టైటిల్స్ ట్రెండ్ - తెలుగు vs ఇంగ్లీష్!
తాజాగా `భరతవర్ష`, `వృషకర్మ`, `స్వయంభు`, `మహిషాసుర మర్దిని` వంటి పేర్లు వినగానే ఒక రకమైన గాంభీర్యం, పౌరాణిక చారిత్రక నేపథ్యం ఉన్నాయనే భావన కలుగుతుంది.
By: Srikanth Kontham | 14 April 2026 9:00 PM ISTఒకప్పుడు తెలుగు పదాలతో కూడిన టైటిల్స్ మాత్రమే బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తాయని నమ్మేవారు. కానీ మన సినిమాలిప్పుడు సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న తరుణంలో మేకర్స్ టైటిల్స్ విషయంలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఈ ట్రెండ్‌లో ప్రధానంగా రెండు భిన్నమైన ధోరణులు కనిపి స్తున్నాయి. ఒకవైపు మూలాలను వెతికే అచ్చ తెలుగు సంస్కృత పదాలతో కూడిన టైటిల్స్ , మరోవైపు అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకర్షించే ఆంగ్ల పదాలు. ఇటీవల కాలంలో దర్శకులు తమ సినిమాలకు అత్యంత బరువైన, అర్థవంతమైన సంస్కృత పదాలను టైటిల్స్‌గా ఎంచుకుంటున్నారు.
తాజాగా `భరతవర్ష`, `వృషకర్మ`, `స్వయంభు`, `మహిషాసుర మర్దిని` వంటి పేర్లు వినగానే ఒక రకమైన గాంభీర్యం, పౌరాణిక చారిత్రక నేపథ్యం ఉన్నాయనే భావన కలుగుతుంది. ఈ తరహా టైటిల్స్ సినిమాపై ఆసక్తిని పెంచడమే కాకుండా మన సంస్కృతిని గర్వంగా చాటిచెప్పేలా ఉంటున్నాయి. కథలో ఉండే గాఢతను ప్రతిబింబించడానికి ఇలాంటి పేర్లు ఎంతగానో దోహదపడుతున్నాయన్నది కాదనలేని నిజం.
మరోవైపు పాన్-ఇండియా స్థాయి దాటి పాన్-వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తోన్న మేకర్స్ ఆంగ్ల టైటిల్స్‌పై మొగ్గు చూపుతున్నారు. ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న `స్పిరిట్ , ఎన్టీఆర్ ప్రాజెక్ట్ `డ్రాగన్` వంటి పేర్లు అంతర్జాతీయ ప్రేక్షకులకు సులభంగా కనెక్ట్ అవుతాయి. గ్లోబల్ మార్కెట్‌లో సినిమాను ప్రమోట్ చేయడానికి, భాషా భేదం లేకుండా అందరికీ రిజిస్టర్ అవ్వడానికి ఈ ఇంగ్లీష్ పేర్లు ఒక వారధిలా ఉపయోగప డుతున్నాయన్నది అంతే వాస్తవం. ఈ సినిమాలకు తెలుగు టైటిల్స్ పెడితే రీచ్ అవ్వడం అన్నది అతి కస్టంతో కూడిన పని. ఆ టైటిల్ కూడా ఎంతో క్యాచీగా ఉంటే తప్ప సాధ్యం కాదు.
టైటిల్స్ ఎంపిక అనేది ట్రెండ్ కోసమే కాదు. సినిమా కథాంశంపై కూడా ఆధారపడి ఉంటుంది. సినిమా నేపథ్యం భారతదేశం లేదా పురాణాలకు సంబంధించింది అయితే అచ్చ తెలుగు పదాలను, ఆధునిక యాక్షన్ డ్రామా లేదా గ్లోబల్ సబ్జెక్ట్ అయితే ఇంగ్లీష్ పదాలను ఎంచుకుంటున్నారు. ఒక పీరియడ్ డ్రామాకు `డ్రాగన్` అని పేరు పెడితే ఎంత వింతగా ఉంటుందో,? ఒక హై-టెక్ క్రైమ్ థ్రిల్లర్‌కు `వృషకర్మ` అని పెడితే అంతే వైరుధ్యం కనిపిస్తుంది. అందుకే మేకర్స్ ఈ విషయంలో జాగ్రత్త వ్యవహరిస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు ప్రేక్షకుల అభిరుచి కూడా మారింది. ఒకప్పుడు కేవలం మాస్ టైటిల్స్ కావాలని కోరుకున్న ఫ్యాన్స్ ఇప్పుడు వెరైటీని కోరుకుంటున్నారు. తెలుగు పదాల్లోని మాధుర్యాన్ని, ఇంగ్లీష్ పదాల్లోని స్టైల్‌ను రెండింటినీ ప్రేక్షకులు సమానంగా ఆదరిస్తుండటం విశేషం.
టాలీవుడ్ టైటిల్స్ ట్రెండ్ సమతుల్యతను సాధించింది. భాష ఏదైనా టైటిల్ అనేది సినిమా ఆత్మను ప్రతిబింబించేలా ఉండాలనేది నేటి దర్శకుల ఉద్దేశం. గ్లోబల్ మార్కెట్ కోసం ఇంగ్లీష్‌ను వాడుకుంటూనే, మన మూలాలను మర్చిపోకుండా సంస్కృత పదాలను గౌరవించడం టాలీవుడ్ ఎదుగుదలకు నిదర్శనం. భవిష్యత్తులో ఈ రెండు విభాగాల్లో మరిన్ని వినూత్నమైన టైటిల్స్ వచ్చి ప్రేక్షకులను మెప్పించడంలో సందేహం లేదు.
