Begin typing your search above and press return to search.

100 కోట్ల సినిమా తెలుగులో ఎందుకు ఆడలేదు?

'ది గోట్ లైఫ్ - ఆడు జీవితం' చిత్రాన్ని గత నెల 28వ తేదీన మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల చేసారు

By:  Tupaki Desk   |   7 April 2024 2:45 AM GMT
100 కోట్ల సినిమా తెలుగులో ఎందుకు ఆడలేదు?
X

'సలార్' స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన లేటెస్ట్ మూవీ "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం). మార్చి నెలాఖరున పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ సినిమా, 9 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుని, రెండో వారంలోకి అడుగుపెట్టింది. అయితే మలయాళంలో మంచి ఆదరణ పొందుతోన్న ఈ చిత్రం.. మిగతా దక్షణాది రాష్ట్రాలు, నార్త్ సర్క్యూట్స్ లో ఆశించిన విధంగా వసూళ్లు రాబట్టకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

'ది గోట్ లైఫ్ - ఆడు జీవితం' చిత్రాన్ని గత నెల 28వ తేదీన మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల చేసారు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ తమ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ద్వారా ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేసారు. అయితే కేరళలో భారీ సక్సెస్ సాధించిన ఈ చిత్రం, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఆడలేదు. తమిళంలో ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది కానీ.. తెలుగు, కన్నడ, హిందీ మార్కెట్లలో మాత్రం నిరాశ పరిచింది.

మంచి సినిమాలను ఎంకరేజ్ చేయడానికి తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ముందే ఉంటారు. అందులోనూ ఇటీవల కాలంలో వచ్చిన కొన్ని మలయాళ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను విశేషంగా ఆదరించారు.. బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్స్ అందించారు. కానీ ఇప్పుడు 'ది గోట్ లైఫ్ - ఆడు జీవితం' సినిమా విషయంలో మాత్రం తేడా కొట్టింది. ఎందుకనో మన దగ్గర ఆదరణ తగ్గింది. దీంతో కంటెంట్ ఓరియెంటెడ్ మూవీని తిరస్కరించారని ఆరోపిస్తూ మలయాళ సినీ అభిమానులు తెలుగు ప్రేక్షకులను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.

ఒక భాషలో హిట్టైన సినిమా మరో భాషలో సక్సెస్ అవ్వాలని లేదు.. మలయాళ ఆడియన్స్ కు నచ్చిన మూవీ, మన జనాలకు నచ్చాలనీ లేదు. కాకపోతే 'ఆడు జీవితం' తెలుగు ప్రమోషనల్ కంటెంట్ కు ఇక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ కూడా ప్రమోషన్స్ బాగానే చేసారు. పృథ్వీరాజ్ సుకుమారన్ హైదరాబాద్ కు వచ్చి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ మూవీ గురించి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి, తనవంతు సపోర్ట్ చేసారు. ఇక సినిమా రిలీజైన తర్వాత ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. దాదాపు అన్ని రివ్యూలు పాజిటివ్ గానే వచ్చాయి. బుక్ మై షోలో 9.5 రేటింగ్ వచ్చింది. కానీ దానికి తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ మాత్రం రాలేదు.

తెలుగు రాష్ట్రాల్లో 'ది గోట్ లైఫ్' సినిమాకి ఆదరణ తగ్గడానికి మెయిన్ రీజన్ 'టిల్లు స్క్వేర్' అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 'ఆడు జీవితం' వచ్చిన తర్వాతి రోజున 'డీజే టిల్లు' సీక్వెల్ రిలీజ్ అయ్యింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఎక్కడా ఆగకుండా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోయింది. కంటెంట్ వైస్ పృథ్వీరాజ్ సినిమా బెస్ట్ అనిపించుకున్నప్పటికీ, తెలుగు ఆడియన్స్ ఒరిజినల్ తెలుగు మూవీకే ప్రాధాన్యత ఇచ్చారని వసూళ్లు చూస్తే అర్థమవుతోంది. ఒకవేళ మలయాళ డబ్బింగ్ మూవీ వేరే డేట్ కి వచ్చి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో.

"ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాను బెన్యామిన్ రాసిన 'గోట్ డేస్' నవల ఆధారంగా తెరకెక్కించారు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ. 90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే మలయాళీ యువకుడి జీవిత కథను ఈ సినిమాలో ఆవిష్కరించారు. ఇది వాస్తవ ఘటనల ఆధారంగా పూర్తిగా ఎడారి ప్రాంతంలో తీసిన తొలి భారతీయ సినిమా. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే కీలక పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చగా.. రసూల్ పూకుట్టి సౌండ్ డిజైన్ చేసారు. సునీల్ కేఎస్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేసారు.