Begin typing your search above and press return to search.

విదేశాల్లో బందీ అయిన 'స‌లార్' స్టార్

పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్-ఇండియన్ చిత్రం 'ఆడుజీవితం' (ది గోట్ లైఫ్‌.. ఇత‌ర భాష‌ల టైటిల్) ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా ఆన్‌లైన్‌లో విడుదలైంది.

By:  Tupaki Desk   |   11 Jan 2024 4:15 AM GMT
విదేశాల్లో బందీ అయిన స‌లార్ స్టార్
X

పృథ్వీరాజ్ సుకుమారన్ .. ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఖాన్సార్ సామ్రాజ్యంలో ప‌ట్టాభిషేకం కోసం ఉద్యుక్తుడ‌వుతున్న ఒక రాకుమారుడు. 'స‌లార్' ప్ర‌పంచంలో ఎదురేలేనివాడిగా ఎదిగేందుకు ఓపిక స‌హ‌నంతో వేచి చూసే వీరుడిగా క‌నిపించాడు. స‌లార్ లో పృథ్వీరాజ్ వేష‌ధార‌ణ‌, న‌ట‌న‌కు మంచి పేరు, గుర్తింపు ద‌క్కాయి. స‌లార్ రెండో భాగంలో అత‌డి పాత్ర మ‌రో మ‌లుపు తీసుకోనుంద‌ని మొద‌టి భాగంలో హింట్ ఇచ్చారు. ప్ర‌శాంత్ నీల్ స‌లార్ 2 ని గ్యాప్ లేకుండా వెంట‌నే ప్రారంభించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు.


ఇంత‌లోనే పృథ్వీరాజ్ సుకుమార‌న్ త‌దుప‌రి ప్ర‌యోగాత్మ‌క చిత్రం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని క‌లిగిస్తోంది. పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్-ఇండియన్ చిత్రం 'ఆడుజీవితం' (ది గోట్ లైఫ్‌.. ఇత‌ర భాష‌ల టైటిల్) ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా ఆన్‌లైన్‌లో విడుదలైంది. పోస్టర్‌లో పృథ్వీరాజ్ బాగా చిరిగిన బట్టలు.. మాసిన‌ గడ్డం త‌ల‌క‌ట్టుతో క‌నిపిస్తున్నాడు. ఏళ్ల త‌ర‌బ‌డి ఎలాంటి పోష‌ణ‌, సౌక‌ర్యం లేకుండా న‌లిగిపోయిన ఒక బానిస‌లా క‌నిపిస్తున్నాడు. బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఆడుజీవితం 10 ఏప్రిల్ 2024న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం క‌థాంశం ఆస‌క్తిక‌రం. పాపుల‌ర్ ర‌చ‌యిత‌ బెన్యామిన్ రచించిన 'ఆడు జీవితం' అదే పేరుతో 2008 మలయాళ నవలకి తెర‌నువాదం ఇది. ఇది 90వ దశకం ప్రారంభంలో కేరళలోని పచ్చటి తీరం నుండి విదేశాలలో అదృష్టాన్ని వెతుక్కుంటూ వలస వచ్చిన నజీబ్ అనే యువకుడి నిజజీవిత కథతో రూపొందింది.

పృథ్వీరాజ్‌తో పాటు, ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు జిమ్మీ జీన్-లూయిస్, అమలా పాల్, K.R.గోకుల్ , ప్రఖ్యాత అరబ్ నటులు తాలిబ్ అల్ బలూషి, రికాబీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ది గోట్ లైఫ్ కి ఏ.ఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తుండ‌గా, సౌండ్ డిజైన్‌ను ర‌సూల్ పూక్కుట్టి అందిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌: సునీల్ కెఎస్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్.