Begin typing your search above and press return to search.

TFCCలో మరో ఇష్యూ.. ఏం జరుగుతోంది?

ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా భరత్ భూషణ్ పదవీకాలం జూలై నెలాఖరులో ముగియనుండడంతో వచ్చే నెలలో ఎన్నికలు జరగాల్సి ఉంది.

By:  Tupaki Desk   |   4 July 2025 6:30 PM IST
TFCCలో మరో ఇష్యూ.. ఏం జరుగుతోంది?
X

ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా భరత్ భూషణ్, ఉపాధ్యక్షుడిగా అశోక్, కోశాధికారిగా ప్రసన్న ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది జూన్ 28వ తేదీన జరిగిన ఎన్నికల్లో వారు ముగ్గురు ఎన్నికయ్యారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, స్టూడియో యజమానులు.. నాలుగు సెక్టార్స్ లోని సభ్యులు ఓట్లు వేసి గెలిపించారు.

ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా భరత్ భూషణ్ పదవీకాలం జూలై నెలాఖరులో ముగియనుండడంతో వచ్చే నెలలో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ భరత్ భూషణ్ తో పాటు ప్రసన్న తమ పదవీకాలాన్ని పొడిగించాలని చూస్తున్నారు. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ కార్యనిర్వాహక సమావేశంలో తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు.

దీంతో ఛాంబర్ రూల్స్ బ్రేక్ అయ్యాయని చెప్పాలి. ఇప్పటి వరకు ఛాంబర్ చరిత్రలో పొడిగింపు కేవలం రెండు సార్లు జరిగింది. కరోనా సమయంలో నారాయణ్ దాస్ నారంగ్ కు పొడిగింపు లభించగా, అంతకుముందు ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో ఎన్వీ ప్రసాద్ పదవీ కాలానికి అప్పట్లో తప్పక పొడిగింపు దక్కింది.

కానీ ఇప్పుడు భరత్ భూషణ్ తన పదవీ కాలం పొడిగింపు అవసరమని చెబుతున్నారట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా తాను రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు దగ్గరగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారట. అన్ని విషయాల్లో లాభం చేకూరుతుందని అంటున్నారని సమాచారం. దీంతో ఇప్పుడు ఛాంబర్ లో తిరుగుబాటు పరిస్థితి నెలకొంది.

ఛాంబర్‌ కు ఎన్నికైన యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ (ATFPG)కు చెందిన ఐదుగురు సభ్యులు నిర్మాతలు దిల్ రాజు, మైత్రి రవి, స్రవంతి రవి కిషోర్, సుప్రియ, ఠాగూర్ మధు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. గురువారం నాడు వారంతా కలిపి జూమ్ మీటింగ్ నిర్వహించి ఆ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

పొడిగింపు నిర్ణయాన్ని తిరస్కరిస్తూ నెలాఖరులో వారి పదవీకాలం ముగిసిన తర్వాత రాజీనామా చేస్తారని తెలుస్తోంది. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేయనున్నారట. అదే సమయంలో ఛాంబర్ కు చెందిన ఆరుగురు మాజీ అధ్యక్షులు కూడా అదే డిమాండ్ చేస్తూ లేఖ రాశారు. ప్రణాళిక ప్రకారం ఎన్నికలు జరగకపోతే కోర్టుకు వెళ్లాలని కూడా కొంతమంది సభ్యులు యోచిస్తున్నారట. మరి చివరికి ఏం జరుగుతుందో వేచి చూడాలి.