Begin typing your search above and press return to search.

ట్రెండీ స్టోరి: గాయ‌నీ గాయ‌కులు ఎలా మోస‌పోతున్నారో తెలిస్తే షాక్ తింటారు!

నిర్మాతలు సాధారణంగా ``డబ్బు పెట్టుబ‌డి మాది.. రిస్క్ మాది.. కాబట్టి హక్కులు మావే`` అని వాదిస్తుంటారు. కానీ రాయ‌ల్టీ మ్యాట‌ర్స్ లో విదేశీ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.

By:  Sivaji Kontham   |   28 Feb 2026 9:53 AM IST
ట్రెండీ స్టోరి: గాయ‌నీ గాయ‌కులు ఎలా మోస‌పోతున్నారో తెలిస్తే షాక్ తింటారు!
X

సంగీత ప్రపంచంలో ఒక పాట కొన్ని దశాబ్దాల పాటు వినిపిస్తూనే ఉంటుంది. కానీ ఆ పాటకు ప్రాణం పోసి పాడిన గాయకుడి పరిస్థితి మాత్రం `ఒక్కసారి పారితోషికం.. ఆపై అంతా శూన్యం` అన్నట్లుగా ఉంది. ఇటీవల ప్రముఖ గాయకులు చేసిన వ్యాఖ్యలు భారతీయ సినీ సంగీత పరిశ్రమలోని చీకటి కోణాన్ని.. ముఖ్యంగా రాయల్టీ విషయంలో జరుగుతున్న వివక్షను మరోసారి చర్చకు తెరలేపాయి.

టాలీవుడ్ గాయనీగాయకులు కూడా మోసపోతున్నారా?

అంటే..అవును అనే సంబంధిత వ‌ర్గం నుంచి విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతున్నాయి. కేవలం బాలీవుడ్ లేదా ఇరుగు పొరుగు ప‌రిశ్ర‌మ‌ల వ‌ర‌కే పరిమితం కాలేదు. టాలీవుడ్ గాయనీగాయకులు కూడా ఈ రాయల్టీ మోసంలో బాధితులుగానే మిగిలిపోతున్నారు. సినిమా నిర్మాణ సమయంలో ఇచ్చే రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఉంటోంది. దీంతో గాయకులు కేవలం బయట చేసే కచేరీలు లేదా టీవీ షోల ద్వారానే సంపాదించుకోవాల్సి వస్తోంది. వయసు పైబడిన తర్వాత లేదా అవకాశాలు తగ్గినప్పుడు.. వారు పాడిన పాత పాటలు సూపర్ హిట్ అయి కోట్లు కురిపిస్తున్నా.. వారి చేతిలో చిల్లిగవ్వ ఉండని పరిస్థితి కనిపిస్తోంది. ఇది కేవలం ఒక్క పరిశ్రమకే పరిమితం కాకుండా.. భారతీయ సినీ సంగీత ప్రపంచమంతటా విస్తరించిన ఒక వ్యవస్థీకృత దోపిడీగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక పాట యూట్యూబ్‌లో వందల కోట్ల వ్యూస్ సాధించినా లేదా మ్యూజిక్ యాప్స్‌లో మిలియన్ల స్ట్రీమ్స్ పొందినా.. దాని ద్వారా వచ్చే ఆదాయంలో మెజారిటీ వాటా మ్యూజిక్ లేబుల్స్‌కు, కొంత మేర నిర్మాతలకు వెళ్తుంది.

సంగీత దర్శకులు ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ వంటి వారు తమ మేధో సంపత్తి హక్కుల (ఐపిఆర్) కోసం ఏళ్ల తరబడి పోరాడుతున్నారు. ఒక పాట విజయంలో గాయకుడి సృజనాత్మక వాటా కీలకమైనది. ఆ గొంతు వల్లే పాట ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి వాణిజ్యపరంగా లాభాలు గడిస్తున్నప్పుడు అందులో పాడిన వారికి కొంత శాతం `రాయల్టీ` దక్కడం న్యాయం. 2012 నాటి కాపీరైట్ సవరణ చట్టం ప్రకారం.. గాయకులకు రాయల్టీ పొందే హక్కు ఉన్నా కానీ క్షేత్రస్థాయిలో అది అమలు కాకపోవడం వల్ల గాయకులు తీవ్రంగా నష్టపోతున్నారు.

నిర్మాతలు సాధారణంగా ``డబ్బు పెట్టుబ‌డి మాది.. రిస్క్ మాది.. కాబట్టి హక్కులు మావే`` అని వాదిస్తుంటారు. కానీ రాయ‌ల్టీ మ్యాట‌ర్స్ లో విదేశీ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. బ్రిటీష్-ఇండియన్ కంపోజర్ బిడ్డు కేవలం రెండు పాటల రాయల్టీతోనే నెలకు రూ. 80 లక్షల వరకు సంపాదిస్తున్నారు. విదేశాల్లో ``పాట ఎక్కడ ప్లే అయితే అక్కడ వాటా`` అనే సూత్రం అమలవుతుంటే.. ఇండియాలో మాత్రం ఒకసారి పారితోషికం ఇచ్చి హక్కులన్నీ లాగేసుకునే ధోరణి కొనసాగుతోంది. రింగ్‌టోన్స్, యాడ్స్, రీమిక్స్ ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో సృజనాత్మక భాగస్వాములైన గాయకులకు వాటా ఇవ్వకపోవడం ముమ్మాటికీ దోపిడీయేన‌నే ఆవేదన సింగ‌ర్ల‌లో వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇక గాయకులు రాయల్టీ గురించి గట్టిగా అడగలేకపోవడానికి ప్రధాన కారణం `భయం`. తమ కంటే సింగర్ పెద్ద స్టార్ అయిపోతారనే భయంతో ఇండ‌స్ట్రీలో తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని కొంద‌రు గాయ‌నీగాయ‌కులు గ‌తంలో ఆరోపించారు. రాయల్టీ అడిగితే వేరొక‌రితో `రీప్లేస్‌మెంట్` చేస్తారనే భయం.. పెద్ద హీరో సినిమాలో అవకాశం రాకపోతే స్టేజ్ షోల ఆశ పోతుందనే బలహీనతను ఇండస్ట్రీ వాడుకుంటోంది.

గాయనీ గాయకులు సంఘటితంగా పోరాడితే తప్ప.. ఈ చీకటి కోణం నుంచి వెలుగులోకి రావడం సాధ్యం కాదు. కళ బతికున్నంత కాలం కళాకారుడికి ఫలితం దక్కడమే నిజమైన గౌరవం.