Begin typing your search above and press return to search.

వీడియో : ఎంత స్టార్‌ హీరో సెక్యూరిటీ అయితే మాత్రం ఇలా గన్‌ తో బెదిరిస్తారా?

స్టార్‌ హీరోలు సింపుల్‌గా, ఫ్యాన్స్‌ని కలిసి వారితో ఫోటోలు దిగేందుకు ఎప్పుడూ రెడీగా ఉంటారు.

By:  Tupaki Desk   |   6 May 2025 9:55 AM
వీడియో : ఎంత స్టార్‌ హీరో సెక్యూరిటీ అయితే మాత్రం ఇలా గన్‌ తో బెదిరిస్తారా?
X

స్టార్‌ హీరోలు సింపుల్‌గా, ఫ్యాన్స్‌ని కలిసి వారితో ఫోటోలు దిగేందుకు ఎప్పుడూ రెడీగా ఉంటారు. కానీ వారి వెంట ఉండే బాడీ గార్డ్స్ అతి చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సెలబ్రెటీల బౌన్సర్స్‌ తీరు వివాదాస్పదం అవుతోంది. సెలబ్రిటీల సెక్యూరిటీ పేరుతో సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం తెల్సిందే. ఆ మధ్య ఒక తెలుగు హీరో సెక్యూరిటీ గార్డ్స్‌, బౌన్సర్స్‌ తీరు కారణంగా నిండు ప్రాణం పోయింది. హీరోయిన్స్‌తో మాల్స్ ఓపెనింగ్‌కు వెళ్లే బౌన్సర్స్‌ కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ సామాన్యులకు ఇబ్బంది కలిగించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి వ్యవహారాలు ఎక్కువగా జరుగుతున్న విషయం తెల్సిందే.

తాజాగా తమిళనాడులో ఈ ఘటన జరిగింది. తమిళ్ సూపర్‌ స్టార్‌ విజయ్ మధురై విమానాశ్రయంలో కనిపించారు. దాంతో అభిమానులు ఒక్కసారిగా ఆయన్ను కలిసేందుకు, ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారు. అలాంటి సమయంలో సెక్యూరిటీ వారు, కాస్త సౌమ్యంగా, జనాల పట్ల స్మూత్‌గా వ్యవహరించాలి. కానీ బాడీ గార్డ్స్ మాత్రం అతి చేశారు. పోలీసు వారు అక్కడ ఉండగానే ఒక అభిమాని విజయ్ వైపు వస్తూ ఉండగా బాడీగార్డ్‌ ఒకరు ఏకంగా పిస్టల్‌ తీసి అభిమాని తలకు గురి పెట్టడం వివాదాస్పదం అయింది. ఎంత స్టార్‌ హీరో సెక్యూరిటీ అయితే మాత్రం ఇలా గన్‌ తో బెదిరిస్తారా అంటూ ఈ వీడియోను చాలా మంది సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.

విజయ్ ఎక్కడకు వెళ్లినా జనాలు పెద్ద ఎత్తున వెళ్లడం మనం చూస్తూనే ఉంటాం. ఆయన సెక్యూరిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే జనాల మీదకు గన్ పెట్టి మరీ బెదిరించడం అనేది సరైన పద్దతి కాదు అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు విజయ్ వద్దకు ఎవరూ రాకుండా దూరం నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. పబ్లిక్ ప్లేస్‌లో అలాంటి వారు రావడం చాలా కామన్‌గా జరుగుతుంది. అలాంటి వారి దృష్టిలో పడవద్దు అంటే హీరో గారు కాస్త ఫేస్ కవర్‌ చేసుకుంటే బాగుంటుంది కదా అని కొందరు అంటున్నారు. మొత్తానికి విజయ్‌ బాడీ గార్డ్‌ చేసిన పని తీవ్రమైన విమర్శలను ఎదుర్కోవడం జరుగుతుంది.

ఇక విజయ్‌ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన చేస్తున్న చివరి సినిమా జన నాయగన్‌ షూటింగ్‌ కోసమే మధురై వెళ్లాడని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఒక వైపు రాజకీయ నాయకుడిగా బిజీగా ఉంటూనే మరో వైపు కమిట్‌ అయిన సినిమాను పూర్తి చేయడం కోసం డేట్లు కేటాయిస్తూ వచ్చాడు. వచ్చే ఏడాదిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. వచ్చే ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ గెలిచి సీఎం కావాలని అనుకుంటున్నాడు. అలాంటి వ్యక్తి సామాన్యులకు చేరువగా ఉండాలి. అలాంటిది అభిమానులు దగ్గరకు వస్తే ఇలా గన్‌ పెట్టి బెదిరిస్తే రాజకీయాల్లో కష్టమే అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.