Begin typing your search above and press return to search.

ఒక కథ.. రెండు భాగాలు.. ఇది టాలీవుడ్ నయా ట్రెండ్..!

ఆ సినిమా చూపించిన బాటలోనే ఒక కథను రెండు ముక్కలుగా చేసి చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   19 Feb 2024 8:46 AM GMT
ఒక కథ.. రెండు భాగాలు.. ఇది టాలీవుడ్ నయా ట్రెండ్..!
X

ప్రాంతీయ సినిమాగా ఉన్న తెలుగు సినిమాను ప్రపంచ స్థాయి సినిమాలతో పోటీ పడేలా చేసిన దర్శకుడు రాజమౌళి. బాహుబలితో ఆయన చేసిన అద్భుతాలు అన్నీ ఇన్ని కావు. ఒక కథను రెండు భాగాలుగా చెప్పొచ్చు. రెండు పార్టులుగా రిలీజ్ చేసేయొచ్చు అని చేసి చూపించాడు. బాహుబలి సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలోనే ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది. ఆ సినిమా చూపించిన బాటలోనే ఒక కథను రెండు ముక్కలుగా చేసి చెబుతున్నారు.

బాహుబలి తర్వాత కన్నడలో కె.జి.ఎఫ్ అదే తరహాలో వచ్చి సక్సెస్ అందుకుంది. అయితే తెలుగులో ఆ పంథా కొనసాగించాడు సుకుమార్. పుష్ప 1 తో సూపర్ హిట్ అందుకోగా పుష్ప కథను కూడా రెండు భాగాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. పుష్ప 2 మీద భారీ హైప్ ఏర్పడింది. తప్పకుండా పుష్ప 2 కూడా ప్రేక్షకుల అంచనాలకు తగినట్టుగానే ఉంటుందని చెప్పొచ్చు.

పుష్ప తర్వాత మరోసారి ప్రభాస్ రెండు భాగాలతో ఒక సినిమా కథను చెబుతున్నాడు. సలార్ 1 గా ఈమధ్యనే వచ్చిన ప్రభాస్ సలార్ 2 గా ఆ కథను కొనసాగింపు చేస్తున్నాడు. కె.జి.ఎఫ్ డైరెక్ట్ చేసిన ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను డైరెక్ట్ చేశాడు.

ఇక ఈమధ్యనే వచ్చిన రవితేజ ఈగల్ సినిమా కూడా ఇదే తరహా ఫాలో అయ్యింది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈగల్ సినిమా పార్ట్ 2 కూడా రాబోతుంది. ఈగల్ సినిమా రెండు భాగాలుగా వస్తుందని సినిమా రిలీజ్ అయ్యే వరకు సీక్రెట్ గా ఉంచారు.

ఇదే బాటలో ప్రభాస్ మరో సినిమా కల్కి కూడా రెండు భాగాలుగా వస్తుంది. కల్కి పార్ట్ 1 కల్కి 2898 ADగా రాబోతుంది. ప్రభాస్, అల్లు అర్జున్, రవితేజ తర్వాత ఎన్.టి.ఆర్ కూడా దేవరతో రెండు భాగాలుగా వస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా ముందు ఒక ప్రాజెక్ట్ గా చేయాలని అనుకున్నా క్యారెక్టరైజేషన్ బాగా వస్తుండటం వల్ల రెండు భాగాలుగా తీస్తున్నారు.

దేవర పార్ట్ 1 అక్టోబర్ 10న వస్తుంది. వీటితో పాటుగా రాజమౌళి మహేష్ కాంబోలో వస్తున్న సినిమా కూడా రెండు భాగాలుగా వస్తుందని తెలుస్తుంది. రాజమౌళితో మహేష్ ఫస్ట్ టైం కలిసి చేస్తున్న సినిమాగా ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా కథను కూడా రెండు భాగాలుగా చెప్పబోతున్నారని తెలుస్తుంది.

తెలుగులో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ ప్లాన్ చేసిన సినిమాల్లో సెట్స్ మీద ఉన్న ఆరు సినిమాలు కూడా రెండు భాగాలుగా కథను చెబుతున్నారు. తప్పకుండా ఈ సినిమాలు నేషనల్ లెవెల్ లో బీభత్సం సృష్టిస్తాయని చెప్పొచ్చు. టాలీవుడ్ లో కొనసాగుతున్న ఈ నయా ట్రెండ్ ఎన్నాళ్లు ఉంటుందో తెలియదు కానీ ఒక కథ రెండు భాగాలుగా చేస్తున్న ఈ స్టార్ హీరోల ప్రయత్నాలు సూపర్ అనిపించుకుంటున్నాయి.