Begin typing your search above and press return to search.

తండేల్.. ఇప్పుడే ఈ రేంజ్ లో ఉందంటే..

అక్కినేని హీరో నాగ చైతన్య మత్స్యకారుడి పాత్ర పోషిస్తుండడం, యథార్థ ఘటన ఆధారంగా తెరకెక్కుతుండటంతో ఈ మూవీపై ఫుల్ క్రేజ్ ఏర్పడింది.

By:  Tupaki Desk   |   6 Jan 2024 1:28 PM GMT
తండేల్.. ఇప్పుడే ఈ రేంజ్ లో ఉందంటే..
X

సినీప్రియులు ఎంతగానో ఎదురుచూసిన తండేల్ మూవీ గ్లింప్స్ రిలీజై ఆకట్టుకుంటోంది. అక్కినేని హీరో నాగ చైతన్య మత్స్యకారుడి పాత్ర పోషిస్తుండడం, యథార్థ ఘటన ఆధారంగా తెరకెక్కుతుండటంతో ఈ మూవీపై ఫుల్ క్రేజ్ ఏర్పడింది. అయితే తండేల్ గ్లింప్స్ విడుదలైన తర్వాత సాయి పల్లవి అభిమానులు మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

స్టార్ హీరోయిన్ సాయి పల్లవికి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమెను లేడీ పవర్ స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుస్తుంటారు. ఆమె అందం, నటన, సహజత్వాన్ని ఫ్యాన్స్ ఎంతగానో ఇష్టపడతారు. అందుకే ఆమె మూవీలో ఉంటే సినిమాలో కచ్చితంగా విషయం ఉంటుందని నమ్ముతారు. తెలుగులో చివరగా 2022లో విరాట్ పర్వం సినిమా చేసిన సాయి పల్లవి.. మళ్లీ రెండేళ్ల తర్వాత తండేల్ మూవీ చేస్తోంది. తండేల్ గ్లింప్స్‌ చివర్లో 15 సెకన్ల పాటు సాయిపల్లవి కనిపించింది. ఆమె నవ్వు, స్క్రీన్ ప్రెజన్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి.

చాలా రోజుల తర్వాత దేవత దర్శనం అయిందని సాయిపల్లవిని ఉద్దేశిస్తూ ఆమె ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. తండేల్ గ్లింప్స్‌ లో సాయిపల్లవి ఉన్న సీన్‍ వీడియోను షేర్ చేస్తూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆ చిన్న సీన్ లో సాయిపల్లవి నవ్వుపై మరోసారి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏం స్మైల్ రా బాబు.. మైండ్‍ లో నుంచి పోవడం లేదని కామెంట్లు పెడుతున్నారు.

బీచ్ ఒడ్డున సూర్యోదయం సమయంలో సాయి పల్లవి వేచిచూస్తున్నట్టుగా ఈ గ్లింప్స్‌ లో ఉంది. "బుజ్జితల్లి వచ్చేస్తున్నా కదే.. కొంచెం నవ్వే" అంటూ నాగచైతన్య వాయిస్ ఓవర్ ఉంది. ఆ తర్వాత సాయిపల్లవి స్మైల్ ఉంది. ఈ గ్లింప్స్‌ లో దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్‍ గ్రౌండ్ మ్యూజిక్‍ అదిరిపోయింది.

పాకిస్థాన్ జైలులో సుమారు 13 నెలల పాటు చాలా కష్టాలను అనుభవించి స్వదేశానికి తిరిగి వచ్చిన 22 మంది శ్రీకాకుళం, విజయనగరం మత్య్సకారుల యథార్థ ఘటన ఆధారంగా తండేల్ రూపొందుతోంది. మత్య్సకారుడు రాజుగా ఈ చిత్రంలో నాగచైతన్య నటిస్తున్నారు. రాజు ప్రేమికురాలిగా సాయిపల్లవి నటిస్తున్నారు. చందూ మొండేటి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. గీతాఆర్ట్ పతాకంపై బన్నీ వాస్ భారీ బడ్జెట్‍తో నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. దేశభక్తి, ప్రేమకథతో ఉండనున్న తండేల్ మాత్రం నాగచైతన్య కెరీర్ లో మైలురాయిగా నిలిచేలా కనిపిస్తోంది.