ఐకాన్, ఎల్లమ్మ భవిష్యత్తు తేల్చే 'తమ్ముడు'
ముఖ్యంగా దర్శకుడు వేణు శ్రీరామ్ మాట్లాడుతూ నితిన్ ఇప్పటి వరకు చేసిన పాత్రలతో పోల్చితే ఈ సినిమాలోని పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని అన్నాడు.
By: Tupaki Desk | 1 July 2025 7:00 PM ISTనితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన 'తమ్ముడు' సినిమా ఈనెల 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. నితిన్ గత చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవుతూ వచ్చాయి. నితిన్‌కి హిట్ దక్కి చాలా కాలం అయింది. ఆయన ఈ సినిమాతో విజయాన్ని సొంతం చేసుకుంటాను అనే నమ్మకంతో కనిపిస్తున్నాడు. అంతే కాకుండా ఈ సినిమా తర్వాత అదే బ్యానర్‌లో నితిన్ ఎల్లమ్మ సినిమాను చేయబోతున్నాడు. తమ్ముడు మంచి విజయాన్ని సొంతం చేసుకుంటేనే ఎల్లమ్మ సినిమాపై పూర్తి నమ్మకంతో వెళ్లే అవకాశం ఉంటుంది. నితిన్ హీరోగా మరికొన్నాళ్లు నిలబడాలన్నా ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
తమ్ముడు సినిమాలో నితిన్ కొత్తగా కనిపిస్తాడని మేకర్స్ చెబుతున్నారు. ముఖ్యంగా దర్శకుడు వేణు శ్రీరామ్ మాట్లాడుతూ నితిన్ ఇప్పటి వరకు చేసిన పాత్రలతో పోల్చితే ఈ సినిమాలోని పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని అన్నాడు. నితిన్‌లోని అన్ని రకాల ఎమోషన్స్‌ను తమ్ముడు చూపించే అవకాశాలు ఉన్నాయి. నితిన్ ఈ సినిమాపై చాలా నమ్మకం పెట్టుకుని తన పారితోషికంను సైతం త్యాగం చేశాడని సమాచారం అందుతోంది. అందుకే ఈ సినిమా నితిన్‌కు అత్యంత కీలకం అనడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్ సైతం తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. వకీల్ సాబ్ సినిమాను హిట్ చేసుకున్నా తదుపరి సినిమాకు ఇన్నాళ్ల సమయం పట్టింది.
వకీల్ సాబ్ పూర్తి అయిన వెంటనే ఐకాన్ అనే టైటిల్‌తో అల్లు అర్జున్‌తో సినిమాను చేయాలని భావించాడు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా పట్టాలెక్కలేదు. అల్లు అర్జున్ కి ఐకాన్ స్క్రిప్ట్ నచ్చినా కొన్ని కారణాలు చెబుతూ పక్కకు పెట్టాడనే వార్తలు వచ్చాయి. తమ్ముడు సినిమాతో వేణు శ్రీరామ్ దర్శకుడిగా నిరూపించుకుంటే కచ్చితంగా ఐకాన్ సినిమా వెంటనే పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. అల్లు అర్జున్ కాకున్నా వెంటనే మరో హీరో ఐకాన్ స్క్రిప్ట్‌కు ఓకే చెప్పడం, డేట్లు కూడా ఇవ్వడం జరుగుతుందని విశ్లేషకుల అంచనా. దిల్ రాజు సైతం ఐకాన్ సినిమాను వెంటనే నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
మొత్తానికి నితిన్, వేణు ఎల్దండి కాంబోలో రాబోతున్న 'ఎల్లమ్మ' సినిమా వెంటనే పట్టాలెక్కాలన్నా, దిల్ రాజు భయం లేకుండా బడ్జెట్ పెట్టాలన్నా ఖచ్చితంగా తమ్ముడు సినిమా హిట్ కావాల్సిందే. తమ్ముడుకు మినిమం పాజిటివ్ టాక్ వచ్చినా వెంటనే ఎల్లమ్మను పట్టాలెక్కించేందుకు వేణు రెడీ అవుతున్నాడు. దిల్ రాజు సైతం భయం లేకుండా బడ్జెట్ ను పెట్టేందుకు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి. అందుకే నితిన్‌కు తమ్ముడు హిట్ చాలా కీలకం. ఇక తదుపరి సినిమాగా ఐకాన్‌ను చేయాలి అంటే వేణు శ్రీరామ్‌కు తమ్ముడు సినిమా హిట్ పడాల్సిందే. తమ్ముడు సినిమా ఫలితం తారుమారు అయ్యే ఛాన్స్ లేదని మేకర్స్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అదే నిజం అయితే వెంటనే ఐకాన్, ఎల్లమ్మ సినిమాలు ఇదే ఏడాదిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
