Begin typing your search above and press return to search.

ది ప్యారడైజ్ మూవీ రివ్యూ

By:  Tupaki Desk   |   24 Sept 2026 8:18 AM IST
ది ప్యారడైజ్ మూవీ రివ్యూ
X

'ది ప్యారడైజ్' మూవీ రివ్యూ

నటీనటులు: నాని - కాయదు లోహర్ - మోహన్ బాబు - రాఘవ్ జుయల్ - సోనాలి కులకర్ణి - సంపూర్ణేష్ బాబు- ప్రియదర్శి తదితరులు

సంగీతం: అనిరుధ్ రవిచందర్

ఛాయాగ్రహణం: సీహెచ్ సాయి

నిర్మాత: సుధాకర్ చెరుకూరి

రచన - దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల

దసరా సినిమాతో సంచలనం రేపిన నేచురల్ స్టార్ నాని.. శ్రీకాంత్ ఓదెల కలిసి చేసిన 'ది ప్యారడైజ్' ఆరంభం నుంచే మాంచి హైప్ తెచ్చుకుంది. భారీ అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అందరూ అనుకున్నట్లే నాని కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లే స్థాయిలోనే ఉందా? తెలుసుకుందాం పదండి.

కథ:

తమకంటూ ఏ గుర్తింపు లేని సవారీ అనే జాతిలో పుట్టిన కుర్రాడు జడల్ (నాని). అతడి తల్లి సమ్మక్క (సోనాలి కులకర్ణి). ఈ సవారీలు అంటే అందరికీ చిన్నచూపే. వాళ్ళను మనుషుల్లా గుర్తించరు. వీళ్లుండే ప్యారడైజ్ ప్రాంతాన్ని శిఖంజ మాలిక్ (మోహన్ బాబు) ఏలుతుంటాడు. సవారీల మీద శిఖంజకు ఉన్న వ్యతిరేకత వల్ల.. అతడికి భయపడి ప్రభుత్వ వ్యవస్థ ఏమాత్రం సహకరించదు. సమ్మక్క తమ జాతి గుర్తింపు కోసం పోరాడుతుంటే.. జడల్ మాత్రం ఒక కారణం వల్ల తల్లి మీద ద్వేషంతో ఇదేమి పట్టనట్లు ఉండిపోతాడు. ఐతే శిఖంజ కొడుకుతో వైరం పెట్టుకున్న జడల్.. ఒక సందర్భంలో తల్లి మీద అభిప్రాయం మార్చుకుని ఆమె చేస్తున్న పోరాటంలో భాగం అవుతాడు. మరి శిఖంజతో పోరాటంలో జడల్ గెలిచాడా? సవారీలు కోరుకున్న గుర్తింపును సంపాదించి పెట్టాడా? అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ: కథనం - విశ్లేషణ:

‘ఛత్రపతి’లో వలస జీవుల అస్తిత్వం కోసం పోరాడతాడు హీరో. ‘కేజీఎఫ్’లో బానిస బతుకుల విముక్తి కోసం నిలబడతాడు కథానాయకుడు. ‘పుష్ప’లో తన ఐడెంటిటీ కోసమే కొట్లాడతాడు హీరో. ఈ మధ్య ‘పెద్ది’లో కథానాయకుడు కూడా తన ఊరికి ఒక గుర్తింపు కాావాలంటూ పోరాటం చేస్తాడు. ఈ కథలన్నీ ప్రేక్షకులను మెప్పించినవే. కొంచెం నేపథ్యం మార్చి.. ప్రేక్షకులను కాస్త భిన్నమైన ప్రపంచంలోకి తీసుకెళ్లి.. కథలోని ఎమోషన్ ను ఫీలయ్యేలా చేయగలిగితే.. ఇవే కథల్ని తీసినా చూస్తారు జనం. ఎమోషన్ పండితే.. ఎలివేషన్ క్లిక్ అయితే ఆ కథల రేంజే మారిపోతుంది. ‘ది ప్యారడైజ్’లో శ్రీకాంత్ ఓదెల చెప్పిన కథ కూడా ఇలాంటిదే. తమకంటూ ఏ గుర్తింపు లేని ఒక జాతి.. ఆ గుర్తింపు కోసం చేసే పోరాటం.. ఆ క్రమంలో ఎదిగే ఒక నాయకుడు.. ఇలా ఫెమిలియర్ లైన్లోనే నడిచే ‘ది ప్యారడైజ్’ కథను డిఫరెంట్ స్టైల్లో చెప్పాలని చూశాడు శ్రీకాంత్. ఇందుకోసం అతను ఎంచుకున్న స్టైల్.. వయొలెన్స్. కానీ ఆ వయొలెన్స్ మరీ శ్రుతిమించిపోవడం.. కథలోని ఎమోషన్ అనుకున్నంతగా పండకపోవడం.. హీరో-విలన్ రెండు పాత్రలూ అనుకున్నంతగా క్లిక్ కాకపోవడంతో ‘ది ప్యారడైజ్’ అంచనాలను అందుకోలేకపోయింది. విడివిడిగా కొన్ని ఎపిసోడ్లు బాగున్నప్పటికీ.. ఓవరాల్ గా ఈ సినిమా నిరాశపరుస్తుంది.

ఒకప్పుడు నానిని మాస్ అవతారంలో ఊహించుకోలేకపోయేవాళ్లం. కానీ చిన్న చిన్నగా మాస్ అడుగులు వేసుకుంటూ వచ్చిన అతను.. మాస్ హీరోగా ప్రేక్షకుల ఆమోదం పొందాడు. ‘దసరా’ సినిమాలో అయితే మరీ ఊర మాస్ క్యారెక్టర్ తోనూ ఆకట్టుకున్నాడు. పాత్రలో ఉన్న బలం.. కన్విన్సింగ్ గా అనిపించిన నాని పెర్ఫామెన్స్.. ఆ క్యారెక్టర్ కు ప్రేక్షకులు జైకొట్టేలా చేశాయి. పాత్రతో ప్రేక్షకులకు ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడేలా చేయడాన్ని బట్టి ఇలాంటి మాస్ పాత్రలు క్లిక్ అవుతాయి. ఆ కనెక్ట్ ఏర్పడనపుడు టేకింగ్ ద్వారా ఎంత మ్యాజిక్ చేయాలని చూసినా.. హీరో ఎంత ఎఫర్ట్ పెట్టి గొప్పగా పెర్ఫామ్ చేసినా రావాల్సిన ఎఫెక్ట్ రాదు. ‘ది ప్యారడైజ్’లో అదే జరిగింది. ఇప్పుడు హీరో కొడితే బాగుండు అని ప్రేక్షకులకు అనిపించినపుడు.. వాళ్లలో ఒక కసి రేగేలా సన్నివేశాన్ని బిల్డ్ చేసినపుడు.. హీరో విజృంభించాడంటే ఎలివేషన్ పండుతుంది. కానీ ఇక్కడ మాత్రం తెరపై హీరో వీర లెవెల్లో విధ్వంసం సృష్టిస్తున్నా ప్రేక్షకుల్లో ఉద్వేగం కలగదు. సన్నివేశాల టేకింగ్ అదిరిపోయినప్పటికీ వయొలెన్స్ వెనుక ఎమోషన్ మిస్ అవ్వడంతో సన్నివేశాలు అతిగా అనిపిస్తాయి. తన కథను కొంచెం పచ్చిగా చూపించాలనే దర్శకుడి ప్రయత్నాన్ని తప్పుబట్టలేం కానీ.. ఆ క్రమంలో మరీ హద్దులు దాటిపోవడంతో కొన్ని సన్నివేశాలను తట్టుకోవడం కష్టమవుతుంది.

ఒకవైపు నాని.. ఇంకోవైపు మోహన్ బాబు.. మరోవైపు ‘కిల్’ ఫేమ్ రాఘవ్ జుయల్.. ఇలాంటి ఆర్టిస్టులకు సరైన పాత్రలు పడితే.. వాళ్లే సినిమాను వేరే లెవెల్ కు తీసుకెళ్లిపోయేవారు. కానీ సోనాలి కులకర్ణి చేసిన హీరో తల్లి పాత్ర క్లిక్ అయినట్లుగా.. వీళ్ల పాత్రలు కుదరలేదు. విలన్ల పాత్ర ఎంత బలంగా ఉంటే హీరో క్యారెక్టర్ అంత క్లిక్ అవుతుందన్నది వాస్తవం. కానీ ఇక్కడ ప్రతినాయకుల పాత్రల్లో బలం తగ్గింది. శిఖంజ మాలిక్ ఒక రాక్షసుడు అని మాటల్లో చూపించడమే తప్ప.. ప్రేక్షకులకు భయంగొలిపేలా ఆ పాత్రను తీర్చిదిద్దలేదు. కొడుకు పాత్ర అయితే మరీ వీక్. ఈ క్యారెక్టర్లు అంతంతమాత్రంగా అనిపించడంతో.. వాళ్లను ఢీకొట్టే హీరో పాత్ర కూడా ఎలివేట్ కాలేదు. హీరో మీద ‘లం..కొడుకు’ అనే ముద్ర పడడానికి కారణం చూపిస్తూ నడిపించిన బ్యాక్ స్టోరీ మాత్రం పండింది. ఈ ఎపిసోడ్ వల్ల 'ది ప్యారడైజ్’ మొదట్లో చాలా ప్రామిసింగ్ గా అనిపిస్తుంది. తల్లీకొడుకుల ఎమోషన్ కూడా బాగా వర్కవుట్ అయింది. సినిమాలో కథ పరంగా ఇదే మేజర్ హైలైట్. దానివల్లే ఇంటర్వెల్ ఎపిసోడ్ పేలింది. ఐతే సవారీల తాలూకు బాధను కూడా ఇలాగే బలంగా చూపించాల్సింది. కానీ ఆ ట్రాక్ పండలేదు. హీరో-విలన్ మధ్య కాన్ఫ్లిక్ట్ కి సంబంధించిన సన్నివేశాలను కూడా సరిగా తీర్చిదిద్దుకోలేదు దర్శకుడు. సవారీల ప్రపంచాన్ని సరిగా ప్రెజెంట్ చేయడంలో... వారి బాధలను గుండెకు హత్తుకునేలా చెప్పడంలో దర్శకుడు తడబడ్డాడు. హీరో పాత్రతో ప్రేక్షకులకు బలమైన ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడలేదు. ఇక్కడే శ్రీకాంత్ ఓదెల గురువు సుకుమార్ ‘పుష్ప’ సినిమాలో హీరో పాత్రతో ప్రేక్షకుల్లో ఎలాంటి ఎమోషన్ తీసుకురాగలిగాడో గుర్తు చేసుకోవాలి. ఆ ఎమోషనే ఇక్కడ మిస్ అయింది.

ముందే అన్నట్లు ‘ది ప్యారడైజ్’లో విడివిడిగా చూస్తే కొన్ని ఎపిసోడ్లు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ మాస్ ప్రేక్షకులు కోరుకునే హై ఇస్తుంది. తల్లి-కొడుకు మధ్య సన్నివేశాలు బాగానే పండాయి. యాక్షన్ ఘట్టాలన్నింటినీ బాగా తీశాడు శ్రీకాంత్ ఓదెల. హీరో ఎలివేషన్ సీన్లు కూడా ఓకే అనిపిస్తాయి. కాకపోతే హింస మితిమీరిపోవడం వల్ల వాటిని అన్ని వర్గాల ప్రేక్షకులూ ఎంజాయ్ చేయలేదు. కొంచెం ఎగుడుదిగుడుగానే ఉన్నప్పటికీ.. హీరోయిజం బాగా పండిన ఇంటర్వెల్ బ్యాంగ్ వల్ల ప్రథమార్ధం వరకు ‘ది ప్యారడైజ్’ ఓకే అనిపిస్తుంది. కానీ రెండో అర్ధం మాత్రం బాగా నిరాశపరుస్తుంది. నాని-మోహన్ బాబు ఫేసాఫ్ గురించి ఎంతో ఊహించుకుంటాం కానీ.. ఆ సన్నివేశం పండకపోవడంతో ఆ ప్రభావం ద్వితీయార్ధం మీద గట్టిగా పడింది. మోహన్ బాబు పాత్ర క్లిక్ కాకపోవడంతో.. నాని క్యారెక్టర్ కూడా అనుకున్నంతగా ఎలివేట్ కాలేదు. సవారీల తిరుగుబాటు నేపథ్యంలో నడిచే సన్నివేశాల్లో బలం లేకపోయింది. ప్రియదర్శి చేసిన కేసీఆర్ పాత్ర కొంత జోష్ తెస్తుంది. యేషనాగుల పాటకు టైమింగ్ కుదరలేదు కానీ ఆ సాంగ్ ఒక ఊపు ఊపేస్తుంది. ఇవి తప్పితే.. ద్వితీయార్ధం చాలా వరకు నిరాశపరుస్తుంది. క్లైమాక్స్ భారీగా తీసినా సరే.. అది ఇవ్వాల్సిన హై ఇవ్వలేదు. ఓవరాల్ గా చెప్పాలంటే.. కొన్ని ఎపిసోడ్ల వరకు ఓకే అనిపించినా.. ‘దసరా’ కాంబినేషన్ నుంచి ఆశించే సినిమా కాదు.. ‘ది ప్యారడైజ్’. నటీనటులు: నాని 'దసరా'ను మించిన ఊర మాస్ పాత్రకు న్యాయం చెయ్యడానికి ఎంతో కష్టపడ్డాడు. పెర్ఫార్మెన్స్ పరంగా నాని తన క్యారెక్టర్ కోసం ఏమివ్వాలో అదంతా ఇచ్చాడు. అతడి ఎఫర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ గత కొన్నేళ్లలో ఎంత మాస్ ఇమేజ్ తెచ్చుకున్నా సరే.. మరీ మాస్ భారం ఎక్కువైపోవడంతో జడల్ పాత్రను మొయ్యలేకపోయాడు. ఈ పాత్ర అతడికి అంతగా సూట్ కాలేదనిపిస్తుంది. నాని నుంచి మరీ ఇంత వయొలెన్స్ అంటే తనను ఎంతో అభిమానించే ఫ్యామిలీ ఆడియన్స్ తట్టుకోవడం కష్టమే. హీరోయిన్ కాయదు లోహర్ కి భిన్నమైన పాత్రే దక్కింది. తన పెర్ఫార్మెన్స్ బాగుంది. లుక్ కూడా ఆకట్టుకుంటుంది. తన గ్లామర్ ను ఉపయోగించుకునేలా పాత్రను డిజైన్ చేశాడు దర్శకుడు. కానీ ఆమె పాత్ర మిక్స్డ్ ఫీలింగ్ ఇస్తుంది. మోహన్ బాబు చేసిన శిఖంజ మాలిక్ పాత్ర కూడా అంచనాలకు తగ్గట్లు లేదు. ఆయన రేంజికి ఇంకా పవర్ ఫుల్ రోల్ ఆశిస్తాం. తన డైలాగ్ డెలివరీతో కొన్ని చోట్ల మాలిక్ పాత్రకు బలం తెచ్చారు కానీ.. ఓవరాల్ గా క్యారెక్టర్ ఆర్క్ సరిగా లేకపోవడంతో మోహన్ బాబు బలమైన ముద్ర వేయలేక పోయారు. ఇక కథలో అత్యంత కీలకమైన హీరో తల్లి పాత్రలో బాలీవుడ్ నటి సోనాలి కులకర్ణి గొప్పగా నటించింది. సినిమాలో బెస్ట్ పెర్ఫార్మెర్ ఆమే. నానిని కూడా ఆమె డామినేట్ చేసింది. రాఘవ్ జుయల్ కి ప్రోమోల్లో ఇచ్చిన బిల్డప్ సినిమాలో లేదు. తన లుక్ మీద పెట్టిన శ్రద్ధ పాత్ర మీద పెట్టలేదు. తన యాక్టింగ్ బాగున్నా పాత్రలో దమ్ము లేకపోయింది. బిర్యానీ పాత్రలో సంపూర్ణేష్ బాబు జస్ట్ ఓకే అనిపించాడు.

సాంకేతిక వర్గం:

అనిరుధ్ రవిచందర్ మీద ఫ్యాన్స్ పెట్టుకునే అంచనాలకు అతను తగ్గలేదు. ఆయా షేర్.. యేషనాగుల కట్ట.. సమ్మక్క.. ఈ పాటలన్నీ అదిరిపోయాయి. బీజీఎం విషయంలో కూడా అనిరుధ్ బాగానే డ్యూటీ చేశాడు కానీ కొన్నిచోట్ల సౌండ్ మరీ ఎక్కువైంది. సీహెచ్ సాయి ఛాయాగ్రహణం బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కి ఏమి లోటు లేదు. భారీగా ఖర్చు పెట్టారు. ఎంతైనా ఖర్చు పెట్టే నిర్మాత.. ఎంతైనా కష్టపడే హీరో.. ఇంకా కోరుకున్న అన్ని వనరులు సమకూరినా.. రైటర్ - డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఉపయోగించుకోలేక పోయాడు. ఎన్నోసార్లు చూసిన కథకే మేకప్ వెయ్యాలని.. టేకింగ్ తో మ్యాజిక్ చెయ్యాలని చూశాడు కానీ ఆశించిన ఫలితం రాలేదు. కొన్ని ఎపిసోడ్ల వరకు ఓకే అనిపించినా ఓవరాల్ గా శ్రీకాంత్ తనపై నెలకొన్న భారీ అంచనాలను అందుకోలేకపోయాడు.

చివరగా: ప్యారడైజ్.. మాస్ ఓవర్ డోస్

రేటింగ్ -2.25/5