Begin typing your search above and press return to search.

నెగిటివ్ టాక్ వస్తే మన సీనియర్ స్టార్ హీరోల సినిమాల పరిస్థితి ఇదీ!

దీనికి మనం లేటెస్ట్ ఉదాహరణగా 'లాల్ సలాం' మూవీని చెప్పుకోవచ్చు.

By:  Tupaki Desk   |   11 Feb 2024 12:30 AM GMT
నెగిటివ్ టాక్ వస్తే మన సీనియర్ స్టార్ హీరోల సినిమాల పరిస్థితి ఇదీ!
X

అగ్ర హీరోల సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా అంతో ఇంతో కలెక్షన్స్ రాబడుతుంటాయి. ఎందుకంటే కంటెంట్ ఎలా ఉన్నా వాళ్ళు తమ స్టార్ పవర్ తో జనాలను థియేటర్లకు రప్పించగలుగుతారు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు మాత్రం కంటెంటే కింగ్. చిన్న హీరో అయినా, పెద్ద హీరో అయినా సినిమా బాగుండి పాజిటివ్ టాక్ వస్తేనే బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు వస్తున్నాయి. అదే నెగిటివ్ టాక్ వస్తే, ఎంత పెద్ద స్టార్ హీరో అయినా మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రావడం లేదు. దీనికి మనం లేటెస్ట్ ఉదాహరణగా 'లాల్ సలాం' మూవీని చెప్పుకోవచ్చు.

సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం 'లాల్ సలామ్'. ఆయన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రలు పోషించారు. శుక్రవారం (ఫిబ్రవరి 9) రిలీజైన ఈ చిత్రం ఆడియన్స్ ను ఆశించిన విధంగా ఆకట్టుకోలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే పలు థియేటర్లలో జనాలు లేక షోలు క్యాన్సిల్ చేసారంటే కంటెంట్ ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. ఇక తొలి ఆట నుంచే నెగెటివ్ టాక్ రావడంతో, రెండో రోజు నుంచే అన్ని ఏరియాల్లో వాష్ అవుట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది.

'లాల్ సలామ్' సినిమాలో మెయినుద్దీన్ భాయ్ అనే పాత్రలో నటించారు రజనీ కాంత్. ఇది ఫుల్ లెంత్ రోల్ కాదు.. స్పెషల్ క్యామియో. అయినప్పటికీ 'జైలర్' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత తలైవర్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో, మొదట్లో అందరిలో ఆసక్తి నెలకొంది. కానీ తీరా థియేటర్లలోకి వచ్చాక నెగెటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమాలో ఎమోషనల్ కంటెంట్ లోపించడంతో ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేకపోయారు. రజనీ స్క్రీన్ టైమ్ తక్కువగా ఉంటుందని ముందే ఊహించినప్పటికీ, అందులోనూ ఆయన్ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం ఫ్యాన్స్ ను నిరాశ పరిచింది.

రజనీ గత చిత్రం 'జైలర్' 600 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది. తెలుగులోనూ కనీసం ఒక వారం పాటు హౌస్ ఫుల్స్ తో నడిచింది. దీంతో తలైవర్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారని అంతా భావించారు. నెక్స్ట్ మూవీతో బాక్సాఫీస్ షేక్ అవ్వడం గ్యారంటీ అనుకున్నారు. కానీ జైలర్ మ్యానియా 'లాల్ సలామ్‌' కి ఏమాత్రం హెల్ప్ అవ్వలేదు. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. దీంతో రెండో రోజే ఈ సినిమా ఫలితం ఏంటో తెలిసిపోయింది.

ఇప్పుడు రజనీకాంత్ మాదిరిగానే సరిగ్గా ఆరు నెలల క్రితం మెగాస్టార్ చిరంజీవికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. గతేడాది ఆగస్టులో 'భోళా శంకర్' రూపంలో చిరు తన కెరీర్ లోనే అతి పెద్ద ఫ్లాప్‌ను అందుకున్నాడు. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత, అలంటి మాస్ ఎలిమెంట్స్‌ తో ఈ సినిమాని తెరకెక్కించారు. కచ్చితంగా హిట్ అవుతుందని భావించారు. కానీ చిరు లెక్క తప్పింది. 'జైలర్' చిత్రానికి పోటీగా వచ్చిన ఈ మూవీ ఏ దశలోనూ ఆడియన్స్ ను ఆకట్టుకోకపోయింది. దీంతో రెండో రోజే థియేటర్ల నుంచి తీసేయాల్సి వచ్చింది.

అప్పుడు 'వాల్తేరు వీరయ్య' తర్వాత చిరు 'భోళా శంకర్' తో ఎలాంటి ఫలితాన్ని అందుకున్నారో, 'జైలర్' తర్వాత ఇప్పుడు 'లాల్ సలాం' తో రజనీ కూడా అదే రిజల్ట్ ను చవిచూడబోతున్నారని అర్థమవుతోంది. ఇక్కడ ఈ రెండు సందర్భాల నుంచి మనం గమనించాల్సింది ఏంటంటే.. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా, ఎన్ని బాక్సాఫీస్ రికార్డులున్నా సరైన కంటెంట్ లేకపోతే ప్రేక్షకులు నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మారుతున్న వారి అభిరుచులకు తగ్గట్టుగా కొత్తదనం ఉన్న కంటెంట్ తో వస్తేనే సక్సెస్ అందిస్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని మన వెటరన్ హీరోలు స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది.