సింగిల్ స్క్రీన్ థియేటర్లు కనుమరుగవుతాయా?
తెలుగు రాష్ట్రాల్లో సింగిల్స్ స్క్రీన్‌కు పెద్ద చరిత్రే ఉంది. కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఏ హీరో సినిమా విడుదలైనా థియేటర్ల వద్ద అభిమానులు చేసే హంగామా వేరు.
By: Tupaki Desk | 12 Jun 2025 10:14 AM ISTతెలుగు రాష్ట్రాల్లో సింగిల్స్ స్క్రీన్‌కు పెద్ద చరిత్రే ఉంది. కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఏ హీరో సినిమా విడుదలైనా థియేటర్ల వద్ద అభిమానులు చేసే హంగామా వేరు. వారి హంగామాతో థియేటర్లు కళకళలాడేవి. భారీ హోర్డింగ్‌లు, కలర్ ఫుల్ పోస్టర్లు, థియేటర్ అంతా ఓ పంగడ వాతావరణాన్ని సృష్టించేవారు. అభిమానుల హంగామాతో గత కొన్ని దశాబ్దాలుగా కళకళలాడిన సింగిల్ స్క్రీన్ థియేటర్లు కనుమరుగు కానున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
అంతే కాకుండా ఇటీవల యువ నిర్మాత బన్నీ వాసు ఇచ్చిన స్టేట్‌మెంట్ దీనికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఓటీటీల ప్రభావంతో ఇప్పటికే ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఇష్టపడటం లేదు. దీనికి తోడు నిర్మాతలు చేస్తున్న పనులు కూడా థియేటర్లు కనుమరుగవడానికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. సినిమా విడుదలైన 28 రోజుల్లోనే ఓటీటీలకు ఇస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో 90 శాతం సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడటం ఖాయం.
ఓటీటీలకు తోడు పెద్ద హీరోలు అవలంభిస్తున్న ధోరణి కూడా థియేటర్ వ్యవస్థ పతావస్థకు చేరడానికి ప్రధాన కారణంగా నిలుస్తూ ఇండస్ట్రీ వర్గాలని కలవరానికి గురి చేస్తోంది. అప్పట్లో హీరోలు ఏడాదికి మూడు నుంచి నాలుగు సినిమాలు చేస్తే ఇప్పటి స్టార్లు మాత్రం ఏడాదికి ఒక్క సినిమా కూడా చేయడం లేదు. నాని లాంటి హీరోలు మాత్రమే ఏడాదికి ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తుంటే మిగతా వారు మాత్రం రెండేళ్లకు, మూడేళ్లకు సినిమాలు చేస్తూ ఇండస్ట్రీని ప్రశ్నార్థకంలో పడేస్తున్నారు.
ఇక పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కావట్లేదని స్టేట్‌మెంట్‌లిస్తున్న ఎగ్జిబిటర్లు చిన్న సినిమాలకు మాత్రం థియేటర్లు ఇవ్వడానికి ఆసక్తిని చూపించడం లేదు. ప్రేక్షకులు కూడా కొంత వరకు చిన్న హీరోల సినిమాల కోసం థియేటర్లకు రావడానికి ఆసక్తిని చూపించకపోవడంతో ఎగ్జిబిటర్లు చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వడానికి సంసయిస్తున్నారు. ఓటీటీల ప్రభావం తగ్గక ఇదే పరిస్థితి కొనసాగితే అభిమానుల కోలాహలంతో కళకళలాడిన సింగిల్ స్క్రీన్ థియేటర్లు మాత్రం త్వరలోనే కనుమరుగవ్వడం ఖాయం.
