Begin typing your search above and press return to search.

90ఏళ్ల చ‌రిత్ర‌లో తెలుగు సినిమా పత్రికలు!

అయితే సినిమా జ‌ర్న‌లిజం క్లాసిక్ డేస్ నుంచి ఎలా కొన‌సాగింది. సినిమా ప‌త్రిక‌లు, సినీమ్యాగ‌జైన్ల‌ మ‌నుగ‌డ ఎలా సాగింది? అన్న‌దానికి స‌మాచారం ఇక్క‌డ ఉంది.

By:  Tupaki Desk   |   25 Nov 2023 12:30 AM GMT
90ఏళ్ల చ‌రిత్ర‌లో తెలుగు సినిమా పత్రికలు!
X

100ఏళ్లు పైబ‌డిన‌ భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో.. 90ఏళ్లు పైబ‌డిన చ‌రిత్ర తెలుగు సినీప‌రిశ్ర‌మ‌కు ఉంది. ఇందులో 50 సంవ‌త్స‌రాలు పైబ‌డిన చ‌రిత్ర‌తో ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ మ‌నుగ‌డ‌లో ఉంది. ఇప్పుడు అద‌నంగా జ‌ర్న‌లిస్టు సంఘాలు మొద‌ల‌య్యాయి. అయితే ద‌శాబ్ధాల పాటు తెలుగు సినిమాకి ఎంతో సేవ చేసిన సినీజ‌ర్న‌లిస్టులు- వారి ర‌చ‌న‌లు, సినిమా ప‌త్రిక‌లు, మ్యాగ‌జైన్లు క‌నుమ‌రుగ‌వ్వ‌డం కాలానుగుణంగా జ‌రిగిన ప్ర‌క్రియ‌. సినిమా ప‌త్రిక‌లు, మ్యాగ‌జైన్ల స్థానంలో ఇప్పుడు డిజిట‌ల్ ప‌త్రిక‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే సినిమా జ‌ర్న‌లిజం క్లాసిక్ డేస్ నుంచి ఎలా కొన‌సాగింది. సినిమా ప‌త్రిక‌లు, సినీమ్యాగ‌జైన్ల‌ మ‌నుగ‌డ ఎలా సాగింది? అన్న‌దానికి స‌మాచారం ఇక్క‌డ ఉంది.

1) టాలీవుడ్ లో తొలి తెలుగు సినిమా పత్రికగా `చిత్రకళ` రికార్డుల‌కెక్కింది. ఈ సినిమా ప‌త్రిక‌ 1938లో వచ్చింది. ఇంటూరి వేంకటేశ్వరరావు, పేకేటి శివరం సారధ్యంలో ఈ తొలి సినిమా పత్రిక ప్రచురణ మొదలైంది..

2) ఇదే సంవత్సరంలో ప్రారంభమైన రెండవ సినిమా పత్రిక.. రూపవాణి

వి సీతారామయ్య గారి సంపాదకత్వంలో వెలువడింది..

3) కొంతమంది జర్నలిస్టులు కలిసి తీసుకొచ్చిన సినిమా పత్రిక లో నటనలో నాటకాలు వివరాలు కూడా వేసేవారు..

4) 1946-47 ప్రాంతాల్లో కొమ్మూరి సాంబశివరావు.. `తెలుగు సినిమా` .. అనే వారపత్రికను తీసుకొచ్చి సినిమా వారపత్రికలకి శ్రీకారం చుట్టారు. పై మూడు సినిమా మాసపత్రికలే.. కానీ విభిన్న‌మైన‌ శీర్షికలు ఉండటంతో మంచి ఆదరణ పొందింది ఈ వారపత్రిక..

5) 1954లో జివిజి సారధ్యంలో ఆరంభమైన.. `సినిమా రంగం`.. మాసపత్రిక సినీ పత్రికారంగంలో ఓ కొత్త ఒరవడి సృష్టించింది. సినీ తారల వర్ణ చిత్రాలు చాలా కలర్ ఫుల్ గా ఉండేవి. ప్రశ్న జవాబులు శీర్షిక చాలా ఆసక్తికరంగా ఉండేది. ఎక్కువ పేజీలతో విశేషాలతో సైజు హేండీగా ఉండటంతో చాలాకాలం నెం.1 సినిమా పత్రికగా కొనసాగింది..

6) గౌతమ్ సారధ్యంలో గౌతమి అనే సినిమా మాసపత్రిక 1955 నుంచి 12 ఏళ్ళు కొనసాగింది..

7) కామేశ్వర శర్మ గారి కాగడ సినిమా వారపత్రిక సాధారణ వార్తలు కంటే వివాదాస్పద వార్తలే ఎక్కువగా ఉండేవి. ముఖ్యంగా యువకులు ఈ పత్రిక కోసం ఎగబడేవారు..

8) రమణమూర్తి గారి `కొరడా` కూడా కాగడా తరహాలోనే వచ్చిన సినీ వారపత్రిక..

9) కినిమా సినీ మ్యాగజైన్, శ్రీధర్ సారధ్యంలో వచ్చిన `చిత్రాలయ` కొంత‌ కాలం మ‌నుగ‌డ సాగించింది. సరియైన కంటెంట్ లేకపోవడంతో దెబ్బ తింది..

10) వి కోటేశ్వరరావు సారధ్యంలో వచ్చిన.. సినీ జనతా.. తొలి తెలుగు సినిమా వార్తా వారపత్రిక. రాజధాని హైదరాబాద్ నుంచి (1965) వెలువడిన తొలి సినిమా పత్రిక ఇదే..

11) బి ఎ వి శాండిల్య గారు 1969లో.. వెండితెర. అనే సినిమా వారపత్రిక ఆరంభించారు..

12) ఇదే తరహాలో.. సినీ హెరాల్డ్.. అనే వారపత్రిక ఠాకూర్ వి హరిప్రసాద్ గారు 1975లో ఈ పత్రికని ప్రారంభించారు..

13) 1966లో డాల్టన్ పబ్లికేషన్స్ మద్రాసు నుంచి ప్రారంభించిన సినిమా మాసపత్రిక.. విజయచిత్ర.. ఆరంభం నుంచే సినీమా పత్రికలకు రారాజుగా నిలిచింది. విశేషాల పరంగా, నాణ్యతా పరంగా ఉన్నత స్థాయిలో ఉండటంతో విజయచిత్ర అనూహ్య పాఠకాదరణ పొందింది..

14) ఇక 1976 నుంచి అనేక సినిమా వారపత్రికలు పుట్టుకొచ్చాయి. ఆంధ్రజ్యోతి సంస్థ నుంచి జ్యోతిచిత్ర, ఈనాడు వారి సితార.. ఈ రెండూ కూడా చాలా సంవత్సరాల పాటు వచ్చాయి. సితార ఇంకా ఎక్కువ కాలం సుమారు నాలుగైదు సంవత్సరాల క్రితం వరకూ వెలువడి ఆగిపోయింది. ఆంధ్రభూమి నుంచి చిత్రభూమి, ఆంధ్రపత్రిక సంస్థ నుంచి సినిమా రంజని, దాసరి నారాయణరావు ఉదయం పేపరు సంస్థ నుంచి శివరంజని, మేఘసందేశం సినిమా వారపత్రికలు వచ్చాయి. వీటిలో సితార, జ్యోతిచిత్ర మినహాయిస్తే మిగతావేవీ ఎక్కువ కాలం మనుగడ సాగించ లేకపోయాయి.

15 ) తెలుగు సినీరంగంలో సూపర్ హిట్, సంతోషం వంటి సినిమా వారపత్రికలు వచ్చి విజయం సాధించాయి. ఈ రెండు ప‌త్రిక‌లు బ‌ల‌మైన పునాదితో సినీరంగంలో వేళ్లూనుకున్నాయి. ప్ర‌ముఖ పీఆర్వో కం నిర్మాత బి.ఏ.రాజు సూప‌ర్ హిట్ మ్యాగ‌జైన్ ని విజ‌య‌వంతంగా నడిపించారు. అలాగే పీఆర్వో కం నిర్మాత, జ‌ర్న‌లిస్ట్ సురేష్ కొండేటి `సంతోషం` మ్యాగ‌జైన్ ని విజ‌య‌వంతంగా న‌డిపించ‌డ‌మే గాక‌, సంతోషం అవార్డుల‌ను విజ‌య‌వంతంగా కొన‌సాగిస్తున్న వారిగా ల‌బ్ధ‌ప్ర‌తిష్ఠులయ్యారు.

వెంక‌టేశ్వ‌ర‌రావు సార‌థ్యంలో ట్రేడ్ గైడ్, శ్రీ‌నివాస్ సార‌థ్యంలో చిత్రం, మిక్కిలినేని జ‌గ‌దీష్ బాబు, బాలి టి, నంద‌గోపాల్, గొటేటి రామారావు, నాగేంద్ర‌- సూర్య ప్ర‌కాష్‌ వంటి సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు సినిమా ప‌త్రిక‌ల నిర్వ‌హ‌ణ‌లో అనుభ‌వం ఉన్న జ‌ర్న‌లిస్టులుగా సుప‌రిచితులు. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ప్ర‌భు సినీస్టార్ ప‌త్రిక‌ను న‌డిపించారు. ఇది మన తెలుగు సినిమా పత్రికలపై టూకీగా...