ది కేరళ స్టోరీ 2 చుట్టూ పొలిటికల్ హై డ్రామా?
ఇదిలా ఉంటే ఈ మూవీని ఈ నెల 27న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. అయితే రంజాన్ మాసంలో సినిమా రిలీజ్ అవుతుండటంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
By: Ravindar Gorantla | 24 Feb 2026 2:00 PM IST2023లో విడుదలై సంచలనం సృష్టించిన మూవీ `ది కేరళ స్టోరీ`. వివాదాలు, వ్యతిరేకతలు, నిషేధాల మధ్య విడుదలై దేశ వ్యాప్తంగా సరికొత్త చర్చకు తెరలేపింది. లవ్ జీహాద్ ముసుగులో హిందూ యువతుల్ని అరబ్ కంట్రీస్‌కు తరలిస్తూ తీవ్రవాదులు చేస్తున్న అరాచకాలని ఈ సినిమాతో ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే దీనిపై కేరళ సీఎంతో పాటు పలువురు సెక్యులర్ వాదులు, కాంగ్రెస్ నాయకులు సంచలన ఆరోపణలు చేయడమే కాకుండా సినిమాని దేశ వ్యాప్తంగా బ్యాన్ చేయాలని పిలుపునిచ్చారు.
ఆ అడ్డంకుల్ని అధిగమించి `ది కేరళ స్టోరీ` ప్రేక్షకుల ముందుకొచ్చింది. విమర్శలు, వివాదాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో రూ.300 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా `ది కేరళ స్టోరీ 2`ని రూపొందించారు. కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలోని కీలక పాత్రల్లో ఉల్కా గుప్త, అదితి భాటియా, ఐశ్వర్య ఓఝా నటించారు. దీనిపై కూడా అదే తరహా వివాదాలు, వ్యతిరేకతలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే కేరళలో ఈ మూవీని రిలీజ్ కాకుండా బ్యాన్ చేయాలని కేరళ సీఎం పినరయి విజయన్ పిలుపునిచ్చారు.
అంతే కాకుండా పలువురు సెక్యులర్ వాదులు కూడా ఈ సినిమాపై విమర్శలకు దిగుతున్నారు. ఇటీవల నటుడు ప్రకాష్ రాజ్ ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విమర్శలు చేయడంతో దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ ఓ తెలివితక్కువ వ్యక్తి అని ఫైర్ అయ్యారు. అంతే కాకుండా దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్‌పై కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాలోని ముస్లిమ్ ర్యారెక్టర్‌ని చూపించిన తీరు, బలవంతంగా ఓ యువతికి బీఫ్ తినిపించడం వంటి సన్నివేశాలపై అనురాగ్ కశ్యప్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ మేకర్స్‌పై కామెంట్‌లు చేయడం తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈ మూవీని ఈ నెల 27న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. అయితే రంజాన్ మాసంలో సినిమా రిలీజ్ అవుతుండటంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇలాంటి టైమ్‌లో `ది కేరళ స్టోరీ 2`ని రిలీజ్ చేయడం వివాదాలకు తెరతీస్తుందని, రిలీజ్ డేట్‌ని మార్చుకోవాలని కొన్ని పోలిటికల్ పార్టీలు టీమ్‌పై వొత్తిడి తెస్తున్నాయి. అయితే మేకర్స్ మాత్రం ఈ విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే బుక్ మై షోలో ఈ మూవీపై భారీ స్థాయిలో ప్రేక్షకులు ఆసక్తిని కనబరుస్తున్నారు.
2023లో ఆదాశర్మ ప్రధాన పాత్రలో నటించగా, సుదీప్తో సేన్ రూపొందించిన `ది కేరళ స్టోరీ` అనేక వివాదాలు, బ్యాన్‌ల మధ్య విడుదలై దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా భారీ వసూళ్లని రాబట్టి అందరిని షాక్‌కు గురి చేసింది. ఈ నేపథ్యంలో దానికి సీక్వెల్‌గా వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు ఈ మూవీపై అత్యంత ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రేక్షకుల ఉత్సాహం చూస్తుంటే ఈ మూవీ కూడా `ది కేరళ స్టోరీ` తరహాలోనే సంచలనం సృష్టించడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే రీసెంట్‌గా కేరళకు చెందిన జియాలజిస్ట్ శ్రీదేవ్ ఈ సినిమా కేరళని భిన్నంగా ప్రజెంట్ చేస్తోందంటూ కేరళ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, సెన్సార్ బోర్డుతో పాటు ఈ చిత్ర నిర్మాతకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 27న సినిమా రిలీజ్ అవుతుందా? అన్నది వేచి చూడాల్సిందే.
