Begin typing your search above and press return to search.

ది మ‌మ్మీ టీజ‌ర్: గుండె జ‌బ్బు ఉన్న‌వారికి నిషేధం

ఇప్పుడు లీ క్రోనిన్ దర్శకత్వంలో రాబోతున్న `ద మమ్మీ` టీజర్ ద‌డ పుట్టిస్తోంది. ప్రస్తుతం హర్రర్ సినీ ప్రియులలో ఈ కొత్త టీజ‌ర్ ప్రకంపన సృష్టిస్తోంది.

By:  Tupaki Desk   |   13 Jan 2026 9:12 PM IST
ది మ‌మ్మీ టీజ‌ర్: గుండె జ‌బ్బు ఉన్న‌వారికి నిషేధం
X

ది మ‌మ్మీ, ది మ‌మ్మీ రిట‌ర్న్ (ది మ‌మ్మీ 2) చిత్రాలు తెలుగులోను విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాలు సాధించిన సంగ‌తి తెలిసిందే. స్టీఫెన్ సోమ‌ర్స్ ఈ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ది మ‌మ్మీ 3 కూడా విడుద‌లైంది కానీ అంత‌గా విజ‌యం సాధించ‌లేదు. కానీ మ‌మ్మీ ఫ్రాంఛైజీ నుంచి ఏ సినిమాలు వచ్చినా వాటికి భార‌త‌దేశంలో ఉండే క్రేజ్ అసాధార‌ణ‌మైన‌ది. నిధి కోసం అన్వేషిస్తూ, ఈజిప్ట్ మ‌మ్మీల‌కు చిక్కే మాన‌వ‌మాతృల అష్ట‌క‌ష్టాల‌ను ఈ సినిమాల్లో చూపించారు. వంద‌ల వేల ఏళ్ల నాటి ఈజిప్ట్ స‌మాధుల నుంచి మ‌మ్మీలు బ‌య‌ట‌కు వ‌స్తే, ప్రాణం పోసుకుని మ‌నుషుల్ని వెంటాడితే ఎలా ఉంటుందో ద‌డ పుట్టించే రేంజులో చూపించ‌డంలో హాలీవుడ్ సాంకేతిక నిపుణుల ప్ర‌తిభ ఔరా! అనిపించింది. నిజానికి మ‌మ్మీ ఫ్రాంఛైజీ సినిమాలు హార‌ర్ సినిమాలు కావు. యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ కేట‌గిరీలో భిన్న‌మైన సినిమాలు.

ఇప్పుడు లీ క్రోనిన్ దర్శకత్వంలో రాబోతున్న `ద మమ్మీ` టీజర్ ద‌డ పుట్టిస్తోంది. ప్రస్తుతం హర్రర్ సినీ ప్రియులలో ఈ కొత్త టీజ‌ర్ ప్రకంపన సృష్టిస్తోంది. `ఈవిల్ డెడ్ రైజ్` చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా భయపెట్టిన లీ క్రోనిన్, ఇప్పుడు ఈ క్లాసిక్ మాన్‌స్టర్ కథను తనదైన స్టైల్‌లో రీబూట్ చేస్తున్నారు. ది మ‌మ్మీ ఫ్రాంఛైజీ కంటే ఇది పూర్తి భిన్న‌మైన జాన‌ర్. బ్రెండన్ ఫ్రేజర్ ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన పాత `మమ్మీ` సినిమాల తరహాలో ఇది యాక్షన్ అడ్వెంచర్ కాదు. ఇది పక్కా సూపర్ నేచురల్ హర్రర్ చిత్రం. లీ క్రోనిన్ ఈ కథను పురాతన ఈజిప్ట్ నుండి నేటి ఆధునిక కాలానికి మార్చారు.

టీజర్ హైలైట్స్ ప‌రిశీలిస్తే... టీజర్ చాలా డార్క్ థీమ్‌లో అప్పుడ‌ప్పుడు మెరుపుల‌తో భయంకరమైన వాతావర‌ణాన్ని ఆవిష్క‌రించింది. ఒక పురాతన శవపేటికను (సార్కోఫాగ‌స్) అనుకోకుండా ఒక నగర నిర్మాణం జరుగుతున్న చోట కనుగొన్న త‌ర్వాత అస‌లు కథ మొదలవుతుంది. మమ్మీ లుక్ మునుపటి సినిమాల్లో లాగా కేవలం తెల్లటి కట్టులతో కాకుండా, ఈసారి మమ్మీ రూపం చాలా భయంకరంగా, వాస్తవికతకు దగ్గరగా ఉంది. టీజర్‌లో వినిపించే మంత్రాలు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. హర్రర్ ని రీబూట్ చేయ‌డంలో సౌండ్ ప్ర‌భావాన్ని, విజువ‌లైజేష‌న్ ప్ర‌భావాన్ని ద‌ర్శ‌కుడు క్రోనిన్ ఒక రేంజులో ఉప‌యోగించుకున్నాడని టీజ‌ర్ చెబుతోంది. గుండె జ‌బ్బు ఉన్న‌వాళ్లు క‌చ్ఛితంగా చూడ‌కూడ‌ని సినిమా ఇది.

ఈ చిత్రంలో కొత్త నటీనటులను పరిచయం చేస్తున్నారు. లీ క్రోనిన్ ఎప్పుడూ స్టార్ పవర్ కంటే కథపైనే ఎక్కువ నమ్మకం ఉంచుతారు. వార్నర్ బ్రదర్స్ - యూనివర్సల్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి. ద మ‌మ్మీ టీజర్‌ను జనవరి 2026లో విడుదల చేశారు. సినిమా 2026 దసరా లేదా హలోవీన్ కానుకగా థియేటర్లలోకి రాబోతోంది.

లీ క్రోనిన్ ప్రత్యేకత గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అత‌డి సినిమాల్లో వాడే ప్రాక్టికల్ ఎఫెక్ట్స్, విజువల్స్ చాలా సహజంగా ఉంటాయి. `ఈవిల్ డెడ్ రైజ్`లో ప్రేక్ష‌కులు చూసిన రక్తపాతం, హర్రర్ ఎలిమెంట్స్ ఈ `మమ్మీ`లో అంతకు మించి ఉంటాయని టాక్. యూనివర్సల్ మూవీస్ నుంచి `డార్క్ యూనివర్స్`కు ఈ సినిమా ఒక కొత్త జీవం పోస్తుందని భావిస్తున్నారు. పాత మమ్మీ సినిమాల్లోని కామెడీ దీనిలో ఉండు. ఇది కేవలం భయపెట్టడానికే తీసిన సినిమా. హార‌ర్ సినిమాల‌ను అభిమానించే వారికోసం ఇది చాలా ప్ర‌త్యేక‌మైన సినిమా అని టీజ‌ర్ చెబుతోంది.