Begin typing your search above and press return to search.

పరభాషా హీరోల వైపు టాలీవుడ్ డైరెక్ట‌ర్లు!

టాలీవుడ్ డైరెక్ట‌ర్లు ఇప్పుడు కొత్త బాట పడుతున్నారు. కేవ‌లం టాలీవుడ్ హీరోలతోనే కాకుండా ఇతర భాషల స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి దర్శకులు మొగ్గు చూపుతున్నారు.

By:  Srikanth Kontham   |   23 Aug 2026 6:00 AM IST
పరభాషా హీరోల వైపు టాలీవుడ్ డైరెక్ట‌ర్లు!
X

టాలీవుడ్ డైరెక్ట‌ర్లు ఇప్పుడు కొత్త బాట పడుతున్నారు. కేవ‌లం టాలీవుడ్ హీరోలతోనే కాకుండా ఇతర భాషల స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి దర్శకులు మొగ్గు చూపుతున్నారు. ఇండస్ట్రీలో మారుతున్న ట్రెండ్స్ .. పరిణామాల నేపథ్యంలో ద‌ర్శ‌కులు వేస్తోన్న కొత్త అడుగులు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి.

దీనికి ప్రధాన కారణాలలో ఇక్క‌డ స్టార్ హీరోల డేట్స్ దొర‌క‌డం కష్టతరంగా మారడమే. తెలుగు టాప్ హీరోలంతా వరుస పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటం.. వారి కాల్షీట్లు రాబోయే రెండేళ్ల వరకు రిజర్వ్ అయి ఉండటంతో దర్శకులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇతర భాషా నటులతో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

టాలెంటెడ్ డైరెక్టర్లు వెంకీ అట్లూరి, శేఖర్ కమ్ముల, పూరి జగన్నాథ్, వంశీ పైడిప‌ల్లి, గోపీచంద్ మ‌లినేని వంటి అగ్ర దర్శకులు ఈ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. కోలీవుడ్, బాలివుడ్ అనే తేడా లేకుండా తమిళ, హిందీ పరిశ్రమలకు చెందిన ధనుష్, సల్మాన్ ఖాన్, కార్తీ, సూర్య‌ వంటి ప్రముఖ హీరోలతో భారీ ప్రాజెక్ట్‌లను ప్లాన్ చేస్తున్నారు. ఈ కాంబినేషన్లు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. ఇలా పరభాషా హీరోలతో సినిమాలు చేయడంతో మార్కెట్ పరిధిని విస్తరించుకోవడానికి కూడా ఎంతో దోహదపడుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఈ ప్రాజెక్ట్‌ల ద్వారా తెలుగు దర్శకుల ప్రతిభ ఇతర ఇండస్ట్రీలకు కూడా పరిచయం అవుతుంది. అలాగే ఆయా హీరోల ప్రాంతీయ మార్కెట్‌తో పాటు టాలీవుడ్ మార్కెట్ కూడా కలిపి సినిమా స్థాయిని మరింత పెంచుతుంది.

పాన్-ఇండియా మార్కెట్‌లో సక్సెస్ సాధించాలంటే? భాషలతో సంబంధం లేకుండా సరైన కాంబినేషన్ సెట్ చేసుకోవడం ట్రెండ్‌గా మారింది. తెలుగు దర్శకులు బలమైన కథాకథనాలతో ఇతర భాషా స్టార్స్‌ను డైరెక్ట్ చేస్తుండటం తో ఆయా సినిమాలకు జాతీయ స్థాయిలో విపరీతమైన క్రేజ్ వస్తోంది. ఇది టాలీవుడ్ సత్తాను దేశవ్యాప్తంగా చాటి చెప్పడానికి గొప్ప అవకాశంగా మారుతోంది.

టాలీవుడ్ స్టార్స్ డేట్స్ సమస్యకు చెక్ పెడుతూ తెలుగు దర్శకులు ఇతర భాషా హీరోలతో చేస్తున్న ప్రయోగాలు మంచి ఫ‌లితాలు సాధిస్తున్నాయి. దీంతో ద‌ర్శ‌కుల స‌మ‌యం వృద్దా పోవ‌డం లేదు. తెలుగు హీరోనే కావాల‌ని కూర్చోకుండా ప‌ర భాష‌ల హీరోల కోసం ప్ర‌య‌త్నించి అక్క‌డా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఆ విజ‌యంతో మ‌రింత మంది కొత్త హీరోల‌తో అవ‌కాశాలు అందుకోగ‌ల్గుతున్నారు. ఈ సరికొత్త పాన్-ఇండియా కల్చర్ భవిష్యత్తులో భారతీయ సినిమా రూపురేఖలను మరింతగా మారుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.