Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : తెల్లకాగితం

‘కోర్ట్’ సినిమాతో ఆకట్టుకున్న హర్ష్ రోషన్.. ఆ తర్వాత కూడా వరుసగా టీనేజీ లవ్ స్టోరీలతో పలకరిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   2 Oct 2026 11:15 AM IST
మూవీ రివ్యూ : తెల్లకాగితం
X

‘తెల్లకాగితం’ మూవీ రివ్యూ

నటీనటులు: హర్ష్ రోషన్- నక్షత్ర- అజయ్- శరణ్య ప్రదీప్- రాజ్ కుమార్ కసిరెడ్డి తదితరులు

సంగీతం: విజయ్ బుల్గానిన్

ఛాయాగ్రహణం: కె.వి.గుహన్

నిర్మాత: కృష్ణ కొమ్మలపాటి

రచన: నందు సవిరిగన

దర్శకత్వం: రమేష్ బండ్రెడ్డి

‘కోర్ట్’ సినిమాతో ఆకట్టుకున్న హర్ష్ రోషన్.. ఆ తర్వాత కూడా వరుసగా టీనేజీ లవ్ స్టోరీలతో పలకరిస్తున్నాడు. ‘బ్యాండ్ మేళం’తో నిరాశపరిచిన అతను.. ఇప్పుడు ‘తెల్లకాగితం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త దర్శకుడు రమేష్ బండ్రెడ్డి రూపొందించిన ఈ చిత్రం.. ఈ రోజే థియేటర్లలోకి దిగింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

రాము (హర్ష్ రోషన్) తల్లిదండ్రులను కోల్పోయి.. అన్నా వదినల సంరక్షణలో పెరుగుతున్న కుర్రాడు. అతను పదో క్లాసులో తన సహ విద్యార్థిని అయిన ఆశ (నక్షత్ర) ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతణ్ని ప్రేమిస్తుంది. ఐతే ఆశను స్వచ్ఛంగా ప్రేమిస్తున్న అతను.. తన మావయ్య ప్రభావంతో ట్రాక్ తప్పుతాడు. రాము మీద ప్రేమతో ఆశ కూడా అదుపు తప్పుతుంది. ఇద్దరూ తప్పటడుగు వేస్తారు. దాని వల్ల వారి జీవితాలు ఎంతగా ప్రభావితం అయ్యాయి.. ఎలాంటి ఇబ్బందులు పడ్డారు.. చివరికి వీరి ప్రేమ కథ సుఖాంతం అయిందా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

ఒక టీనేజీ లవ్ స్టోరీని ఎలా డీల్ చేయాలి అనడానికి.. గత ఏడాది వచ్చిన ‘కోర్ట్’ సినిమా ఉదాహరణగా నిలిచింది. యువతకు మాత్రమే కాక.. పెద్దలకు కూడా బాగా కనెక్ట్ అయిన కథ అది. కానీ అందులో లీడ్ రోల్ చేసిన హర్ష్ రోషన్ ను పెట్టి.. వేరే ఫిలిం మేకర్స్ మళ్లీ మళ్లీ టీనేజీ లవ్ స్టోరీలు తీస్తున్నారే కానీ.. అవి ‘కోర్ట్’ దరిదాపుల్లోకి కూడా వెళ్లట్లేదు. ‘బ్యాండ్ మేళం’తో ఇచ్చిన షాక్ సరిపోదని.. ఇప్పుడు ‘తెల్లకాగితం’తో కూడా దాదాపు అలాంటి అనుభూతినే కలిగించాాడు హర్ష్. ఎప్పుడో ‘చిత్రం’ సినిమాలో చూసిన పాయింటు పట్టుకుని.. ఇప్పుడు సొసైటీకి ఏదో సందేశం ఇచ్చేద్దామని చేసిన ఈ ప్రయత్నం బెడిసికొట్టింది. ఆరంభం బాగున్నా.. అసలు కథలోకి అడుగుపెట్టాక విపరీతమైన సాగతీతతో.. సిల్లీ సీన్లతో విసిగించే ‘తెల్లకాగితం’ ఇంపాక్ట్ చూపించలేకపోయింది. ఇంకోసారి హర్ష్ రోషన్ టీనేజీ లవ్ స్టోరీ చేశాడంటే భయపడిపోయే స్థాయిలో ఈ సినిమా అసహనాన్ని కలిగిస్తుంది.

ఇది 2026వ సంవత్సరం. ‘తెల్లకాగితం’ కథ జరిగేది 20 ఏళ్ల ముందు. ఆ రోజుల్లో అయినా సరే.. పదో తరగతి చదివే కుర్రాడికి కండోమ్ అంటే తెలియకుండా దాన్ని బుడగ అనుకుని ఊదుతాడు అంటే ఎలా అనిపిస్తుంది. ఇదొక్కటేనా? అమ్మాయి పీరియడ్స్ మిస్సయిందని చెబితే నవ్వుతూ నేను కూడా చాలా పీరియడ్లు మిస్సయ్యా అని ఇంటర్ చదివే అబ్బాయి అనడం.. ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందో స్కూల్ బుక్కులో రాసి ఉందని ఎలా పోతుందో కూడా అదే పుస్తకంలో ఉంటుందని హీరో వెతకడం.. ఇలా విడ్డూరంగా అనిపించే సన్నివేశాలు ‘తెల్లకాగితం’లో చాలా ఉన్నాయి. 20 ఏళ్ల కిందట ఈ కథ నడుస్తుంది కాబట్టి అప్పటి యూత్ చాలా అమాయకులు వాళ్లకు ఏమీ తెలియదు అనుకోవడం భ్రమ. అయినా ఈ కాలంలో ఇలాంటి సన్నివేశాలు చూస్తే ప్రేక్షకులకు ఎలా ఉంటుందని కూడా ఆలోచించాలి.

అమాయకమైన అబ్బాయి-అమ్మాయి మధ్య కొన్ని అందమైన సన్నివేశాలతో ‘తెల్లకాగితం’ మొదట్లో ప్రామిసింగ్ గానే అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల పరిచయ సన్నివేశాలు.. వారి మధ్య ప్రేమ చిగురించే సీన్లు బాగుంటాయి. దీనికి తోడు రెండు హుషారైన పాటలు కూడా ఊపు తెస్తాయి. కానీ తొలి అరగంట తర్వాత ప్రేమకథను మలుపు తిప్పడానికి ఎంచుకున్న పాయింటు దగ్గర్నుంచే ‘తెల్లకాగితం’ ట్రాక్ తప్పుతుంది. టీనేజీ లవ్ స్టోరీలంటే చాలు.. లవ్ నుంచి లస్ట్ వైపు తిప్పడం మామూలే. ఇక్కడ కూడా అదే చేశారు. అందులో వల్గారిటీ ఏమీ లేదు కానీ.. హీరో హీరోయిన్లు తప్పటడుగు వేశాక తలెత్తే పర్యవసానాల మీద కథనాన్ని నడిపించిన తీరు మాత్రం అసహనానికి గురి చేస్తుంది. చిన్న పాయింటు పట్టుకుని రెండు గంటల పాటు కథను బాగా సాగదీశారు. రిపీటెడ్ సీన్లతో ఎంతకీ తెగకుండా ‘తెల్లకాగితం’ ఇరిటేట్ చేస్తుంది. కథ ముందుకే కదలకుండా అక్కడే స్ట్రక్ అయిపోవడంతో సినిమా ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి. చివర్లో కొంచెం షాకింగ్ గా కథను ముగించాలని.. ప్రేక్షకులకు మెసేజ్ ఇవ్వాలని చూశారు. దీని వరకు బాగున్నా.. అప్పటికే సినిమా మీద కలిగిన అభిప్రాయాన్ని క్లైమాక్స్ పెద్దగా మార్చలేకపోయింది. మొత్తంగా చెప్పాలంటే.. తెల్లకాగితం ఒక సగటు నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ. మొదట్లో ఆశలు రేకెత్తించినా.. మెసేజ్ బాగున్నా.. ఈ కథను చెప్పిన పద్ధతి అంత ఆసక్తికరంగా లేకపోవడంతో ఇంపాక్ట్ మిస్ అయింది.

నటీనటులు:

హర్ష్ రోషన్ హుషారైన కుర్రాడే. తన హావభావాలు ఆకట్టుకుంటాయి. పాత్రకు తగ్గట్లుగా నటించాడు. కానీ బ్యాండ్ మేళం తరహాలోనే ఇందులో కూడా తన క్యారెక్టర్ ప్రేక్షకులను బాగా ఇరిటేట్ చేస్తుంది. నక్షత్ర ఈ సినిమాలో బెస్ట్ పెర్ఫార్మెర్. కొత్తమ్మాయి అయినా ఆ ఫీలింగ్ కలగకుండా చక్కగా నటించింది నక్షత్ర. చూడ్డానికి కూడా బావుంది. తన పాత్రను కూడా బాగా తీర్చిదిద్దారు. తన తండ్రి పాత్రలో అజయ్ బాగా చేశాడు. హీరో ఫ్రెండ్ పాత్రలో చేసిన కుర్రాడు పర్వాలేదు. వదిన క్యారెక్టర్లో శరణ్య ప్రదీప్ బాగా చేసింది కానీ ఆమెకు పెద్దగా స్కోప్ లేదు. మిగతా ఆర్టిస్టులంతా మామూలే.

సాంకేతిక వర్గం:

టెక్నికల్ గా 'తెల్ల కాగితం' పర్వాలేదు. విజయ్ బుల్గానిన్ పాటల్లో రెండు ఆకట్టుకున్నాయి. బీజీఎం మామూలుగా అనిపిస్తుంది. కె.వి.గుహన్ విజువల్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకి అవసరమైన స్థాయిలో ఉన్నాయి. నందు స్క్రిప్టులో ఏమంత విశేషం లేదు. ఇందులో ఇవ్వాలనుకున్న మెసేజ్ బాగుంది. కానీ దాన్ని చెప్పిన పద్ధతి అంత బాగాలేదు. వీక్ స్క్రిప్టును దర్శకుడు రమేష్ బండ్రెడ్డి తన టేకింగ్ తోనూ మెరుగుపరచలేకపోయాడు.

చివరగా: తెల్ల కాగితం.. తేలిపోయింది

రేటింగ్- 2/5