ఆ ఇద్దరు నిర్మాతలు.. ఇద్దరు డైరెక్టర్లు ఎవరు? ఇప్పుడిదే హాట్ టాపిక్!
ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ, డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్ చేసిన వ్యాఖ్యలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.
By: Tupaki Desk | 8 Jun 2025 1:20 PM ISTరెండు తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్.. అంటూ వచ్చిన ఒకే ఒక్క ప్రకటన ఓ రేంజ్ లో సంచలనం క్రియేట్ చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకు అదేం లేదని ఫిల్మ్ ఛాంబర్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ అంతలోనే జరగాల్సింది జరిగిపోయింది. దాని వెనుక 'ఆ నలుగురు' ఉన్నారని జోరుగా ప్రచారం సాగింది.
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ హరిహర వీరమల్లు రిలీజ్ కు ముందే ఎందుకు ప్రకటన వచ్చిందని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ విచారణకు ఆదేశించారు. ఆ తర్వాత పలువురు నిర్మాతలు స్పందించి.. పవన్ కళ్యాణ్ మూవీని ఆపే దమ్ము అసలు ఎవరికీ లేదని తెలిపారు. మ్యాటర్ మిస్ లీడ్ అయిందని వ్యాఖ్యానించారు.
రీసెంట్ గా మరో నిర్మాత.. ఎవరో పవన్ ను మిస్ లీడ్ చేశారని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ, డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్ చేసిన వ్యాఖ్యలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. సింగిల్ స్క్రీన్లలో పర్సంటేజీ విధానం అమలు కావాలని తాము 2016 నుంచి పోరాడుతున్నామని ఆయన తెలిపారు.
ఆ విషయమై తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌ను సంప్రదించామని చెప్పారు. తామెప్పుడూ ఎక్కడా బంద్ అనే పదాన్ని ఉపయోగించలేదని చెప్పారు. బంద్ అంశం తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిబిటర్ల నుంచి వచ్చిందని వెల్లడించారు. ఇద్దరు నిర్మాతలు, ఇద్దరు దర్శకుల వల్ల థియేటర్లు బంద్ అంశం మరింత ముదిరిందని శ్రీధర్ అన్నారు.
అది ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్లిపోయిందని.. తాము తగిన సమయంలో ఆ పేర్లను వెల్లడిస్తామని చెప్పారు. కచ్చితంగా వారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు. దీంతో ఇప్పుడు శ్రీధర్ చెప్పిన ఇద్దరు నిర్మాతలు, ఇద్దరు దర్శకులు ఎవరనేది జోరుగా అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. పలువురు పేర్లను నెటిజన్లు కామెంట్లలో పెడుతున్నారు.
మరికొందరు పవన్ కళ్యాణ్ తో సినిమాలు నిర్మించిన నిర్మాతల్లో ఎవరైనా కావచ్చొని నెటిజన్లు డౌట్ పడుతున్నారు. ఇంకొందరు వారు కాదని అంటున్నారు. దర్శకులు కూడా వీరేనని కొందరు చెబుతున్నారు. మరి శ్రీధర్ చెప్పిన ఇద్దరు నిర్మాతలు, ఇద్దరు దర్శకులు ఎవరనేది తెలియాలంటే.. ఆయన ప్రకటించిన వరకు వెయిట్ చేయాలేమో!
