ఈవారం థియేటర్లలో ఏం చూడాలి?
మరి ఈ వారం బాక్సాఫీస్ వద్ద ఏయే సినిమాలు సందడి చేస్తున్నాయో ఓసారి చూద్దాం.
By: Madhu Reddy | 27 April 2026 11:09 AM ISTసమ్మర్ సీజన్ వచ్చేసింది, ఈ మే మొదటి వారం సినిమా ప్రియులకు అసలైన వినోదం పంచడానికి సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 27 నుండి మే 3 వరకు థియేటర్లలో వెరైటీ సినిమాల జాతర జరగబోతోంది. ధనుష్ బ్యాంక్ రాబరీ థ్రిల్లర్ 'కర' తరుణ్ భాస్కర్ పొలిటికల్ సెటైర్ 'గాయపడ్డ సింహం', సత్య కామెడీ షో 'జెట్లీ' వంటి ఆసక్తికరమైన చిత్రాలు క్యూలో ఉన్నాయి. మరి ఈ వారం బాక్సాఫీస్ వద్ద ఏయే సినిమాలు సందడి చేస్తున్నాయో ఓసారి చూద్దాం.
బ్యాంకు దోపిడీతో ధనుష్ ‘కర’:
తమిళ స్టార్ హీరో ధనుష్, మమితా బైజు జంటగా నటించిన సినిమా ‘కర’. ఈ ఏప్రిల్ 30న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతోంది. ఇందులో ధనుష్ ఒక దొంగ పాత్రలో కనిపిస్తున్నారు. ఇక వరుస బ్యాంకు దోపిడీలు చేసే వ్యక్తిగా, అసలు ఆ వృత్తిని ఎందుకు ఎంచుకున్నాడో అనే సస్పెన్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. జివి ప్రకాష్ మ్యూజిక్ ఇప్పటికే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది.
ట్రంప్‌తో తరుణ్ భాస్కర్ యుద్ధం:
దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా మారిన చిత్రం ‘గాయపడ్డ సింహం’. అమెరికా నుంచి తనను పంపించేయడంతో డోనాల్డ్ ట్రంప్‌పైనే యుద్ధం ప్రకటించే ఒక యువకుడి కథ ఇది. ఇక ఇందులో జేడీ చక్రవర్తి, శ్రీ విష్ణు కీలక పాత్రలు పోషించారు. పవన్ సాధినేని సమర్పణలో మే 1న రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇదొక డిఫరెంట్ ఎంటర్టైనర్ అనిపిస్తోంది.
సత్య ‘జెట్లీ’తో ఫుల్ కామెడీ:
కమెడియన్ సత్య హీరోగా, 'మత్తు వదలరా' దర్శకుడు రితేష్ రాణా తెరకెక్కించిన సినిమా ‘జెట్లీ’. వెన్నెల కిశోర్ కూడా ఒక ముఖ్య పాత్రలో ఉండటంతో ఈ మూవీపై మంచి కామెడీ అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్స్ చూస్తుంటే ఈ మే 1న థియేటర్లలో నవ్వుల వర్షం కురవడం గ్యారెంటీ అని అర్థమవుతోంది. ఇక సత్య మార్క్ కామెడీ కోసం వెయిట్ చేసే వారికి ఇది మంచి ఆప్షన్.
లెజెండ్స్ కాంబోలో ‘పేట్రియాట్’:
మలయాళ సూపర్ స్టార్స్ మోహన్ లాల్, మమ్ముట్టి దాదాపు 13 ఏళ్ల తర్వాత కలిసి నటించిన సినిమా ‘పేట్రియాట్’. నయనతార, ఫహాద్ ఫాజిల్ వంటి భారీ తారాగణం ఉన్న ఈ దేశభక్తి చిత్రం మే 1న రిలీజ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాపై భారీ క్రేజ్ ఉంది. ఇక ఇద్దరు దిగ్గజాలను ఒకే స్క్రీన్‌పై చూడటం అభిమానులకు పండగే అని చెప్పాలి.
సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ:
సాయి పల్లవి నటించిన మొదటి హిందీ సినిమా ‘ఏక్ దిన్’ తెలుగులో ‘ఒక రోజు’ పేరుతో మే 1న విడుదలవుతోంది. అమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ ఇందులో హీరోగా పరిచయం అవుతున్నారు. అదే రోజు రితేష్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహించి నటించిన ‘రాజా శివాజీ’ కూడా రిలీజ్ అవుతోంది. ఇక ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథతో వస్తున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
మొత్తానికి ఈ వారం థియేటర్లలో సినిమాల జాతర మామూలుగా లేదు. యాక్షన్, కామెడీ, దేశభక్తి, బయోపిక్.. ఇలా అన్ని రకాల జోనర్లలో సినిమాలు ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. మరి వీటిలో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవుతుందో, ఏది ఫ్యాన్స్‌ను మెప్పిస్తుందో వేచి చూడాలి. ఇంకెందుకు ఆలస్యం, మీ ఫేవరెట్ సినిమాకు టికెట్స్ ఇప్పుడే బుక్ చేసుకోండి!
