సింగిల్ స్క్రీన్‌లను బతికిస్తున్న రీ రిలీజ్‌లు
తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా థియేటర్లు ఉండేవి. కానీ వాటి పరిస్థితి కూడా దారుణంగా ఉంది. పెద్దగా సినిమాలు రావడం లేదు, వచ్చిన సినిమాలు ఆకట్టుకోవడం లేదు.
By: Tupaki Desk | 13 Jun 2025 5:59 PM ISTదశాబ్ద కాలంగా థియేటర్ల బిజినెస్ తగ్గుతూ వస్తుంది. టీవీల పరిధి పెరగడం, ఓటీటీల సందడి మొదలు కావడంతో థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య తగ్గుతుంది. టికెట్ల రేట్లు విపరీతంగా పెరగడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కరోనా సమయం నుంచి ఇండియాలో థియేటర్ల పరిస్థితి దిగజారి పోయింది. వేలాది థియేటర్లు మూత పడ్డాయి, కొన్ని ఫంక్షన్ హాల్లు కాగా, కొన్ని కాంప్లెక్స్‌లు అయ్యాయి. చాలా చోట్ల పాత జ్ఞాపకాలు నెమరువేసుకునే విధంగా మూతపడి ఉన్నాయి. అవి ఓపెన్ కాకపోతాయా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. సగటు చిన్న పట్టణాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు వారంలో ఒకటి రెండు రోజులు మాత్రమే జనంతో కనిపిస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా థియేటర్లు ఉండేవి. కానీ వాటి పరిస్థితి కూడా దారుణంగా ఉంది. పెద్దగా సినిమాలు రావడం లేదు, వచ్చిన సినిమాలు ఆకట్టుకోవడం లేదు. అంత రేటు పెట్టి థియేటర్‌లో చూసే బదులు నాలుగు వారాల్లో ఓటీటీలో వస్తుంది కదా వెయిట్ చేద్దాం అనుకునే వారు చాలా మంది ఉన్నారు. అందుకే థియేటర్లకు జనాలు రావడం లేదు. ఈ సమయంలో థియేటర్లు మూత పడుతున్నారు. గత వారం వచ్చిన సినిమాలు పెద్దగా ఆడిందే లేదు, ఈ వారం వచ్చిన సినిమాలు కూడా జనాల్లో కనీసం నోటెడ్ కాలేదు. ఈ వారం వీరమల్లు వస్తుందనే ఉద్దేశంతో పెద్ద సినిమాలు వెనక్కి తగ్గాయి. దాంతో ఈ వారం డ్రై గా మారింది.
ఈవారం కొత్త సినిమాలు లేకున్నా పాత సినిమాలు ఒకింత సింగిల్ స్క్రీన్ థియేటర్లను రక్షిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ 'తొలిప్రేమ', రవితేజ 'వెంకీ' సినిమాలతో పాటు అందాల రాక్షసి సినిమా సైతం ఈ వారం రీ రిలీజ్ అయ్యాయి. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఈ సినిమాలు సందడి చేస్తున్నాయి. కొత్త సినిమాలు లేకపోవడంతో ఈ పాత సినిమాలే ఈ వారం మొత్తం సింగిల్ స్క్రీన్ థియేటర్లను రక్షించాల్సి ఉంది. ముందు ముందు కూడా పెద్ద హీరోల సినిమాలు చాలా వరకు రీ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. కనుక సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఇతర భాషల్లో రీ రిలీజ్‌లు ఎక్కువ లేకపోవడంతో అక్కడ సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి దారుణంగా ఉంది.
ఇక ఈ వారం విడుదల అయిన పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాకు మంచి బుకింగ్స్ నమోదు అయ్యాయి. ముఖ్యంగా సినిమాలోని లవ్ స్టోరీని ఇష్టపడే వారు ఈ సినిమాను ఎన్ని సార్లు అయినా థియేటర్‌లో చూసేందుకు సిద్ధంగా ఉంటారు. పవన్ ఇమేజ్‌ను ఎప్పటికీ ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉంచే సినిమా ఇది అని అభిమానులు అంటూ ఉంటారు. ఇక వెంకీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో ఇది ఒకటి, తెలుగు కామెడీ సినిమాల టాప్ జాబిత తీస్తే కచ్చితంగా వెంకీ ఉంటుంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంటుంది. అందుకే రీ రిలీజ్‌కి మంచి స్పందన వచ్చింది. ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా అందాల రాక్షసి సరికొత్త ప్రేమను ప్రేక్షకులకు చూపించింది. అందుకే రీ రిలీజ్‌లో ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది.
