Begin typing your search above and press return to search.

తెలుగు సినిమా మార్కెట్.. ఓటీటీకి ముందు, ఓటీటీ తర్వాత!

'సినిమా ఇండస్ట్రీ' గురించి మాట్లాడాల్సి వస్తే ఓటీటీలు రాకముందు, ఓటీటీలు వచ్చిన తర్వాత అని మాట్లాడుకోవాలి

By:  Tupaki Desk   |   10 Feb 2024 9:12 AM GMT
తెలుగు సినిమా మార్కెట్.. ఓటీటీకి ముందు, ఓటీటీ తర్వాత!
X

'సినిమా ఇండస్ట్రీ' గురించి మాట్లాడాల్సి వస్తే ఓటీటీలు రాకముందు, ఓటీటీలు వచ్చిన తర్వాత అని మాట్లాడుకోవాలి. కోవిడ్ పాండమిక్ కారణంగా కుదేలైపోయిన చిత్ర పరిశ్రమ మళ్లీ ఇంత త్వరగా కోలుకుంటుందని ఎవరూ ఊహించలేదు. ఆ సమయంలో వినోదానికి ప్రత్యామ్నాయంగా మారిన డిజిటల్ వేదికలు.. ఇండస్ట్రీని గాడిలో పెట్టడమే కాదు, ఫిలిం మేకర్స్ ను ఆదుకున్నాయి. మరీ ముఖ్యంగా మన టాలీవుడ్ మార్కెట్ రెండింతలు పెరగడానికి దోహదపడ్డాయి.

కరోనా లాక్ డౌన్ టైంలో నిర్మాతలు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లు మూతబడటంతో సినిమాలు విడుదల చేసుకోలేక, ఫైనాన్స్ కి తెచ్చుకున్న డబ్బులకు వడ్డీల మీద వడ్డీలు కట్టుకోలేక నానా కష్టాలు అనుభవించారు. అలాంటి వారందరికీ ఓటీటీలు ఆపన్న హస్తం అందించాయి. డైరెక్ట్ ఓటీటీ రిలీజులకు అవకాశం కల్పించి చిన్న, మీడియం రేంజ్ చిత్రాలకు సపోర్ట్ గా నిలిచాయి.

జనాలు ఓటీటీలకు అలవాటు పడిపోవడంతో, పాండమిక్ తర్వాత కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ ను అందించాడని కృషి చేస్తూ వచ్చాయి. ఫ్యాన్సీ రేటుకు సినిమాల డిజిటల్ హక్కులు కొనుగోలు చేసి, స్ట్రీమింగ్ చేయటం మొదలుపెట్టాయి. దీంతో తెలుగు సినిమా మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఒకప్పుడు నిర్మాతలకు థియేట్రికల్, శాటిలైట్ రైట్స్ ద్వారానే డబ్బులు వచ్చేవి. కానీ ఓటీటీల హవా మొదలైన తర్వాత డిజిటల్ రైట్స్ రూపంలోనే అధిక మొత్తం అందుతోంది.

నాన్ థియేట్రికల్ రూపంలోనే ఎక్కువ మొత్తం వెనక్కి వస్తుండంతో.. ఆటోమేటిక్ గా సినిమా బిజినెస్ లెక్కలు మారిపోయాయి. హీరోల రెమ్యునరేషన్లు పెరిగాయి, బడ్జెట్ పెరిగింది, ఫలితంగా తెలుగు సినిమా మార్కెట్ కూడా బాగా పెరిగిపోయింది. అయితే ఇటీవల కాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఓటీటీ మార్కెట్ డౌన్ ఫాల్ మొదలైంది. ఇంతకముందు ఎలాంటి సినిమా అయినా మంచి రేటు ఇచ్చి కొనుక్కునే డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్.. ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.

స్టార్ హీరోలు, క్రేజీ కాంబినేషన్స్ ఉన్న సినిమాలు తప్పించి.. మిగతా టైర్-2 హీరోలు, మీడియం రేంజ్ మూవీస్ డీల్స్ విషయంలో ఒక స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నాయి. ఒకప్పటిలా భారీ చెల్లింపులు చేయడం లేదు. బేరసారాలు ఆడుతున్నాయి. కొన్ని పరిమితులు పెట్టుకొని అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. దీంతో ఓ మోస్తరు సినిమా డిజిటల్ హక్కులు అమ్ముడుపోవడం కష్టంగా మారింది.

ఇప్పటికే కొన్ని ఓటీటీ సంస్థలు మీడియం రేంజ్ సినిమాలకి శాటిలైట్ - ఓటీటీ రైట్స్ కలిపి తీసుకోవాలనే నిబంధనను ఫాలో అవుతున్నాయి. క్రేజీ కాంబినేషన్స్, పెద్ద సినిమాల విషయంలో మాత్రం కొన్ని సడలింపులు ఇస్తున్నారు. మరికొన్ని ఓటీటీలు బయట సినిమాల్ని కొనడం తగ్గించేసి, సొంత నిర్మాణంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంటున్నాయి. ఇంకొన్ని ఓటీటీలు కొత్త సినిమాల్ని కొనడం తగ్గింది, ఆల్రెడీ ఉన్న కంటెంట్ ని రన్ చేయాలని భావిస్తున్నాయి.

మొత్తం మీద రాబోయే రోజుల్లో తెలుగు సినిమాలకు నాన్-థియేట్రికల్ మార్కెట్ కష్టంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ శాటిలైట్ మార్కెట్ తగ్గిపోవడం, హిందీ డబ్బింగ్ మార్కెట్ పడిపోవడం.. ఇప్పుడు ఓటీటీ మార్కెట్ కూడా ఆ దిశగా పయనిస్తుండటంతో మళ్లీ కొంతమంది నిర్మాతలకి ఇబ్బందులు తలెత్తే అవకాశం వుంది. ఒకప్పుడు వరంగా కనిపించిన ఓటీటీలు, మెల్లిగా శాపంగా మారుతున్నాయి. ఇవన్నీ ఆలోచించుకునే ఆ మధ్య అనౌన్స్ చేయబడిన ఓ తెలుగు సినిమాని మేకర్స్ పూర్తిగా పక్కనపెట్టేసారు. మరి మున్ముందు మన సినిమాల డిజిటల్ మార్కెట్ ఎలా ఉంటుందో చూడాలి.