Begin typing your search above and press return to search.

నడిగర సంఘంలో తెలుగోడి బలం ఇదే

దక్షిణ భారత నటీనటుల సంఘం సీనియర్ సభ్యుడు ఈటి గోవిందన్ దురదృష్టవశాత్తు మరణించడంతో విశాల్ సీనియ‌ర్ల ఆరోగ్యం విష‌యంలో చొర‌వ తీసుకున్నార‌ని స‌మాచారం.

By:  Tupaki Desk   |   7 Nov 2023 4:11 AM GMT
నడిగర సంఘంలో తెలుగోడి బలం ఇదే
X

తమిళ చిత్రసీమలో స్టార్ హీరోగా, ప్ర‌ముఖ నిర్మాత‌గా స‌త్తా చాటుతున్నాడు తెలుగు కుర్రాడు విశాల్. నడిగర్ సంఘం- తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి ప్రముఖ సభ్యుడు అయిన విశాల్ పేరు ఇటీవ‌ల జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇంతకుముందు ముంబైలోని సెంట్ర‌ల్ బోర్డ్ స‌ర్టిఫికేష‌న్ లంచ‌గొండిత‌నంపై విశాల్ తీవ్రంగా ఆరోపించి, దేశంలో ఇలాంటి ధైర్యం ఉన్న తొలి న‌టుడు, నిర్మాత‌గా పేరు తెచ్చుకున్నాడు.

చాలా కాలం క్రితం రైతు స‌మ‌స్య‌ల విష‌యంలోను కేంద్ర‌ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా అత‌డు కాలు దువ్వాడు. ఇక న‌డిగ‌ర సంఘం, నిర్మాత‌ల మండ‌లి ఎన్నిక‌ల్లో ఎలాంటి స‌వాళ్ల‌కు అయినా అత‌డు సిద్ధ‌మ‌వుతుంటాడు. అందుకే అత‌డిని రియ‌ల్ పందెంకోడి అని అభిమానులు పిలుస్తారు. కేవ‌లం వివాదాలే కాదు, సామాజిక సేవ‌లోను తాను ఎల్ల‌పుడూ ముందుంటాన‌ని నిరూపించాడు. చెన్నై న‌గ‌రం వ‌ర‌ద‌ల్లో మునిగిన‌ప్పుడు విశాల్ చేసిన స‌హాయం, సేవ‌ల్ని న‌గ‌ర‌వాసులు మ‌ర్చిపోలేరు. న‌డిగ‌ర సంఘంలో చాలా స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం వెత‌క‌డ‌మే గాక, అందులో స‌భ్యుల‌ను విశాల్ ఆదుకున్నాడ‌ని చెబుతారు.

ఇటీవల నడిగర్ సంఘంలోని వృద్ధ సభ్యులకు మద్దతుగా విశాల్ ఒక కీల‌క‌ చర్య తీసుకున్నారు. దక్షిణ భారత నటీనటుల సంఘం సీనియర్ సభ్యుడు ఈటి గోవిందన్ దురదృష్టవశాత్తు మరణించడంతో విశాల్ సీనియ‌ర్ల ఆరోగ్యం విష‌యంలో చొర‌వ తీసుకున్నార‌ని స‌మాచారం. గోవింద‌న్ బంధువుల నుండి ఎటువంటి ఆర్థిక సహాయం లేకుండా అనారోగ్యంతో మరణించాడు. అత‌డి పరిస్థితి గురించి తెలుసుకున్న నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ వెంటనే చర్యలు తీసుకున్నారు. అత‌డి మ‌ర‌ణ‌వార్త తెలుసుకుని, వడపళని శ్మశానవాటికలో అంత్యక్రియలకు సరైన ఏర్పాట్లు చేసారు.

గోవిందన్ దుస్థితితో తీవ్రంగా ప్రభావితమైన విశాల్ ఇప్పుడు భవిష్యత్తులో వెట‌ర‌న్ ఆర్టిస్టులు అలాంటి పరిస్థితుల్లో చిక్కుకోకుండా నివారించడానికి తనవంతు ప్రయత్నాలను ప్రారంభించాడు. గోవిందన్ మృతికి దారితీసిన పరిస్థితులపై విచారం వ్యక్తం చేసిన ఆయన, నిరుపేద సభ్యుల గురించి సమాచారం సేకరించాలని తన బృందానికి సూచించారు. నడిగర్ సంఘం తరపున ఈ వ్యక్తులకు వసతి, ఆహార స‌దుపాయాల కొర‌త ఉండ‌కూడ‌ద‌ని విశాల్ నొక్కిచెప్పారు. విశాల్ లోని ఈ చురుకైన వైఖరి సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లోని సీనియర్ సభ్యుల దుస్థితికి ప‌రిష్కారం చూపుతుంద‌ని న‌మ్ముతున్నారు. భవిష్యత్తులో వారు ఇలాంటి నిస్సహాయ పరిస్థితులకు గురికాకుండా చూసుకునేందుకు నిధులు కేటాయించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. సంఘంలోని వృద్ధులను ఆదుకోవడానికి ప్ర‌య‌త్నిస్తున్నందున, ఈ చర్య వారి జీవితాల్లో సానుకూల మార్పును తెస్తుందనే ఆశ ఉంది. ఇక టాలీవుడ్ లో సీనియ‌ర్ ఆర్టిస్టుల‌కు ఫించ‌న్ కార్య‌క్ర‌మాలు సాగుతున్నాయి. అయితే పేద ఆర్టిస్టుల‌ను ఆదుకునేందుకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నారు? అన్న‌దానిపై స‌రైన స‌మాచారం లేదు. ఈ విష‌యంలో అన్ని ప‌రిశ్ర‌మ‌లో విశాల్ ని స్ఫూర్తిగా తీసుకోవాల‌ని కోరుకుంటున్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. విశాల్ ప్రస్తుతం దర్శకుడు హరితో తన ప్రాజెక్ట్ చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన రెండు ప్రధాన షెడ్యూల్‌లను పూర్తి చేశాడు. విశాల్ 34 అని తాత్కాలికంగా టైటిల్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.