్ (సాయితేజ్).. శారద (వేద జలంధర్)ను ప్రేమిస్తాడు. ఆమె కూడా అతణ్ని ఇష్టపడుతుంది. ఒకసారి టౌన్ నుంచి టీవీ అద్దెకు తెచ్చి ఊర్లో జనాలకు సినిమాలు చూపించడంతో.. వాళ్లందరికీ టీవీ పిచ్చి పట్టుకుంటుంది. అదే సమయంలో శారద అన్న రాజప్ప తన ఇంటికి కొని తెస్తాడు. తనే ఊరికి తొలి టీవీ తీసుకురావాలని అనుకున్న ఆ ఊరి పెద్దకు అది గిట్టదు. మరోవైపు తన చెల్లెల్ని సతీష్ ప్రేమిస్తున్న సంగతి తెలిసి అతడికి వార్నింగ్ ఇస్తాడు రాజప్ప. ఈ గొడవ జరిగిన తర్వాతి రోజే రాజప్ప ఇంట్లో టీవీ మాయం అవుతుంది. సతీష్ చేసిన పాత దొంగతనాలు.. రాజప్పతో అతడికి జరిగిన గొడవను బట్టి అతనే టీవీ దొంగిలించాడని ఊరి జనం తన మీద అభియోగం మోపుతారు. రెండు వారాల్లో టీవీ తెచ్చివ్వకపోతే తనకు శిక్ష వేయాలని నిర్ణయిస్తారు. మరోవైపు శారద కూడా తనకు దూరమయ్యే పరిస్థితి రావడంతో ఎలాగైనా ఆ టీవీ దొంగను పట్టి తేవాలని సతీష్ పంతం పడతాడు. మరి అతడి ప్రయత్నం ఫలించిందా.. ఇంతకీ ఆ టీవీ దొంగ ఎవరు.. చివరికి సతీష్-శారద కలిశారా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: ఏదైనా వస్తువు మనకు అంత సులువుగా దక్కని పరిస్థితి ఉంటే.. అది అందినపుడు కలిగే భావోద్వేగమే వేరుగా ఉంటుంది. 90వ దశకం.. అంతకంటే ముందు వరకు మధ్యతరగతి అంతకంటే దిగువన ఉన్న కుటుంబాలకు టీవీ అన్నది అలాంటి అపురూపమైన వస్తువే. అప్పట్లో టీవీల్లో వచ్చే సినిమాలు.. కార్యక్రమాలు చూసినపుడు కలిగిన ఆనందం గురించి ముందు తరం వాళ్లను అడిగితే కథలు కథలుగా చెబుతారు. ఆ తరం వాళ్లు సొంతంగా టీవీ కొనుక్కున్నపుడు కలిగిన ఉద్వేగం కూడా వేరు. అప్పటి ఓ పల్లెటూరిలో టీవీ చుట్టూ తిరిగే ఒక కథ ద్వారా డ్రామా పండించాలని చూశాడు ‘తిమ్మరాజుపల్లి టీవీ’ దర్శకుడు మునిరాజు. ఆ తరం వాళ్లకు కచ్చితంగా ఇదొక నోస్టాల్జియా లాగే అనిపిస్తుంది. ఆ రోజులు ఇలా ఉండేవా అనుకుని ఈ తరం ప్రేక్షకులు ఈ సినిమా చూస్తూ ఒకింత ఆశ్చర్యపోవచ్చు. టైటిల్ కు తగ్గట్లు పూర్తిగా టీవీ చుట్టూ కథను అల్లుకున్న తీరు.. అప్పటి పల్లెటూరి వాతావరణాన్ని చూపించిన తీరు.. సహజంగా ఈ కథను నడిపించిన వైనం బాగున్నాయి కానీ.. ఈ కథ పరిధి మరీ చిన్నదైపోయిన ఫీలింగ్ కలుగుతుంది. రెండు గంటల నిడివికి సరిపోయేంత విస్తృతి ఈ కథలో లేదనిపిస్తుంది. విడివిడిగా సన్నివేశాలు బాగున్నా.. ఓవరాల్ గా డ్రామా కూడా అనుకున్నంతగా పండలేదు.

‘తిమ్మరాజుపల్లి టీవీ’లో హీరో హీరోయిన్ల కంటే కూడా హైలైట్ అయింది టీవీనే. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాలో లీడ్ రోల్ టీవీదే. ఇప్పుడు 40 అంతకంటే ఎక్కువ వయసున్న వాళ్లకు టీవీలతో ఉన్న తొలి అనుభవాలన్నీ ఈ చిత్రంలో చూడొచ్చు. ముఖ్యంగా పల్లెటూళ్లలో ఆ రోజుల్లో టీవీని ఎంత అపురూపంగా చూసేవారో గమ్మత్తుగా ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు. టౌన్ నుంచి టీవీ- సినిమా క్యాసెట్లు రెంటుకు తెచ్చి పల్లెటూళ్లలో ప్రదర్శిైస్తే అదొక జాతరను తలపించేది. కొత్తగా ఎవ్వరి ఇంటికి అయినా టీవీ వస్తే ఊర్లో వాళ్లంతా అక్కడికి వచ్చి ఎలా హడావుడి చేసేవారో... టీవీ చూడ్డం కోసమే గంటల తరబడి ఆ ఇళ్లలో ఎలా తిష్ట వేసేవారో.. టీవీ ఉన్న వాళ్ల గర్వం ఎలా ఉండేదో చాలా బాగా చూపించారు. ఐతే కేవలం ఇలాంటి నోస్టాల్జిక్ మూమెంట్స్ చూపిస్తూ పోతే సరిపోదు కదా? అంతకుమించి ఏదో ఒక కథ చెప్పాలి. ఊరిలో ఉన్న ఒక్క టీవీ దొంగతనానికి గురి కావడం.. ఆ నింద హీరో మీద పడడం.. అతడి అతడి అస్తిత్వాన్నే దెబ్బ తీసే పరిస్థితి రావడం.. తన ప్రేమకు కూడా శాపంగా మారడం.. ఇలా డ్రామా రక్తికట్టేలా కథను బాగానే అల్లుకున్నారు. కానీ తెర మీద ఈ క్రమాన్ని అనుకున్నంత ఆసక్తికరంగా చూపించలేదు. హీరో హీరోయిన్ల పాత్రలను సరిగా తీర్చిదిద్దకపోవడం.. వారి మధ్య ప్రేమకథను కూడా తేల్చిపడేయడంతో వాటితో ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడదు. ప్రతి పాత్రా ఒక్కోసారి ఒక్కోరకంగా ప్రవర్తిస్తుంటుంది. ఏదీ బలమైన ఇంపాక్ట్ వేయదు. క్యారెక్టర్లలో ఒక కంటిన్యుటీ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. మొదట్లో కొన్ని నోస్టాల్జిక్ మూమెంట్స్ తర్వాత కథ పక్కదారి పట్టేసింది. టీవీ దొంగతనానికి గురి అయ్యే సన్నివేశం దగ్గర మళ్లీ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించగలిగాడు దర్శకుడు.

ఐతే ఇంటర్వెల్ దగ్గర హీరోలు వీర లెవెల్లో ఛాలెంజులు విసరడం.. ఆ వెంటనే ఆ ఇంటెన్సిటీని కొనసాగించకుండా మామూలుగా కనిపించడం చాలా సినిమాల్లో కనిపించే సమస్యే. ఇందులోనూ అదే జరుగుతుంది. సమస్య వచ్చినపుడు ఎంతో పౌరుషం చూపిస్తూ.. సవాళ్లు చేసే హీరో.. ఆ వెంటనే చప్పబడిపోతాడు. కొంత సమయం వరకు అచేతనంగా ఉండిపోతాడు. అందుకు తగ్గట్లే కథనం కూడా నత్తనడకన సాగుతుంది. ఐతే చివరి అరగంటలో ‘తిమ్మరాజుపల్లి టీవీ’ కొంచెం ఉత్కంఠభరితంగా సాగుతూ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. అసలు టీవీ దొంగిలించింది ఎవరనే విషయంలో సస్పెన్స్ బాగానే మెయింటైన్ చేశారు. చివరికి ఇచ్చిన ట్విస్ట్ ఆశ్చర్యపరుస్తుంది. అదే సమయంలో మిశ్రమానుభూతిని కలిగిస్తుంది. కానీ ‘టీవీ’లో ఉన్న ప్రతికూల కోణాన్ని హైలైట్ చేస్తూ పతాక సన్నివేశాలను ముగించడం బాగుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ‘తిమ్మరాజుపల్లి టీవీ’ కొంచెం భిన్నమైన ప్రయత్నమే. కాన్సెప్ట్ బాగుంది కానీ.. కథాకథనాల్లో ఇంకొంచెం వెయిట్ ఉండాల్సిందనిపిస్తుంది. ఇది మరీ ప్రత్యేకమైన అనుభూతిని కలిగించదు. అలా అని తీసిపడేయదగ్గ సినిమా కాదు.

నటీనటులు: ‘తిమ్మరాజుపల్లి టీవీ’లో తెలిసిన ముఖం ఒక్కటీ కనిపించదు. హీరో హీరోయిన్ల దగ్గర్నుంచి అందరూ కొత్త వాళ్లు.. లేదంటే పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలు చేసిన చిన్న నటుడు. కానీ వాళ్లందరూ కూడా ఎక్కడా తడబడకుండా తమ పాత్రలకు తగ్గట్లు సహజంగా నటించడం ‘తిమ్మరాజుపల్లి టీవీ’ ప్రత్యేకత. హీరో పాత్రలో సాయితేజ్ చాలా బాగా నటించాడు. కొన్ని సన్నివేశాల్లో అతను చూపించిన ఇంటెన్సిటీ ఆకట్టుకుంటుంది. హీరోయిన్ పాత్రకు వేద జలంధర్ సరిపోయింది. పల్లెటూరి అమ్మాయిగా సులువుగా ఒదిగిపోయింది. రాజప్ప పాత్రలో చేసిన నటుడి హావభావాలు బాగున్నాయి. కానీ ఆ పాత్ర నుంచి ఇంకా ఎక్కువ ఆశిస్తాం. అతడికి జోడీగా చేసిన అమ్మాయి.. తండ్రి పాత్రలో కనిపించిన నటుడు.. ఊరి పెద్ద పాత్రలో చేసిన యాక్టర్ కూడా మెప్పించారు. ఆర్టిస్టుల్లో ఎవరికీ వంకలు పెట్టడానికి వీల్లేదు. అందరూ కథకు.. పాత్రలకు తగ్గట్లుగా పెర్ఫామ్ చేశారు.

సాంకేతిక వర్గం: ఈ సినిమాకు రియల్ హీరో సంగీత దర్శకుడు వంశీకాంత్. సినిమాలో చాలా సాధారణంగా అనిపించే సన్నివేశాల్లో కూడా ఏదో జరిగిపోతున్న ఫీలింగ్ కలిగించి జనాలు ఉత్కంఠగా తెర వైపు చూసేలా చేశాడతను. వంశీకాంత్ బీజీఎం అంత ఎఫెక్టివ్ గా సాగింది. స్కోర్ వరకు ఆరంభం నుంచి చివరి వరకు ఎక్కడా టెంపో తగ్గకుండా చూశాడతను. పాటలు కూడా బాగానే అనిపిస్తాయి. అక్షయ్ రామ్ ఛాయాగ్రహణం కూడా బాగుంది. 90ల నాటి పల్లెటూరి వాతావరణాన్ని చాలా బాగా చూపించాడు. ఆర్ట్ వర్క్ కూడా ఓకే. ఇలాంటి కథకు సపోర్ట్ చేయడం ద్వారా కిరణ్ అబ్బవరం తన అభిరుచిని చాటుకున్నాడు. ఇంతమంది కొత్త వాళ్లను పరిచయం చేసినందుకు అతను అభినందనీయుడు. మునిరాజు రచయితగా-దర్శకుడిగా కొంతమేర ఆకట్టుకున్నాడు. అతను ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది. కానీ ఎగ్జిక్యూషన్లో కొంత తడబడ్డాడు. పాత్రల చిత్రణ ఇంకా బాగా ఉండుంటే.. కథనాన్ని మరింత బిగితో రాసుకుని ఉంటే ‘తిమ్మరాజుపల్లి టీవీ’ ఇంపాక్ట్ వేరుగా ఉండేది.

చివరగా: తిమ్మరాజుపల్లి టీవీ.. బొమ్మ పర్వాలేదు

రేటింగ్- 2.5/5