Begin typing your search above and press return to search.

దేశంలో అత్యంత ఒరిజిన‌ల్ సినిమాటిక్ డైరెక్ట‌ర్

అర్జున్ రెడ్డి-క‌బీర్ సింగ్-యానిమ‌ల్ చిత్రాల‌తో అత‌డు సంచ‌ల‌న విజ‌యాల్ని అందుకున్నాడు.

By:  Tupaki Desk   |   19 Feb 2024 1:30 PM GMT
దేశంలో అత్యంత ఒరిజిన‌ల్ సినిమాటిక్ డైరెక్ట‌ర్
X

వ‌రుస‌గా పాన్ ఇండియా సంచ‌ల‌నాల‌తో ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి గొప్ప పేరు తెచ్చుకున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆయ‌న పేరు మార్మోగుతోంది. అనూహ్యంగా ఇప్పుడు మ‌రో తెలుగు ద‌ర్శ‌కుడి పేరు కూడా జాతీయ‌ స్థాయిలో మార్మోగుతోంది అంటే అతిశ‌యోక్తి కాదు. అత‌డు మ‌రెవ‌రో కాదు...మ‌న‌వాడైన తెలుగు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి-క‌బీర్ సింగ్-యానిమ‌ల్ చిత్రాల‌తో అత‌డు సంచ‌ల‌న విజ‌యాల్ని అందుకున్నాడు. యానిమ‌ల్ చిత్రం 800కోట్లు వ‌సూలు చేయ‌డం ఒక సంచ‌ల‌నం.


గత నెలలో గుజరాత్‌లో జరిగిన ఒక అవార్డుల కార్యక్రమంలో రణబీర్ కపూర్ ఓ ముగ్గ‌రికి ధ‌న్య‌వాదాలు తెలిపాడు. యానిమల్ చిత్రానికి ఉత్తమ నటుడిగా పుర‌స్కారం గెలిచిన తర్వాత ర‌ణ‌బీర్ ఎమోష‌న్ కి గుర‌య్యారు. ఈ సంద‌ర్భంగా యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, ర‌ణ‌బీర్ తండ్రి రిషి కపూర్ , త‌న‌ కుమార్తె రాహాకు తన ప్రసంగంలో కృతజ్ఞతలు తెలిపారు. అతను అవార్డును స్వీకరించిన వీడియోను అభిమానుల రెడ్డిట్ పేజీలో షేర్ చేయ‌గా అది వైరల్ గా మారింది.

స్పాన్సర్స్‌కు కృతజ్ఞతలు తెలిపిన అనంతరం రణబీర్ మాట్లాడుతూ.. ``ఈ అవార్డును నా జీవితంలో ముగ్గురికి అంకితం చేయాలనుకుంటున్నాను అంటూ ఈ పుర‌స్కారాన్ని తొలిగా సందీప్ రెడ్డి వంగాకు అంకిత‌మిచ్చాడు. ``మీరు ఇప్పటివరకు నేను పనిచేసిన అత్యంత ఒరిజిన‌ల్ అండ్ సినిమాటిక్ డైరెక్ట‌ర్‌. మీతో కలిసి పని చేయడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను. మీరు నా పట్ల చూపిన విశ్వాసం ప‌ట్టుద‌ల‌ నిజంగా నన్ను ప్రోత్సహించాయి. వంగా మీరు గెలిచారు..``అంటూ సందీప్ వంగాపై త‌న ప్రేమ‌ను గౌర‌వాన్ని వ్య‌క్తం చేసారు. నిజానికి బాలీవుడ్ అగ్ర హీరో ర‌ణ‌బీర్ నుంచి ఒక తెలుగు ద‌ర్శ‌కుడు ఇలాంటి గొప్ప ప్ర‌శంస‌ను అందుకోవ‌డం అంత ఆషామాషీ వ్య‌వ‌హారం కాదని అంగీక‌రించాలి.

ర‌ణ‌బీర్ త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగిస్తూ.. నేను ఈ అవార్డును అంకితం చేయాలనుకుంటున్న రెండవ వ్యక్తి మిస్టర్ రిషి కపూర్ - పాపా మేరీ జాన్. ప్రతిరోజూ నేను నీ గురించి ఆలోచిస్తాను.. నేను నిన్ను గుర్తుంచుకుంటాను. నేను మీ కోసం అనుభూతి చెందేవ‌న్నీ…ప్రేమ, ఆప్యాయతలను ఈ విధంగా ప్రసారం చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు అక్కడ(స్వ‌ర్గంలో) శాంతి విశ్రాంతితో ఉన్నారని నేను ఆశిస్తున్నాను. చివరగా నా కూతురు రాహా...కొంటెతనమా....నువ్వు పుట్టావు ..ఒక వారం తర్వాత నేను యానిమల్ కోసం ప్ర‌ధాన‌మైన‌ షూటింగ్ ప్రారంభించాను .. ప్రతి ఒక్క రోజు నీ కోసం ఇంటికి రావడం నా జీవితంలో అత్యంత ఆనందకరమైన అనుభవం. మమ్మా.. పాప ఈ రాత్రి ఆడుకోవడానికి మీకు బువా మాస్సీని తీసుకువస్తున్నారు... మీతో ప్రతి సాహసాన్ని అనుభవించడానికి నేను వేచి ఉండలేను.. నేను నిన్ను కొంటెగా ప్రేమిస్తున్నాను.. అని ఉద్వేగానికి లోన‌య్యాడు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. రణబీర్ కపూర్ ఇప్పుడు త‌న కెరీర్ బెస్ట్ ఫేజ్‌లో ఉన్నాడు. త్వరలో నితేష్ తివారీ రామాయణంలో శ్రీ‌రాముడిగా కనిపించనున్నారు. సాయి పల్లవి సీతగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు. కైకాయి పాత్ర కోసం లారా దత్తా ఎంపికైంది. శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ చర్చలు జరుపుతున్నట్లు క‌థ‌నాలొచ్చాయి. సంజయ్ లీలా భన్సాలీ `లవ్ అండ్ వార్‌`లో అలియా భట్ , విక్కీ కౌశల్‌లతో కలిసి న‌టిస్తున్నారు. భ‌న్సాలీ ఈ సినిమాతో తన సిగ్నేచర్ పీరియాడికల్ డ్రామాలకు విరామం తీసుకోనున్నట్లు సమాచారం.