జూన్ 1న థియేటర్ల బంద్ లేదు
జూన్ 1 నుంచి థియేటర్ల బంద్‌కు ఎగ్జిబిటర్లు పిలుపు నివ్వడం తెలిసిందే. దీంతో చాలా వరకు పెద్ద సినిమాల రిలీజ్‌లు ప్రశ్నార్థకంగా మారాయి.
By: Tupaki Desk | 24 May 2025 2:43 PM ISTజూన్ 1 నుంచి థియేటర్ల బంద్‌కు ఎగ్జిబిటర్లు పిలుపు నివ్వడం తెలిసిందే. దీంతో చాలా వరకు పెద్ద సినిమాల రిలీజ్‌లు ప్రశ్నార్థకంగా మారాయి. భారీ సినిమాలు ఏడాదిలో ఒకటి అర విడుదలవుతున్న నేపథ్యంలో తాము తీవ్ర నష్టాలని ఎదుర్కొంటున్నామని, ఈ విషయంలో ఇండస్ట్రీ పెద్దలు సరైన నిర్ణయం తీసుకోవాలని, లేదంటే పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.
దీనిపై ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చ జరుగుతోంది. అయినా సరే నిర్మాతలు, ఇండస్ట్రీ పెద్దలు తమ డిమాండ్‌లకు తలొగ్గకపోతే జూన్ 1 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లని బంద్ చేస్తామంటూ ఎగ్జిబిటర్లు సంచలన ప్రకటన చేయడంతో ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదే సమయంలో పవన్ కల్యాణ్ నటించిన `హరి హర వీరమల్లు`, ధనుష్ `కుబేర`, కమల్ హాసన్, మణిరత్నంల `థగ్ లైఫ్, మంచు విష్ణు నటించిన `కన్నప్ప` వంటి తదితర సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
దీంతో ఈ సినిమాల రిలీజ్‌లపై థియేటర్స్ బంద్ తీవ్ర ప్రభావం చూపించనున్న నేపథ్యంలో ఇండస్ట్రీ పెద్దలు నష్టనివారణ చర్చలకు దిగారు. పర్సంటేజ్ విధానం కోసం పట్టుబడుతున్న ఎగ్జిబిటర్లను బుజ్జగించే పని మొదలు పెట్టారు. ఫైనల్‌గా వారి చర్చలు ఫలించి జూన్ 1 నుంచి థియేటర్ల బంద్‌కు పిలుపునిచ్చిన ఎగ్జిబిటర్లు వెనక్కి తగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అఖిలపక్ష సమావేశంలో కుదిరిన రాజీ కారణంగా ఎగ్జిబిటర్లు థియేటర్ల బంద్‌కు వెనక్కితగ్గినట్టుగా తెలిసింది.
