Begin typing your search above and press return to search.

ప్రతి క్రైమ్ దూరం నుంచి చూస్తే కామెడీనే: తరుణ్ భాస్కర్

ఈ చిత్రం ట్రైలర్ ఇటివలే విడుదలై ఆక‌ట్టుకుంది. కీడా కోలా నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో దర్శకుడు తరుణ్ భాస్కర్ విలేకరుల సమావేశంలో ముచ్చ‌టించారు.

By:  Tupaki Desk   |   31 Oct 2023 4:10 PM GMT
ప్రతి క్రైమ్ దూరం నుంచి చూస్తే కామెడీనే: తరుణ్ భాస్కర్
X

పెళ్లి చూపులు-ఈ నగరానికి ఏమైంది లాంటి చిత్రాల‌తో ప్రశంసలు అందుకున్న ప్ర‌తిభావంతుడైన‌ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడో చిత్రంగా క్రైమ్ కామెడీ మూవీ 'కీడా కోలా'తో వస్తున్నారు. విజి సైన్మా బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నిర్మిస్తున్నారు. హీరో రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ఇటివలే విడుదలై ఆక‌ట్టుకుంది. కీడా కోలా నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో దర్శకుడు తరుణ్ భాస్కర్ విలేకరుల సమావేశంలో ముచ్చ‌టించారు.


ఆ ఐడియా అలా పుట్టింది:

లాక్ డౌన్ స‌మ‌యంలో చాలా మంది రకరకాలుగా డబ్బులు సంపాదిస్తున్నారని తెలిసి నాకు చాలా కామెడీ గా అనిపించింది. ''రోడ్ పై మ్యాన్ హోల్ కవర్ లేదు. ఎవడో ఇనపసామాన్లు వాడికి అమ్మేసాడట'. వాడిని సినిమాల్లోకి ఎక్కించాలనిపించింది (నవ్వుతూ). ఇంకా సంపాయించడానికి మార్గాలు ఏమున్నాయని అడిగితే.. ''తినే పదార్ధాలలో పురుగు పడిందని కేసు వేసి'' కూడా సంపాదించవచ్చని ఫ్రెండ్స్ చెప్పారు. ఇలా చాలా ఆసక్తికరమైన చర్చ నడిచింది. అయితే ఇదంతా క్రైమ్. కానీ దూరం నుంచి చూస్తే కామెడీ. ప్రతి క్రైమ్ దూరం నుంచి చూస్తే కామెడీనే. ఇది నా ఫేవరేట్ జోనర్ కూడా. అక్కడ నుంచి కీడా కోలా ఆలోచన వ‌చ్చింది. చిన్నప్పటినుంచి నా ఫేవరేట్ జోనర్ ఇది. నా ఆల్ టైం ఫేవరేట్ మనీమనీ. అందులో బ్రహ్మానందం గారి పాత్ర చాలా ఇష్టం. అలాగే జిగర్తండా, సూదుకవ్వం చిత్రాలు కూడా చాలా ఇష్టం. రొమాంటిక్ కామెడీలు నాకు బోరింగ్ సబ్జెక్ట్. నాతో పాటు నా ఫ్రెండ్స్ కి కూడా క్రైమ్ కామెడీలే ఇష్టం. ఇప్పుడీ సినిమాతో క్రైమ్ కామెడీ కల నిజమైయింది.

తొలి సినిమాకే జాతీయ అవార్డ్ బాధ్య‌త‌:

'బాధ్యత' లాంటి మాటలు విన్నప్పుడే చాలా బరువుగా వుంటుంది. నేషనల్ అవార్డ్ వచ్చిన తర్వాత కొంచెం బరువైయింది. (నవ్వుతూ) ఆ బరువుని పక్కన పెడదామని 'ఈ నగరానికి ఏమయింది' చేశాం. ఈ సినిమా ఇంకా బరువుని పెంచింది. ( నవ్వుతూ)

బ్రహ్మీ గిఫ్ట్ బావుంది:

బ్ర‌హ్మానందం గారికి పెయింటింగ్ గీసి ఇవ్వాల‌నిపించింది. కానీ మూతి కొంచెం వంకరగా వచ్చింది. వంకరగా తిప్పి పెయిటింగ్ చూపించా. ఆయన వంకరగా చూశారు. ఎలా వుందని అడిగాను. 'నా మొహంలా వుంది'అని చెప్పారు. ఆయన తిట్టారా ? పొగిడారా ? ఈ రోజు వరకూ అర్ధం కాలేదు. (నవ్వుతూ) ఆయన అద్భుతమైన పెయింటర్. నాకు హనుమాన్ పెయిటింగ్ ని బహుమతిగా ఇచ్చారు.

వాస్త‌వంగా ఉంటాయి:

నా గత రెండు సినిమాలతో పోల్చుకుంటే ఈ చిత్రంలో సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాను. పెళ్లి చూపుల్లో ప్రతిది లాజికల్ గా వుంటుంది. కీడాకోలా లో గన్స్ షాట్స్, బ్లాస్ట్స్ ఇలా చాలా వరకూ సినిమాటిక్ లిబర్టీ వుంటుంది. కొంత ఫిక్ష‌న‌ల్. కీడా కోలా నటీనటుల ఎంపిక గురించి చెప్పాలంటే..ఇందులో అందరు నటీనటులని ఆడిషన్స్ చేసి తీసుకున్నామని గర్వంగా చెప్పగలం. జీవన్, విష్ణు.. ఇలా అందరిని ఆడియన్స్ చేసే ఎంపిక చేశాం. ఇక ఇందులో నటించిన బ్రహ్మానందం గారు, రఘుగారు నాకు ఆదర్శమైన నటులు. రఘుగారు రోడీస్ లో బ్యాడ్యాస్ క్యారెక్టర్ వుంటుంది. అదే ఇందులో చేయాలి కాబట్టి నేచురల్ వచ్చింది. అలాగే బ్రహ్మానందంగారి గారి పాత్రకు మా తాతయ్య స్ఫూర్తి. మా తాతయ్య నాకు మంచి ఫ్రెండ్. ఆయనది చాలా ఫన్ క్యారెక్టర్. ఆ పాత్రకు బ్రహ్మనందం గారైతే బావుంటుదనిపించింది. ఆయన అద్భుతంగా చేశారు. అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.

పైసా వసూల్ మూవీ:

కీడా కోలా విషయంలోచాలా నమ్మకంగా వున్నాం. ముంబైలో ప్రివ్యూ చూసినప్పుడు అందరూ ఎంజాయ్ చేశారు. సినిమా చూస్తున్నంతసేపు హాయిగా నవ్వుకున్నారు. యూనిక్ రైటింగ్, మేకింగ్ తో నవ్విస్తున్నాం. ఖచ్చితంగా ప్రేక్షకులు పైసా వసూల్ అని ఫీలౌతారనే నమ్మకం వుంది. ఇందులో వాస్తు పాత్రకు టూరెట్ సిండ్రోమ్ దాని ద్వారా ఒక‌టి చెప్ప‌ద‌లిచాను. ఏదైనా వైకల్యం వుంటే దాని గురించి ప్రొటెక్ట్ చేస్తూ మాట్లాడటం కాదు.. వారికి సాధికారత ఇచ్చే విధంగా ఉండాలనేది నా ఆలోచన. ఇందులో అంతర్లీనంగా ఆ సందేశం వుంటుంది. ఇందులో నాయుడు పాత్ర రాసినప్పుడు నాలో వుండే భారం తగ్గిపోయినట్లు అనిపించింది. అది నేను అనుభవించాను. నాయడు పాత్రలో నాకు నేను కనిపించాను.

ఆ బొమ్మ‌కు స్ఫూర్తి:

ట్రైలర్ లో చైనా బొమ్మ నేప‌థ్యం ఏంటి అంటే.. నాకు తెలిసిన ఒక మెడికల్ రిప్రజెంటర్ వున్నారు. ఆయన ఒక సిమ్యులేటర్ ని కార్ లో పెట్టుకొని పెళ్లి సంబంధానికి వెళ్ళారు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు కార్ ని ఆపి ఆ సిమ్యులేటర్ ఏమిటని ప్రశ్నించారు. దీంతో రోడ్ మీదే దాని పనితీరు చూపించాల్సి వచ్చింది. అది చూసి పెళ్లి వాళ్ళు మ్యాచ్ క్యాన్సిల్ చేసుకున్నారు. అది చాలా ఆసక్తికరమైన సంఘటన అనిపించింది. దానిని స్ఫూర్తిగా తీసుకుని చైనా బొమ్మ సీన్ తీసాం.

పాత్రలు అలా పుట్టాలి:

జీవితాన్ని ప్రతి కోణం నుంచి చూడాలని రైటింగ్ నేర్పించింది. ప్రతి పాత్రలోకి వెళ్లి అలోచించడం అవసరం. ప్రతి పాత్రలో లోతుగా అలోచించినపుడు ఒక హ్యుమానిటీ వుంటుంది. సినిమా, జీవితం.. ఈ రెండిట్లో ఒక సానుభూతితో వుంటే లైఫ్ ఇంకా మెరుగ్గా వుంటుంది. సినిమాలో చూపించిన పాత్రలతో మనుషులు మారుతారని నా నమ్మకం. ఇందులో మొత్తం ఎనిమిది పాత్రలు వున్నాయి. అందులో హీరో ఎవరనేది నేను మా రైటింగ్ టీం బెట్ వేసుకున్నాం. ఆడియన్స్ ఎవరిని హీరో అంటారో అని. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గేమ్.( నవ్వుతూ)

2గం.ట‌ల నిడివి:

క‌థ‌ రాసుకున్నపుడు, తీసినప్పుడు కూడా రెండు గంటల ఇరవై నిముషాలు వచ్చింది. పదిహేను నిముషాలు ట్రిమ్ చేశాను. క్రైమ్ కామెడీ నేచర్ క్రిస్ప్ గా వుంటే నెరేటివ్ పరిగెడుతూనే వుంటుంది. కీడాకోలా కూడా ఫాస్ట్ పేస్డ్ అండ్ యూనిక్ గా వుంటుంది.

వెంకీతో మూవీ చేస్తాం:

విక్ట‌రీ వెంక‌టేష్ తో సినిమా వుంటుంది. సురేష్ బాబు గారు ప్రొసీడ్ అవ్వమన్నారు. అయితే కథ కోసం మరింత సమయం తీసుకున్నాను. ఇప్పుడు సిద్ధంగా వున్నాను. అలాగే ఒక వెబ్ సిరిస్ కి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.