ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు మృతి
తెలుగు సినిమా ఇండస్ట్రీ మరో ప్రముఖ దర్శకుడిని కోల్పోయింది. పలు సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకుడిగా పేరు దక్కించుకున్న ఏ ఎస్ రవికుమార్ చౌదరి గుండె పోటుతో మృతి చెందారు.
By: Tupaki Desk | 11 Jun 2025 12:02 PM ISTతెలుగు సినిమా ఇండస్ట్రీ మరో ప్రముఖ దర్శకుడిని కోల్పోయింది. పలు సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకుడిగా పేరు దక్కించుకున్న ఏ ఎస్ రవికుమార్ చౌదరి గుండె పోటుతో మృతి చెందారు. ఆయన మృతి చెందిన విషయాన్ని సన్నిహితులు అధికారికంగా దృవీకరించడంతో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. యంగ్ హీరోలతో పాటు, సీనియర్ హీరోలతో వర్క్ చేసిన అనుభవం ఉన్న ఈయన మృతితో ఇండస్ట్రీలో పలువురు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖులు ఇప్పటికే కొందరు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తే, మరికొందరు ఆయన మృతదేహం ను సందర్శించి సంతాపం తెలుపుతున్నారు.
పలు సినిమాలకు అసిస్టెంట్‌గా వ్యవహరించిన రవి కుమార్ చౌదరి మొదటగా యజ్ఞం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. గోపీచంద్ హీరోగా వచ్చిన యజ్ఞం సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. దర్శకుడిగా మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కావడంతో రవి కుమార్ చౌదరి పేరు మారుమ్రోగింది. ఆ సమయంలోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశాలు దక్కించుకున్నాడు. బాలకృష్ణ తో వీరభద్ర సినిమాను రూపొందించాడు. ఆ సినిమా నిరాశ పరచినా కూడా మెగా హీరో సాయిధరమ్ తేజ్‌తో సినిమాను చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఆ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
సాయి ధరమ్ తేజ్‌తో ఈయన రూపొందించిన పిల్లా నువ్వు లేని జీవితం సినిమా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఆ సినిమా తర్వాత మరోసారి గోపీచంద్ హీరోగా సౌఖ్యం సినిమాను రూపొందించాడు. కానీ ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది. ఆ తర్వాత నితిన్‌తో ఆటాడిస్తా సినిమాను సైతం రూపొందించాడు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌లు పడటంతో రవికుమార్ చౌదరి మెల్ల మెల్లగా ఫేడ్ ఔట్ అవుతూ వచ్చాడు. ఈ మధ్య కాలంలో ఈయన గురించి పెద్దగా వార్తలు ఏమీ రాలేదు. హఠాత్తుగా ఇలా అనారోగ్య సమస్య కారణాలతో ఆసుపత్రిలో జాయిన్ కావడం, ఆ వెంటనే గుండె పోటుతో మృతి చెందడంతో ఇండస్ట్రీ వర్గాల వారు షాక్ అవుతున్నారు.
మంగళవారం రాత్రి ఏ ఎస్ రవికుమార్ చౌదరి కొన్ని కారణాల వల్ల ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు. ఆయన ఒంటరిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆయన్ను సన్నిహితులు ఆసుపత్రిలో జాయిన్ చేశారని సమాచారం అందుతోంది. అక్కడ ఆయన కోలుకుంటున్నట్లు అనిపించినా గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలియజేశారట. ఈ దర్శకుడు చివరగా రాజ్ తరుణ్ తో తిరగబడరా సామి అనే సినిమాను చేశాడు. ఆ సినిమా ప్రమోషన్ సమయంలో చోటు చేసుకున్న వివాదం కారణంగా చాలా మంది ఆయనను తీవ్రంగా విమర్శించారు. ఆయన మరణం పై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.