Begin typing your search above and press return to search.

‘ది ఆడిస్సీ’ మూవీ రివ్యూ

హాలీవుడ్ సినిమాలకు ఇండియాలో మంచి ఫాలోయింగే ఉంది. ఆ సినిమాల కోసమే ఒక వర్గం ప్రేక్షకులు ప్రతి వారం ఎదురు చూస్తుంటారు.

By:  Tupaki Desk   |   17 July 2026 3:57 PM IST
‘ది ఆడిస్సీ’ మూవీ రివ్యూ
X

నటీనటులు: మ్యాట్ డామన్- టామ్ హాలండ్- అనే హతావే - రాబర్ట్ ప్యాటిన్సన్- లుపిటా న్యోంగో- జెండాయా- చార్లిజ్ తెరాన్ తదితరులు

సంగీతం: లుడ్విగ్ గోరాన్సన్

ఛాయాగ్రహణం: వాన్ హాయ్టేమా

నిర్మాతలు: క్రిస్టఫర్ నోలన్- ఎమ్మా థామస్

రచన-దర్శకత్వం: క్రిస్టఫర్ నోలన్

హాలీవుడ్ సినిమాలకు ఇండియాలో మంచి ఫాలోయింగే ఉంది. ఆ సినిమాల కోసమే ఒక వర్గం ప్రేక్షకులు ప్రతి వారం ఎదురు చూస్తుంటారు. కానీ ఇండియాలో ఒక పెద్ద సూపర్ స్టార్ నటించిన పాన్ ఇండియా మూవీ రిలీజవుతున్నట్లుగా దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఒక హాలీవుడ్ మూవీ కోసం ఎదురు చూడడం మాత్రం అరుదైన విషయమే. ఆ అరుదైన చిత్రమే.. ది ఆడిస్సీ. ఇందులో స్టార్లేమీ నటించలేదు. ఇదేమీ పేరుమోసిన ఫ్రాంఛైజీ ఫిలిం కాదు. అయినా ఈ చిత్రానికి విపరీతమైన హైప్ ఉందంటే అందుక్కారణం.. క్రిస్టఫర్ నోలన్. బ్యాట్ మ్యాన్ బిగిన్స్.. ది డార్క్ నైట్.. ఇన్సెప్షన్.. ఇంటర్ స్టెల్లార్.. డన్కిర్క్.. టెనెట్.. ఆపెన్ హైమర్.. లాంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులను ఉర్రూతలూగించి.. ప్రపంచ సినీ చరిత్రలోనే మేటి దర్శకుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న నోలన్ కు ఇండియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన కొత్త చిత్రం ‘ది ఆడిస్సీ’ కోసం అభిమానుల నిరీక్షణ ఈ రోజు ఫలించింది. మరి భారీ అంచనాలను ‘ది ఆడిస్సీ’ అందుకుందా.. నోలన్ మరోసారి వెండితెరపై అద్భుతాలను ఆవిష్కరించాడా.. తెలుసుకుందాం పదండి.

ముందు గా కథ విషయానికి వస్తే.. ఆడిస్సియస్ (మ్యాట్ డామన్) నేతృత్వంలోని గ్రీక్ సైన్యం.. ట్రాయ్ రాజ్యం మీదికి దండెత్తి వెళ్తుంది. నేరుగా వారిని ఢీకొట్టకుండా.. ఒక భారీ ట్రోజన్ హార్స్ దాక్కున్న ఆడిస్సియస్ సైన్యం.. ఆ గుర్రాన్ని ట్రాయ్ సైన్యం తమ రాజ్యంలోకి తీసుకెళ్లేలా చేస్తారు. తర్వాత ఆ గుర్రం నుంచి బయటికి వచ్చిన సైనికులు.. ట్రాయ్ సైన్యం కళ్లు గప్పి ఆ రాజ్యాన్ని ధ్వంసం చేస్తారు. యుద్ధం ముగించుకుని తమ రాజ్యానికి బయల్దేరాక ఆడిస్సియస్.. అతడి బృందానికి అసలు సవాలు మొదలవుతుంది. సముద్ర ప్రయాణంలో అనేక చిక్కులు ఎదురవుతాయి. దారి తప్పుతారు. తిండి దొరక్క అవస్థలు పడతారు. మరి ఈ అడ్డంకులన్నీ దాటి ఆడిస్సియస్ తన రాజ్యానికి చేరుకోగలిగాడా.. తనతో పాటు ఎంతమంది సైనికులు రాజ్యానికి వచ్చారు.. ఇక్కడ ఆడిస్సియస్ కి ఎదురైన అనభవాలేంటి.. చివరికి తన భార్యాపిల్లలతో అతను ఒక్కటయ్యాడా.. ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.

కల్పిత కథలకు హద్దులు ఉండవు. ఏమైనా రాసుకోవచ్చు. ఎలా అయినా తీయొచ్చు. కానీ వాస్తవంగా జరిగిన చారిత్రక కథలను తెరపైకి తీసుకురావడం అంత తేలికైన విషయం కాదు. కొంత లిబర్టీ తీసుకున్నా సరే.. సినిమాకు అవసరమైన డ్రామాతో వాస్తవ కథలను చెప్పడానికి గొప్ప నేర్పు కాావాలి. తన ముందు సినిమాల తరహాలో విజువల్ మాయాజాలం లేకపోయినా.. స్క్రీన్ ప్లేతో ఆటాడుకునే కథ కాకపోయినా.. ‘ఆపెన్ హైమర్’ అనే ఎమోషనల్ డ్రామాను కూాడా అత్యద్భుతంగా తెరపై ప్రెజెంట్ చేసి ప్రేక్షకులను కదిలించిన దర్శకుడు క్రిస్టఫర్ నోలన్. ఈసారి ఆయన గ్రీకు-ట్రాయ్ రాజ్యాల మధ్య జరిగిన యుద్ధం.. ఆ యుద్ధ అనంతర పరిణామాలకు ఫాంటసీ అంశాలను జోడించి.. వెండితెరపై విజువల్ మాయాజాలం చేయడమే కాదు.. భావోద్వేగాలను కూడా పతాక స్థాయికి తీసుకెళ్లాడు. నరేషన్ కొంచెం నెమ్మదిగా సాగుతుందన్న కంప్లైంట్ తప్పితే.. ‘ది ఆడిస్సీ’ ఒక గొప్ప సినిమాటిక్ అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు.

రాజులు.. రాజ్యాలు.. యుద్ధాల నేపథ్యంలో ప్రపంచ సినిమా చరిత్రలో ఎన్నో సినిమాలున్నాయి. ఐతే ‘ది ఆడిస్సీ’ ఒకటి కాదు. అద్భుత యుద్ధ సన్నివేశాలు చూద్దామని ఈ సినిమాకు వెళ్తే నిరాశ తప్పదు. ఇది ఆ కోవకు చెందిన సినిమా కాదు. ఈ కథ ఉద్దేశం కూడా అది కాదు. యుద్ధ అనంతరం ఒక యోధుడి తిరుగు ప్రయాణం.. అందులో అతను ఎదుర్కొన్న అనుభవాలు.. ఈ జర్నీలో అతను నేర్చుకున్న పాఠం.. అంతిమంగా ఇచ్చే సందేశం.. ఇదే ‘ది ఆడిస్సీ’ సారాంశం. అమెరికా-ఇజ్రాయెల్ × ఇరాన్ మధ్య కొన్ని నెలల పాటు సాగిన యుద్ధ ప్రభావంతో ప్రపంచమంతా ఎలా షేక్ అయిందో చూశాం.. చూస్తున్నాం. యుద్ధం వల్ల తలెత్తే అనర్థాల గురించి సున్నితమైన-అద్భుతమైన సన్నివేశాలతో గొప్ప సందేశం ఇచ్చే ఇలాంటి సినిమా రావడం యాదృచ్ఛికం. నోలన్ నుంచి ఆశించే విజువల్ మాయాజాలానికేమీ ఇందులో లోటు లేకపోయినా.. దాన్ని మించి ఈ సినిమాకు ఇచ్చిన ఎమోషనల్ పే ఆఫ్ ప్రేక్షకులకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. ‘ది ఆడిస్సీ’ని ప్రత్యేకంగా నిలిపేది ఇందులోని భావోద్వేగాలే. ఆ భావోద్వేగలను అనుభూతి చెందిన వాళ్లకు.. నోలన్ ఇవ్వాలనుకున్న సందేశాన్ని అర్థం చేసుకున్న వాళ్లకు ‘ది ఆడిస్సీ’ చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది.

మన ప్రేక్షకుల్లో ఎక్కువగా హాలీవుడ్ సినిమాలను చూసేది వాటిలోని భారీతనం.. విజువల్ మాయాజాలం.. అడ్వెంచరస్ సీన్ల కోసమే. ‘ది ఆడిస్సీ’ ఆ కోణంలోనూ ఆకట్టుకుంటుంది. చరిత్రలో ఎంతో పేరుపొందిన ట్రోజన్ హార్స్ ఎపిసోడ్ ను ‘ది ఆడిస్సీ’లో అద్భుతంగా తీర్చిదిద్దాడు నోలన్. ట్రాయ్ రాజ్యం కూలిపోవడానికి దారితీసే ఈ ఎపిసోడ్ గొప్ప అనుభూతిని ఇస్తుంది. దాంతో పాటు ఆడిసియస్ బృందం తిరుగు ప్రయాణంలో ఆహారం కోసం పడే పాట్లు ఆ క్రమంలో గుహలో ఒక భారీ విచిత్ర ఆకారం బారిన పడి తప్పించుకునే ఎపిసోడ్.. ఒక మాయ లేడీ చేతికి చిక్కి అక్కడి నుంచి బయటపడే మరో ఎపిసోడ్.. ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. ఇవన్నీ ఒకెత్తయితే.. మన కమర్షియల్ సినిమాల తరహాలో పతాక సన్నివేశంలో హీరో ఎలివేషన్ సీన్.. ఆ తర్వాత వచ్చే యాక్షన్ ఘట్టం వారెవా అనిపిస్తాయి. కొంచెం నెమ్మదిగా సాగే సినిమాలో ఇలాంటి ఎపిసోడ్లు కావాల్సిన ప్రేక్షకుల్లో చురుకుపుట్టిస్తాయి. గ్రీకు దేవుళ్లు.. వాళ్ల శాపాలకు సంబంధించిన సీన్లు ఆసక్తికరంగా అనిపిస్తాయి.

‘ది ఆడిస్సీ’ సినిమా చూసే ముందు ఈ కథ నేపథ్యం గురించి కొంచెం తెలుసుకుని థియేటర్లలోకి అడుగు పెడితే మంచిది. అప్పుడే ఈ సినిమాను ఇంకా బాగా అర్థం చేసుకోగలం. లేదంటే గందరగోళం తప్పదు. నరేషన్ స్లోగా ఉండడం వల్ల మధ్య మధ్యలో ‘ది ఆడిస్సీ’ కొంత బోర్ కొట్టిస్తుంది. కొన్ని సన్నివేశాలు సహనాన్ని పరీక్షిస్తాయి. కొన్ని క్యారెక్టర్ల ప్రవర్తన చిత్రంగా అనిపించి అసహనం కలుగుతుంది. కానీ ఇలాంటి చిన్న చిన్న లోపాలను మరిపించే అద్భుత కథాకథనాలు.. నోలన్ మార్కు సన్నివేశాలు ‘ది ఆడిస్సీ’ని మెస్మరైజింగ్ మూవీగా మార్చాయి. దర్శకుడిగా ఆయన పనితనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వాస్తవ కథ తెలిసిన వాళ్లు ఊహించుకున్న దానికి మించి దృశ్యరూపంలో గొప్ప అనుభూతిని పంచుతాడు నోలన్. నటీనటులు.. టెక్నీషియన్లందరూ నోలన్ విజన్ కు పూర్తి సహకారం అందించారు. ప్రధాన పాత్రధారి మ్యాట్ డామన్.. ఆడిసియస్ పాత్రలో అద్భుతంగా నటించాడు. రాణి పాత్రలో అనే హతావే సహా మిగతా నటీనటులందరూ కూడా చాలా బాగా చేశారు. లుడ్విగ్ గోరాన్సన్ బీజీఎం సినిమాకు సాంకేతికంగా అతి పెద్ద ఆకర్షణ. సన్నివేశాలను చాలా బాగా ఎలివేట్ చేసింది స్కోర్. వాన్ హాయ్టేమా ఛాయాగ్రహణం కూడా గొప్పగా సాగింది. సాంకేతికంగా సినిమా వేరే స్థాయిలో రూపొందింది. నోలన్ అభిమానులు ఆయన మీద పెట్టుకున్న అంచనాలకు ‘ది ఆడిస్సీ’ ఏమాత్రం తగ్గదు.

చివరగా: నోలన్ మార్కు ‘ఆడిస్సీ’

రేటింగ్- 3.25/5