థియేటర్ల దుస్థితిపై దర్శకుడి ఓపెన్ టాక్
''నేను షూటింగ్స్, ఇతర పనుల మీద గత కొన్ని రోజుల్లో ఆంధ్రా ప్రాంతంలో బాగా తిరిగాను. థియేటర్లకు వెళ్లాను. జనం లేక థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి.
By: Tupaki Desk | 16 April 2025 6:26 PMఒకప్పుడు వేసవి సెలవులంటే థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడేవి. పెద్ద పెద్ద సినిమాలు రిలీజయ్యేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. థియేటర్లలో జనం కనిపించట్లేదు. పెద్ద సినిమాలూ రిలీజ్ కావట్లేదు. కాస్త క్రేజున్న సినిమా రిలీజైనా వీకెండ్ వరకే కొంచెం సదండి కనిపిస్తోంది. తర్వాత థియేటర్లు ఖాళీనే. రోజు రోజుకూ థియేటర్ల పరిస్థితి కష్టంగా మారుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.
దీని గురించే దర్శకుడు త్రినాథరావు నక్కిన తన ప్రొడక్షన్లో తెరకెక్కిన చౌర్యపాఠం సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లో చాలా నిజాయితీగా మాట్లాడాడు. థియేటర్ల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో తాను కళ్లారా చూశానని.. ఇలాగే ఉంటే థియేటర్లు కొనసాగడం కష్టమని త్రినాథరావు అన్నాడు. జనాలు థియేటర్లకు వచ్చి సినిమాలు చూసి సినిమాను, సినిమా మీద ఆధారపడ్డ తమను బతికించాలని ఆయన కోరాడు.
''నేను షూటింగ్స్, ఇతర పనుల మీద గత కొన్ని రోజుల్లో ఆంధ్రా ప్రాంతంలో బాగా తిరిగాను. థియేటర్లకు వెళ్లాను. జనం లేక థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి. చాలా థియేటర్లలో సెకండ్ షోలు వేయట్లేదు. జనం లేక షోలు క్యాన్సిల్ చేసేస్తున్నారు. ఇది చిన్న సినిమాలకే పరిమితమైన విషయం కాదు. స్టార్ హీరోల సినిమాలకూ అదే పరిస్థితి ఉంది. షోలు క్యాన్సిల్ చేస్తున్నారు. కారణాలేంటో తెలియదు కానీ జనం థియేటర్లకు రావట్లేదు.
స్టార్ల సినిమాలకే అలా ఉంటే.. మా లాగా చిన్న సినిమాలు తీసేవాళ్ల పరిస్థితేంటి? అందరూ కొత్తవాళ్లను పెట్టి తీసిన చౌర్యపాఠం లాంటి చిత్రాలను రిలీజ్ చేయాలంటే భయంగా ఉంది. దయచేసి ప్రేక్షకులు థియేటర్లకు రండి. మా సినిమా చూసి బాగుంటే కొందరికి చెప్పండి. నచ్చకపోతే ఊరుకోండి. కానీ థియేటర్లకు మాత్రం రండి. మీరు వస్తేనే మేం సినిమాలు చేయగలం. మా కడుపు నిండుతుంది. నేను షూటింగ్‌లో మెడకు ఎర్ర కండువా కట్టుకుంటా. అది నేనూ ఒక కార్మికుడినే అని చెప్పడానికే. మరి జనం థియేటర్లకు వచ్చి సినిమాలు చూడకుంటే మా లాంటి కార్మికులు ఎలా బతకాలి? సినిమా బతకాలి, మేమందరం తిండి తినాలి అంటే మీరంతా థియేటర్లకు వచ్చి సినిమాలు చూడాలి'' అని త్రినాథరావు అన్నాడు.