క్రూరత్వాన్ని ఎదురించేవాడు హీరోనా?
హద్దులు చెరిపేసిన రక్తపాతం, భారీ యాక్షన్, గగుర్పాటుకు గురి చేసే క్రైమ్ దృశ్యాలతో సినిమా కథలు చాలా దూరం వెళ్లాయి.
By: Tupaki Desk | 22 Jun 2025 1:00 PM ISTక్రూరుడు విలన్ అయితే, క్రూరత్వాన్ని ఎదురించేవాడు హీరోనా? ఇది వినడానికి సింపుల్ గా ఉన్నా, జవాబు రాబట్టడానికి చాలా పెద్ద ప్రశ్న. ఈరోజుల్లో సినిమాలన్నిటినీ పరిశీలిస్తే, క్రూరుడు ప్రతినాయకుడిగా కనిపిస్తున్నాడు. క్రూరుడిని క్రూరత్వంతో ఎదురించేవాడు హీరో అవుతున్నాడు. కేజీఎఫ్, పుష్ప 2, సలార్ 1, విక్రమ్, యానిమల్ .. వీటన్నిటిలో నెగెటివ్ షేడ్ చూపిస్తూనే, హీరోయిజాన్ని ఆవిష్కరించేందుకు దర్శకులు చాలా ప్రయత్నించారు. ప్రజలు కూడా అలాంటి పాత్రలను ఇష్టపడ్డారు.
హద్దులు చెరిపేసిన రక్తపాతం, భారీ యాక్షన్, గగుర్పాటుకు గురి చేసే క్రైమ్ దృశ్యాలతో సినిమా కథలు చాలా దూరం వెళ్లాయి. హీరోయిజాన్ని భీకరంగా ఎలివేట్ చేయాలంటే, విలన్ ని అత్యంత క్రూరుడిగా జాలి దయ లేని దుష్టుడిగా చూపించాలి. కేజీఎఫ్ మొదలు ఇలాంటి కల్చర్ సినిమాల్లో మరింత ఎక్కువగా కనిపిస్తోంది. భారీ ఫైటింగులు, హింసను ప్రేరేపించనిదే సూపర్ హీరో లాంటి కథానాయకుడిని చూపించడం కుదరడం లేదు. ఇక ఇవన్నీ పాన్ ఇండియాలో ఆదరణ పొందుతున్నాయంటే, ఆ మేరకు కోట్లాదిగా ప్రజలు అంగీకరిస్తున్నారనే అర్థం చేసుకోవాలి.
అయితే మగ పాత్రలను మరీ ఇంత పవర్ ఫుల్ గా చూపిస్తున్న కారణంగా, ఆ పాత్రల పక్కన ఫీమేల్ పాత్రలు పలుచన అవుతున్నాయన్న విమర్శ కూడా ఉంది. అయితే ఈ విమర్శలకు భిన్నంగా పుష్ప 2, యానిమల్ చిత్రంలో రష్మిక మందన్న పాత్రలను మలిచిన తీరు ప్రశంసలు దక్కించుకుంది. ఇక కేజీఎఫ్ ఫ్రాంఛైజీ కానీ, సలార్ లో కానీ కథానాయిక పాత్రలకు అంతగా గుర్తింపు లేదు. కమల్ హాసన్ విక్రమ్ సినిమాలోను నాయికలకు అస్సలు వెయిట్ లేదు.
ఇక పెద్ద హీరోలను పూర్తిగా మాస్ అవతార్ లో ప్రెజెంట్ చేసారు దర్శకులు. బాగా పెరిగిన జుత్తు, గుబురు గడ్డం, మీసకట్టుతో వీరంతా క్రూరుల్లాగే కనిపించారు. స్మార్ట్ హీరోలను కూడా సూపర్ మాస్ హీరోలుగా చూపించారు. అల్లు అర్జున్, ప్రభాస్, కమల్ హాసన్, యష్ లాంటి స్టార్లను మ్యాకోలుగా చూపించారు. అయితే ఇలా మ్యాకో సూపర్ హీరోయిజాన్ని తెరపై చూపిస్తేనే పాన్ ఇండియాలో రీచ్ సాధ్యమవుతుందా? అన్నది సందిగ్ధంగా మారింది. అలా కాకుండా డి.డి.ఎల్.జే, కభీ ఖుషి కభీ ఘమ్, నిన్నే పెళ్లాడుతా తరహా పాత్రలను సృష్టిస్తే ఇప్పుడు పాన్ ఇండియాలో వర్కవుట్ కావని భావించాల్సి వస్తోంది.
