Begin typing your search above and press return to search.

ఇద్ద‌రు లెజెండ్స్ ట్విస్టులే ట్విస్టులు..డైరెక్ట‌ర్ ఫైన‌ల‌య్యేదెలా?

సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా, రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ నిర్మించ‌నున్న‌ ప్రతిష్టాత్మక చిత్రం `తలైవర్ 173` విష‌యంలో రోజుకో మ‌లుపు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది

By:  Sivaji Kontham   |   4 Jun 2026 1:00 AM IST
ఇద్ద‌రు లెజెండ్స్ ట్విస్టులే ట్విస్టులు..డైరెక్ట‌ర్ ఫైన‌ల‌య్యేదెలా?
X

సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా, రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ నిర్మించ‌నున్న‌ ప్రతిష్టాత్మక చిత్రం `తలైవర్ 173` విష‌యంలో రోజుకో మ‌లుపు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించే బాధ్యతను తొలుత సీనియర్ కమర్షియల్ దర్శకుడు సుందర్ సి కి అప్పగించారు. కానీ సుంద‌ర్ సి. ఆశించిన విధంగా ప‌ని చేయ‌లేక‌పోయాడు. ఆ తర్వాత `డాన్` చిత్ర దర్శకుడు శిబి చక్రవర్తి పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. అయితే వీరిద్దరూ రజనీకాంత్ ఇమేజ్‌కు సరిపోయేలా, వంద శాతం సంతృప్తికరమైన స్క్రిప్టులను అందించలేకపోయారనే వార్తలు కోలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. దాంతో ఈ ఇద్దరు దర్శకులను కాదని ఇప్పుడు మ‌రో ద‌ర్శ‌కుడు అశ్వత్ మారిముత్తు రంగంలోకి వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ, తాజాగా కమల్ హాసన్ ప్రొడక్షన్ హౌస్ అయిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (ఆర్.కే.ఎఫ్‌.ఐ) సోషల్ మీడియా వేదికగా దర్శకుడు అశ్వత్ మారిముత్తుకు ఒక స్టైలిష్ బర్త్‌డే వీడియోను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపింది. ఈ ప్రత్యేక వీడియో బయటకు రావడంతో `తలైవర్ 173` ప్రాజెక్ట్‌కు అశ్వత్ మారిముత్తు దర్శకుడిగా దాదాపు ఖరారైనట్లు అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. గతంలోనే అశ్వత్ రజనీకాంత్‌కు ఒక అద్భుతమైన కథను వినిపించగా దానికి సూపర్ స్టార్ ఎంతో ఇంప్రెస్ అయ్యారని.. ఇంటర్వెల్ బ్లాక్ విన్నాక భోజనం చేయడం కూడా మర్చిపోయి మరీ కథా విశ్లేషణను పూర్తిగా విన్నారని సమాచారం.

ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ అంతర్గతంగా మాత్రం ట్విస్టులు నడుస్తున్నాయి. అశ్వత్ మారిముత్తు చెప్పిన బేసిక్ లైన్ నిర్మాతగా ఉన్న కమల్ హాసన్‌ను పూర్తిగా సంతృప్తి పరిచినట్లు తెలుస్తోంది. అయితే రజనీకాంత్‌కు ఈ సరికొత్త స్క్రిప్ట్‌ను వంద శాతం పూర్తిగా నేరేట్ చేసి ఒప్పించాల్సి ఉంది. దీనికోసం కనీసం మరో రెండు నెలల సమయం పడుతుందని టాక్ వినిపిస్తోంది. రజనీకాంత్‌ను పూర్తి స్థాయిలో మెప్పించిన తర్వాతే అధికారికంగా ప్రకటించి సెట్స్‌పైకి వెళదామని అశ్వత్ మారిముత్తు స్వయంగా కమల్‌తో అన్నట్లు పరిశ్రమ వర్గాల గుసగుస.

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికర విష‌యం.. ఈ సినిమాలో కమల్ హాసన్ నటించరు. ఆయన కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తూ, రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. గతంలో వచ్చిన `విక్రమ్` సినిమా సాధించిన అసాధారణ లాభాలతో ఈ బ్యానర్ అప్పులన్నీ తీరిపోవడంతో.. కమల్ హాసన్ ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో రజనీకాంత్ డేట్లను పూర్తిగా లాక్ చేసుకున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కింద రజనీకాంత్‌తో సోలోగా సినిమా తీసిన తర్వాతే.. భవిష్యత్తులో మరొక దర్శకుడి ఆధ్వర్యంలో రజనీకాంత్ - కమల్ హాసన్ కాంబినేషన్ మల్టీస్టారర్ సినిమా ఉంటుంది. సుంద‌ర్ సి రాజ్ క‌మ‌ల్ బ్యాన‌ర్ లో సినిమా తీయ‌క‌పోయినా కానీ, శిబి చ‌క్ర‌వ‌ర్తికి మ‌రో ఆఫ‌ర్ ఉంద‌ని స‌మాచారం. ఈలోగానే అశ్వ‌త్ తో ర‌జ‌నీ సినిమాని క‌మ‌ల్ ప‌ట్టాలెక్కిస్తార‌ని భావించ‌వ‌చ్చు.