Begin typing your search above and press return to search.

స‌స్పెన్స్ డ్రామాగా మారిన త‌లైవ‌ర్173

అసలు ఈ సినిమా ఫైనల్‌గా ఎవరి చేతిలోకి వెళ్తుంది? అనే ప్రశ్నకు ఇప్పటికీ క్లారిటీ లేకపోవడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   13 April 2026 10:00 PM IST
స‌స్పెన్స్ డ్రామాగా మారిన త‌లైవ‌ర్173
X

తమిళ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ ర‌జినీకాంత్ సినిమాల చుట్టూ ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగానే కాకుండా కొంత గందరగోళాన్ని కూడా సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా తలైవర్ 173 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కబోయే ప్రాజెక్ట్‌పై దర్శకుల మార్పులు వరుసగా చోటుచేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఈ సినిమా ఫైనల్‌గా ఎవరి చేతిలోకి వెళ్తుంది? అనే ప్రశ్నకు ఇప్పటికీ క్లారిటీ లేకపోవడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ప్రారంభంలో ఈ ప్రాజెక్ట్‌కు సుంద‌ర్ సి పేరు ఖరారైనట్టే అనిపించింది. కానీ అనూహ్యంగా ఆయన తప్పుకోవడంతో, ఆ తర్వాత సిబి చ‌క్ర‌వ‌ర్తి లైన్‌లోకి వచ్చారు. డాన్ వంటి స‌క్సెస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయనపై ఆశలు పెరిగినప్పటికీ, తాజాగా ఆయన కూడా ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్లినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు అశ్వ‌త్ మ‌రిముత్తు పేరు బలంగా వినిపించడం విశేషం. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాకపోవడం మరింత స‌స్పెన్స్ ను పెంచుతోంది.

ఇది ఒక్క ప్రాజెక్ట్‌కే పరిమితం కాకుండా, ఇటీవల రజనీకాంత్ సినిమాల విషయంలో దర్శకుల మార్పులు ఒక ట్రెండ్‌లా మారాయి. లోకేష్ క‌న‌గ‌రాజ్ తో అనుకున్న ప్రాజెక్ట్ తర్వాత నెల్స‌న్ దిలీప్‌కుమార్ చేతికి వెళ్లడం, మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌లలోనూ మార్పులు చోటుచేసుకోవడం ప్లానింగ్ ఎగ్జిక్యూష‌న్ లో లోపంగా క‌నిపిస్తోంది. దీనికి ప్రధాన కారణంగా వినిపిస్తున్న అంశం.. రజినీకాంత్ స్క్రిప్ట్ సెలెక్షన్‌లో తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు. ఇటీవల ఆయ‌న్నుంచి వ‌చ్చిన సినిమాల ఫలితాల తర్వాత సూప‌ర్ స్టార్ మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. కథ నచ్చకపోతే ఎంత పెద్ద దర్శకుడైనా సారీ చెప్పి పంపిస్తున్నారన్న టాక్ ఉంది. ఈ క్రమంలోనే ప్రాజెక్ట్‌లు ఆలస్యం అవుతున్నాయనే విశ్లేషణలు కూడా ఉన్నాయి.

పాన్ ఇండియా స్థాయిలో భారీ సినిమాలు ప్లాన్ చేస్తున్నప్పటికీ, గ్రౌండ్ లెవెల్‌లో అమలు దశలో క్లారిటీ లోపిస్తున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారీ అంచనాలు, పెద్ద కాంబినేషన్లు ఉన్నప్పటికీ, ఫైనల్ అవుట్‌పుట్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఈ మార్పులు జరుగుతున్నాయనేది ఇండస్ట్రీలోని ఓ వర్గం అభిప్రాయం. ఇక రజనీకాంత్ వయసు దృష్ట్యా కూడా ఆయన తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఏడు పదుల వయసులోనూ తన సినిమాలపై పూర్తి నియంత్రణ ఉంచుతూ, ప్రతి అంశాన్ని పరిశీలిస్తూ ముందుకు వెళ్లడం ఆయన ప్రొఫెషనలిజాన్ని మరోసారి చాటుతోంది. ఇదే సమయంలో, ఫ్యాన్స్ మాత్రం స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. మొత్తానికి, తలైవర్ 173 ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక సస్పెన్స్ డ్రామాగా మారిపోయింది. చివరికి ఈ సినిమా ఎవరి దర్శకత్వంలో తెరకెక్కుతుందో చూడాలి. కానీ రజినీకాంత్ సినిమాల విషయంలో ఇకపై ఏ నిర్ణయమూ త్వరగా తీసుకోర‌నేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.