ది రాజాసాబ్.. అసలు పాయింట్స్ లీక్ చేసిన మారుతి!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ది రాజాసాబ్’.
By: Tupaki Desk | 18 Jun 2025 6:04 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ది రాజాసాబ్’. ఇది పూర్తి స్థాయి హారర్ ఫాంటసీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్‌లతో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఫన్, హర్రర్, లవ్ మిక్స్‌తో భిన్నంగా అనిపిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవల దర్శకుడు మారుతి ఈ సినిమా కథ, విజువల్ ప్రెజెంటేషన్ గురించి కీలక విషయాలు బయటపెట్టారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ‘‘ది రాజాసాబ్ ఒక ఎమోషనల్ స్టోరీ. తాత, మనవడు, నానమ్మ మధ్య ఉండే బంధాన్ని చూపించే సినిమాగా ఇది రూపొందుతోంది. ఇందులో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఈ కథతో కనెక్ట్ అవుతారు. ఇటువంటి కాన్సెప్ట్ ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు చూడలేదని నమ్మకంగా చెబుతాను’’ అని తెలిపారు. ప్రభాస్ వంటి స్టార్‌తో ఎమోషన్ డ్రివన్ కథ చెప్పడం సాహసమే అయినా.. ఆ ప్రయోగం బెస్ట్ అవుతుందన్న నమ్మకాన్ని మారుతి వ్యక్తం చేశారు.
ఇక సినిమాలో హవేలి సెటప్, విజువల్ ఎఫెక్ట్స్ గురించి కూడా ఆయన వివరించారు. ‘‘ప్రభాస్ స్థాయికి తగినట్లు సెట్స్ ఏర్పాటు చేయాలని ఆలోచించాం. అందుకే దాదాపు రూ.7 కోట్ల వ్యయంతో హవేలి రాజ్‌మహల్ సెట్పై షూటింగ్ చేశాం. అలాగే వీఎఫ్ఎక్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఎఫెక్ట్స్ తారాజువ్వలా కాకుండా, నిజమైన భావాన్ని చూపించేలా ఉండాలనేది మా ఉద్దేశం’’ అని అన్నారు. నిర్మాణ సంస్థ ఎక్కడా ఖర్చు విషయంలో వెనుకాడలేదని, అందుకే ప్రేక్షకులకు మంచి విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వగలమని తెలిపారు.
ఈ సినిమా కోసం ప్రభాస్ పూర్తిస్థాయిలో కష్టపడుతున్నారని మారుతి వెల్లడించారు. ప్రతి షాట్‌కు ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, ప్రేక్షకులకు కచ్చితంగా కొత్త ప్రభాస్‌ను చూపించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో ప్రభాస్‌కు సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ లాంటి ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్‌దత్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
ఇటీవల విడుదలైన టీజర్‌లో ప్రభాస్ వింటేజ్ లుక్, కామెడీ హర్రర్ మూడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక సినిమా నిడివి సుమారు 3 గంటలు ఉంటుందని దర్శకుడు మారుతి తెలిపాడు. డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం విడుదలైన డేటాల ప్రకారం, ఈ మూవీ మరింత ఎమోషన్, హారర్, ఫన్ కలిపిన కుటుంబ కథాంశంగా ప్రేక్షకులను ఆకట్టుకోనుందని దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి మారుతి చెప్పిన ఈ కీలక పాయింట్లు సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేశాయి. ఇక కమర్షియల్ గా సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటోంది చూడాలి.
