ఆరు క్లాసిక్ చిత్రాలకు సీక్వెల్స్ & కాంబినేషన్!
అలాగే 1995లో సంచలన విజయం సాధించి ఊర్మిళా మాతోండ్కర్‌ను దేశవ్యాప్తంగా స్టార్‌గా మార్చిన మ్యూజికల్ హిట్ `రంగీలా` సీక్వెల్ కూడా లైన్లోకి వచ్చింది.
By: Srikanth Kontham | 11 Jun 2026 11:22 AM ISTఒకప్పుడు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాలు.. ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కొన్ని అద్భుతమైన చిత్రాలు ఇప్పుడు సరికొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇన్నోవేషన్ లండన్ టెక్ వీక్ వేదికగా ఓ భారీ ప్రకటన చేసింది. తమ సంస్థకు చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన ఆరు క్లాసిక్ చిత్రాలకు సీక్వెల్స్‌ను నిర్మిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ జాబితాలో బాలీవుడ్ ఐకానిక్ చిత్రాలైన `తేరే నామ్`, `రంగీలా` , `తను వెడ్స్ మను`, `ఇంగ్లీష్ వింగ్లీష్`, `దేశీ బాయ్స్`, `ఫోబియా` వంటి సినిమాలున్నాయి. ఈ ప్రకటనతో ఒక్కసారిగా సినీ ప్రియుల్లో ఉత్సాహం నెలకొంది.
ఈ భారీ ప్రాజెక్టులలో ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం ఏమిటంటే? పాత చిత్రాలలోని ప్రధాన పాత్రధారులు మళ్లీ కనిపిస్తారా ? లేదా అనేదే. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్‌గా నిలిచిన `తేరే నామ్` (2003) చిత్రానికి ఇప్పుడు ఆధ్యాత్మిక సీక్వెల్ రాబోతోంది. అయితే ఈ కొత్త కథలో సల్మాన్ ఖాన్ `రాధే` పాత్రలో కనిపించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని సమాచారం. సరికొత్త కథాంశం.. పాత్రలతో ఈ ప్రాంచైజీని ముందుకు తీసుకెళ్లేందుకు నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
అలాగే 1995లో సంచలన విజయం సాధించి ఊర్మిళా మాతోండ్కర్‌ను దేశవ్యాప్తంగా స్టార్‌గా మార్చిన మ్యూజికల్ హిట్ `రంగీలా` సీక్వెల్ కూడా లైన్లోకి వచ్చింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ పాత చిత్రంలో అమీర్ఖాన్, ఊర్మిళా మాతోండ్కర్ నటించారు. కానీ సరికొత్త సీక్వెల్‌లో ఇద్దరు స్టార్స్ భాగం కాకపోవచ్చని తెలుస్తోంది. పాత తరం జ్ఞాపకాలను అలాగే ఉంచుతూ ప్రస్తుత తరం ప్రేక్షకులను ఆకట్టుకునేలా కొత్త నటీనటులతో ఈ కథను సరికొత్త కోణంలో ఆవిష్కరించనున్నారు.
ఈ సీక్వెల్స్ అన్నింటిలోనూ అత్యంత వేగంగా పట్టాలెక్కడానికి సిద్ధంగా ఉన్న చిత్రం `తను వెడ్స్ మను - ది నెక్స్ట్ చాప్టర్`. ఇప్పటికే రెండు భాగాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సిరీస్‌కు ఇది మూడవ భాగం. ఈ క్రేజీ ప్రాజెక్టును `హీరామండి`, `ది ఎంపైర్` వంటి సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకురాలు మితాక్షర కుమార్ తెరకెక్కించనున్నారు. రుద్రాక్ష్ సోమ జ్యోతి లిమిటెడ్‌తో కలిసి ఈరోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ సినిమా షూటింగ్ 2026 లోనే ప్రారంభం కానుందని సమాచారం. అయితే గత భాగాలలో నటించిన కంగనా రనౌత్, ఆర్. మాధవన్ ఈ చిత్రంలో ఉంటారా? లేదా? అనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.
వెండితెర సినిమాలకే పరిమితం కాకుండా ఈ ఆరు టైటిళ్లను సరికొత్త మీడియా ఫార్మాట్లలోకి విస్తరించాలని ఈరోస్ సంస్థ భావిస్తోంది. వీటిని యానిమేషన్, మైక్రో డ్రామాలు , క్యారెక్టర్ ఆధారిత కంటెంట్‌గా మలచి వినోదాన్ని పంచనున్నారు. దీంతో పాటు ఈరోస్ సంస్థ `ఈరోస్ బ్రహ్మాండ్` అనే పేరుతో భారతీయ పురాణాలు, జానపద కథల ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో కూడిన 9 ఒరిజినల్ చిత్రాల ఒక సినిమాటిక్ యూనివర్స్‌ను కూడా ప్రకటించింది. అలాగే `ఈరోస్ రీమాస్టర్డ్` కింద రజనీకాంత్ నటించిన `కొచ్చాడయాన్` వంటి పాత చిత్రాలను సరికొత్తగా పునరుద్ధరించనున్నారు.
ఈ వినూత్న ప్రయత్నాల ద్వారా భిన్న తరాల ప్రేక్షకులను ఒకే గొడుగు కిందికి తీసుకురావడమే తమ లక్ష్యమని ఈరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపకులు పేర్కొన్నారు. క్లాసిక్ సినిమాల జ్ఞాపకాలను ఆధునిక సాంకేతికతతో, కొత్త కథనాలతో ముడిపెడుతూ వారు తీసుకుంటున్న ఈ నిర్ణయం భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టబోతోంది. పాత తరం ఐకానిక్ చిత్రాల పేర్లు , వాటి ఆత్మను దెబ్బతీయకుండా కొత్త తరం నటీనటులతో చేయబోయే ఈ ప్రయోగాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.
